చిన్నారులపై అత్యాచారానికి ఉరిశిక్షే

Union Cabinet amends POCSO Act to include death penalty - Sakshi

పోక్సో చట్టానికి కేంద్ర కేబినెట్‌ కీలక సవరణలు

చైల్డ్‌ పోర్నోగ్రఫీకి పాల్పడితే భారీ జరిమానా, జైలు శిక్ష

కార్మికుల సంక్షేమం కోసం ఒకే గొడుకు కిందకు 13 చట్టాలు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా చిన్నారులపై జరుగుతున్న నికృష్టపు ఘటనల నేపథ్యంలో.. చిన్నారులను లైంగిక దాడులనుంచి కాపాడే చట్టం–2012 (పోక్సో)కు పలు సవరణలు చేసింది. ఇకపై చిన్నారులపై అత్యాచారానికి పాల్పడే వారికి ఉరిశిక్ష విధించాలని నిర్ణయించింది. ప్రధాని అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో సమావేశమైన కేంద్ర కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ భేటీ వివరాలను కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ వెల్లడించారు. చిన్నారులపై అత్యాచారాలతోపాటు మైనర్లపై లైంగికదాడులకు పాల్పడే వారినీ కఠినంగా శిక్షించాలని ఈ సవరణల్లో పేర్కొన్నట్లు తెలిపారు.

చైల్డ్‌ పోర్నోగ్రఫీని పూర్తిగా అణచివేసేందుకు ఇలాంటివి ప్రోత్సహిస్తున్న వారికి భారీ జరిమానాలతోపాటు జైలు శిక్ష విధించేలా పోక్సో చట్టంలో మార్పులు చేశామన్నారు. కఠినమైన శిక్షల ద్వారానే చిన్నారులపై జరుగుతున్న అకృత్యాలకు అడ్డుకట్ట వేయడంతోపాటు అత్యాచారాలను అదుపుచేసేందుకు వీలవుతుందని కేంద్రం భావిస్తోంది. ఇందుకోసం పోక్సో చట్టంలోని 2,4,5,6,9,14,15,34,42,45 సెక్షన్లను సవరించింది. ప్రధానమంత్రి గ్రామ్‌సడక్‌ యోజన మూడో విడతలో భాగంగా.. గ్రామీణప్రాంతాల్లో అనుసంధానతకోసం 1.25 లక్షల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి కూడా కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

సింగిల్‌ కోడ్‌లోకి 13 కార్మిక చట్టాలు: 13 కేంద్ర కార్మిక చట్టాలను ఒకే కోడ్‌ పరిధిలోకి తెచ్చేందుకు ఉద్దేశించిన బిల్లు (కార్మికుల వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల బిల్లు – 2019)కు  కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం వల్ల కార్మికులకు బీమా కవరేజీ పెరిగేందుకు అవకాశముంటుంది. 10 కన్నా ఎక్కువ మంది ఉద్యోగులున్న సంస్థలకు ఈ కోడ్‌ వర్తిస్తుంది. వాణిజ్యం, వ్యాపారం, తయారీ, సేవా, ఐటీ వంటి అన్ని రంగాల కార్మికులకు ఈ ప్రయోజనాలు అందనున్నాయి.

దీంతోపాటు దేశవ్యాప్తంగా అక్రమ డిపాజిట్లను సేకరించే కార్యకలాపాలను అడ్డుకునేందుకు ఉద్దేశించిన ‘నియంత్రణ లేని డిపాజిట్ల పథకం రద్దు బిల్లు’కు కూడా కేబినెట్‌ ఆమోదం తెలిపింది. క్రమబద్ధీకరించని డిపాజిట్ల పథకం ఆర్డినెన్స్‌–2019 స్థానంలో ఈ బిల్లు అందుబాటులోకి వస్తుంది. ఈ ప్రతిపాదిత బిల్లులో చట్ట విరుద్ధంగా డిపాజిట్లను పెంచినట్లయితే అటువంటి సందర్భాల్లో సదరు వ్యక్తులకు శిక్ష, తిరిగి చెల్లించేందుకు తగిన నిబంధనలున్నాయి.  ఉద్యోగులకు మెరుగైన సేవా ప్రయోజనాలు చేకూర్చేలా రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌కు (ఆర్‌పీఎఫ్‌) ఆర్గనైజ్డ్‌ గ్రూప్‌–ఏ హోదాను కేంద్ర కేబినెట్‌ కల్పించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top