
‘ఈ పాటికి రఫేల్ యుద్ధ విమానాలు ఉండి ఉంటేనా....!’
సాక్షి, న్యూఢిల్లీ : ‘పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ భూభాగంపై భారత వైమానిక దళం జరిపిన దాడులను ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయి. మన వైమానిక దాడులను అనుమానిస్తూ శత్రు దేశానికి లబ్ధి చేకూర్చేలా మాట్లాడుతున్నాయి’ అని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం నాడు పట్నాలో నిర్వహించిన ఓ సభలో మాట్లాడుతూ విమర్శించారు. దేశం నుంచి ఉగ్రవాదాన్ని తరిమి కొట్టేందుకు తాను ప్రయత్నిస్తుంటే, తననే పదవి నుంచి తప్పించేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని కూడా ఆరోపించారు. ఆయన మాటల్లో నిజం ఎంత ? ప్రతిపక్ష పార్టీలు నిజంగా పాక్‌పై దాడులను రాజకీయం చేస్తున్నాయా ? మోదీ, ఆయన పార్టీ భారతీయ జనతా పార్టీ రాజకీయం చేయడం లేదా ? బాలాకోట్‌పై భారత్ జరిపిన దాడులు గురి తప్పాయని, అక్కడ ఉగ్రవాదులకు ఎలాంటి నష్టం వాటిల్లలేదంటూ ప్రపంచ మీడియా కోడై కూస్తుంటే దాడుల్లో ఎంత నష్టం జరిగిందో చెప్పండి, వాటికి సంబంధించిన సాక్ష్యాధారాలుంటే చూపండంటూ ప్రశ్నించడం రాజకీయం చేయడం అవుతుందా ?
అంతకుముందు రోజు శనివారం నాడు ప్రధాని నరేంద్రమోదీ ‘ఇండియా టుడే’ ఏర్పాటు చేసిన సదస్సులో మాట్లాడుతూ ‘ఈ పాటికి రఫేల్ యుద్ధ విమానాలు ఉండి ఉంటేనా....!’ అంటూ వ్యాఖ్యానించారు. అంటే ఆయన ఉద్దేశం ఏమిటీ ? ‘అంటే రఫేల్ యుద్ధ విమానాలు ఉంటే రఫ్వాడించే వాణ్ణి.... ఉగ్రవాదులను నామరూపాలు లేకుండా చేసే వాడిని’ అని అర్థమా ? లేదా ‘నాటి యూపీఏ ప్రభుత్వం రఫేల్ యుద్ధ విమానాల కొనుగోళ్ల కోసం చర్చల ప్రక్రియను సుదీర్ఘంగా కొనసాగించడం వల్ల నేటికి ఈ విమానాలు భారత్‌కు అందలేక పోయాయన్న ఆందోళన?’ వీటిలో ఏ అర్థాన్ని తీసుకున్నా దాన్ని రాజకీయం చేయడమే అవుతుంది. మోదీ 2015లో కుదుర్చుకున్న రఫేల్ ఒప్పందం ప్రకారం మొదటి రఫేల్ యుద్ధ విమానం వచ్చే సెప్టెంబర్ నెలలో భారత్‌కు చేరాల్సి ఉంది.
పాకిస్థాన్‌లో బాలాకోట్‌పై భారత వైమానిక దళం మెరపు దాడులు జరిపిన రోజునే కర్ణాటకలో బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప మాట్లాడుతూ, బాలాకోట్ దెబ్బతో కర్ణాటకలో బీజేపీకి కనీసం 22 లోక్‌సభ స్థానాలు వస్తాయని చెప్పడం రాజకీయం చేయడం కదా? ఆ మరుసటి రోజే ఎన్నికల ప్రచారంలో ఉన్న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ఉగ్రవాదుల పీచమణచేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్న మోదీనే మరోసారి ప్రధాన మంత్రిగా గెలిపించడంటూ పిలుపునివ్వడం రాజకీయం కాదా ? ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ సైనిక దుస్తుల్లో ఎన్నికల ప్రచారం చేయడం రాజకీయం చేయడం కాదా ? భారత వైమానిక దాడుల్లో ఎంత మంది చనిపోయారో లెక్కతేల్చి చెప్పడం కష్టమంటూ గురువారం నాడు సైనికాధికారులు పునరుద్ఘాటించినప్పటికీ 250 మందికి పైగా చనిపోయారని అమిత్ షా ఆదివారం ప్రకటించడం రాజకీయం కాదా? కశ్మీర్‌లోని ఉడి సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడులు జరిపి మూడేళ్లు అవుతున్నా ఉగ్రవాదుల నిర్మూలనకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోని మోదీ ప్రభుత్వం మూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు ఉన్నప్పుడు ఈ దాడులు జరపడం రాజకీయం కాదా? రాజకీయ ప్రయోజనాల కోసం కాదా ?!?