3వ స్థానంలో తెలంగాణ

Telangana Got Third Place For Sustainable Development - Sakshi

సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచీ విడుదల చేసిన నీతిఆయోగ్‌

9వ స్థానం నుంచి మూడో స్థానానికి ఎగబాకిన రాష్ట్రం

ఫ్రంట్‌ రన్నర్‌ కేటగిరీలో నిలిచిన తెలంగాణ..

ఉపాధి, ఆర్థికవృద్ధి, అసమానతల నిర్మూలనలో ముందంజ

ఆకలి తీర్చడంలో..
ఆకలి తీర్చే అంశంలో తెలంగాణ 36 స్కోరుతో 16వ స్థానంలో నిలిచింది. గోవా (76), మిజోరం (75), కేరళ (74) తొలి 3 స్థానా ల్లో ఉన్నాయి. రాష్ట్రంలో 5 ఏళ్ల లోపు వయసు గల చిన్నారుల్లో 29.3% మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. గర్భిణు ల్లో 49.8%మంది రక్తహీనత సమస్యను ఎదుర్కొంటున్నారు. 6–59 నెలల వయసు గల చిన్నారుల్లో 37.8% మంది రక్తహీనత తో, 4 ఏళ్ల లోపు బాలల్లో 30.8 % బరువులోపంతో బాధపడుతున్నారు. 

సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్‌: సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచీలో తెలంగాణ మూడో ర్యాంకును సాధించింది. భారత సుస్థిర అభివృద్ధి లక్ష్యాల(ఎస్‌డీజీ) సూచీ–2019 నివేదికను నీతిఆయోగ్‌ సోమవారం ఇక్కడ విడుదల చేసింది. ఐక్యరాజ్య సమితి రూపొందించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు–2030 అమలు దిశగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పురోగతి ఆధారంగా ఈ నివేదిక రూ పొందించింది. తొలిసారిగా 2018లో ఈ సూచీని రూపొందించిన నీతిఆయోగ్‌.. ఈ సూచీ రాష్ట్రాల మధ్య పోటీతత్వాన్ని పెంచాలని ఆకాంక్షించింది. 2018లో 9వ స్థానంలో ఉన్న తెలంగాణ 2019లో 67 స్కోరుతో మూడో స్థానానికి ఎగబాకింది. ఇక దేశ సగటు స్కోరు 60గా ఉంది.

పేదరిక నిర్మూలనలో..
పేదరిక నిర్మూలనలో 72 స్కోర్‌తో తమిళనాడు నంబర్‌వన్‌గా నిలవగా, 52 స్కోరుతో తెలంగాణ 11వ స్థానంలో నిలిచింది. ఇక రాష్ట్రంలో 66.40% మంది ఏదో ఒక వైద్య బీమా పథకంలో సభ్యులుగా ఉన్నారు. రాష్ట్రంలో 84.40% మంది కి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కింద పని లభిస్తోంది. అర్హులైన వారిలో 12.2% మహిళలకు ప్రసూ తి ప్రయోజనాలు లభిస్తున్నాయి. 1.5% రాష్ట్ర జనా భా కచ్చా గృహా ల్లో నివాసముంటోంది.

రాష్ట్రంలో వైద్యుల కొరత
మంచి ఆరోగ్యం, ప్రజాశ్రేయస్సులో 82 స్కోరుతో కేరళ అగ్రస్థానంలో ఉండగా, తెలంగాణ 66 స్కోరుతో 7వ స్థానంలో నిలిచింది. ఇక రాష్ట్రంలో మాతృత్వ మరణాల రేటు (ఎంఎంఆర్‌) ప్రతి లక్ష మందికి 76గా నమోదైంది. ఆస్పత్రుల్లో ప్రసవాలు 71.8 శాతం జరుగుతున్నాయి. ఐదేళ్లలోపు బాలల మరణాల రేటు ప్రతి 1,000 మందికి 32గా ఉంది. 0–5 ఏళ్ల పిల్లలో టీకాలన్నీ వేయించుకున్న వారు 70.1%ఉన్నారు. ప్రతి లక్ష మందిలో క్షయవ్యాధిగ్రస్తులు 142 మంది ఉన్నారు. ప్రతి 1000 మందిలో కొత్తగా హెచ్‌ఐవీ సోకినవారు 0.26 మంది ఉన్నారు. ప్రతి 10 వేల జనాభాకు 44.5 మంది వైద్యులు, నర్సులుండాల్సి ఉండగా, తెలంగాణలో 11 మంది మాత్రమే ఉన్నారు.

ఉన్నత విద్యలో ప్రవేశాలు అంతంతే..
నాణ్యమైన విద్యలో హిమాచల్‌ప్రదేశ్, కేరళ తొలి 2 స్థానాల్లో ఉండగా.. తెలంగాణ 9వ ర్యాంకు సాధించింది. 1–10వ తరగతి వరకు ప్రవేశాల రేటు తెలంగాణలో 82.54% ఉంది. ప్రాథమికోన్నత విద్య స్థాయి లో 22.49% డ్రాపౌట్స్‌ నమోదయ్యాయి. ఇక 18 నుంచి 25 ఏళ్ల మధ్య వారిలో కేవలం 36.2 % మంది ఉన్నత విద్య ప్రవేశాలు పొందుతున్నారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యను బోధించేవారిలో 46.95% మాత్రమే సుశిక్షితులున్నారు.

16 లక్ష్యాలు.. 2011 నుంచి డేటా
2011 జనగణనను, నాలుగైదేళ్ల క్రితం నుంచి 2019 వరకు గల గణాంకాలను ఆధారంగా దాదాపు 62 అంశాలను పరిగణనలోకి తీసుకుని 16 లక్ష్యాలకు స్కోరు కేటాయించారు. కేంద్ర గణాంకాలు, పథక అమలు శాఖ, గ్లోబల్‌ గ్రీన్‌ గ్రోత్‌ ఇన్‌స్టిట్యూట్, ఐక్యరాజ్యసమితి సహకారంతో నీతిఆయోగ్‌ ఈ సూచిని రూపొందిం చింది. వివిధ స్కోర్ల ఆధారంగా 4 కేటగిరీ లుగా రాష్ట్రాలను విభజించింది. 0 నుంచి 49 స్కోరు సాధించిన రాష్ట్రాలను ఆశావహులు(ఆస్పిరెంట్‌), 50 నుంచి 64 స్కోరు సాధించిన రాష్ట్రాలను క్రియాశీలురు (పర్‌ఫార్మర్‌), 65 నుంచి 99 స్కోరు సాధించిన రాష్ట్రాలను ముందు వరస (ఫ్రంట్‌ రన్నర్‌)గా, 100 స్కోరు సాధించిన రాష్ట్రాలను సాధకులు (అచీవర్‌)గా విభజించింది. 2018లో కేరళ, హిమాచల్‌ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు మాత్రమే ఫ్రంట్‌రన్నర్‌లో నిలిచాయి. ఈసారి 8 రాష్ట్రాలు ఫ్రంట్‌ రన్నర్‌ కేటగిరీలో చోటు సాధించాయి. వీటిలో తెలంగాణతో పాటు కర్ణాటక, సిక్కిం, గోవా కూడా ఉన్నాయి. కేరళ (70) మొదటిస్థానంలో, హిమాచల్‌ ప్రదేశ్‌ (60) రెండోస్థానంలో నిలిచింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top