
మద్య నిషేధానికి ఓట్లు రాలుతాయా?
మద్యాన్ని నిషేధిస్తే ఓట్లు రాలుతాయా? అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో చర్చోపచర్చలకు తెరలేపిన హాట్ టాపిక్ ఇదే!
న్యూఢిల్లీ: మద్యాన్ని నిషేధిస్తే ఓట్లు రాలుతాయా? అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో చర్చోపచర్చలకు తెరలేపిన హాట్ టాపిక్ ఇదే! ఇప్పటికే లిక్కర్ బార్లను నిషేధించి బీరు, వైన్ లాంటి డ్రింకులను అనుమతించిన కేరళలోని యూడీఎఫ్ ప్రభుత్వం మద్యం నిషేధం మహిళల ప్రశంలను అందుకుంటుందని, ఓట్లను రాలుస్తుందని భావిస్తోంది. ప్రతిపక్ష ఎల్‌డీఎఫ్ మాత్రం ఈ వాదనతో విభేదిస్తోంది. సంపూర్ణ మద్య నిషేధం ఎప్పటికీ విజయవంతం కాలేదని, మద్యాన్ని నిషేధించడంకన్నా మద్యాన్ని మాన్పించేలా ప్రజల్లో చైతన్యం తీసుకరావడమే ఉత్తమ మార్గమని ఎల్‌డీఎఫ్ భావిస్తోంది.
మహిళల మాటలను మన్నించి మద్యాన్ని నిషేధిస్తానని హామీ ఇచ్చినందునే బీహార్‌లో నితీష్ కుమార్ ప్రభుత్వానికి మహిళలు మళ్లీ పట్టంగట్టారని కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాండీ, ఆయన కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అందుకనే ఆయన క్రమంగా పదేళ్లలో సంపూర్ణ నిషేధాన్ని అమలు చేస్తానని ఓటర్లకు హామీ ఇచ్చారు. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఇదే రీతిన తమిళనాడులో కూడా చర్చలు కొనసాగుతున్నాయి. పాలక, ప్రతిపక్షాలు పరస్పర భిన్నంగా మాట్లాడుతున్నాయి. ఒకప్పుడు ఓట్లు వేయించుకునేందుకు మద్యాన్ని పారించిన రాజకీయ పెద్దలే ఇప్పుడు అవే ఓట్ల కోసం నిషేధం బాట పట్టడం విశేషం.
రాజకీయ నేతల అభిప్రాయలను పక్కన పెడితే అసలు ఓటర్లు ఏమనుకుంటున్నారు? మద్యం నిషేధానికి ఓటేస్తారా? వివిధ సంఘాల ద్వారా ఓటర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న సామాజిక కార్యకర్తలు, పర్యావరణ వేత్తలు, సామాజిక విశ్లేషకులు ఈ ప్రాతిపదికన ఓట్లు వేయరని చెబుతున్నారు. అయితే మద్యం నిషేధం మంచిదా, కాదా ? అన్న విషయంలో మాత్రం వారి మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయి. కేరళలో మాత్రం మద్య నిషేధం ప్రభావం ఉండదని, రాష్ట్రాన్ని వేధిస్తున్న సమస్యలేమిటో వారికి తెలుసునని రాజకీయ విశ్లేషకులు ఎన్‌ఎం పియర్సన్ అన్నారు. ఎన్నికల షేడ్యూల్ వెలువడక ముందే వారు ఎవరికి ఓటేయాలో నిర్ణయించుకొని ఉంటారని ఆయన చెప్పారు.
మద్యనిషేధానికి ఓట్లు పడడం, పడకపోవడం అనేది ప్రభుత్వ చిత్తశుద్ధిపై ఆధారపడి ఉంటుందని సైరో-మలబార్ చర్చి అధికార ప్రతినిధి ఫాదర్ తెలక్కత్ అన్నారు. మద్యంపై సంపూర్ణ నిషేధం విధించడమా, ప్రజలచేత తాగుడు మాన్పించడమా ? అన్న ప్రశ్న ముఖ్యం కాదని, ఏ విధాన్నైనా అమలు చేయడం పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఎంతన్నదే ప్రశ్న అని ఆయన వ్యాఖ్యానించారు. కారణం ఏదైనా మద్యంపై ఏదోరకమైన నియంత్రణ ఉండడమే మంచిదని, ఎందుకంటే కేరళలో మద్యం అనేది సామాజిక సమస్యగా మారిందని ప్రముఖ సామాజిక కార్యకర్త అజిత అభిప్రాయపడ్డారు.
మద్య నిషేధం దేశంలో ఎక్కడా విజయం సాధించలేదని, మద్య నిషేధం అమల్లో ఉన్న మిజోరమ్, మణిపూర్, నాగాలాండ్ ప్రభుత్వాలు క్రమంగా నిషేధాన్ని ఎత్తివేస్తున్నాయని, గుజరాత్‌లో కూడా నిషేధం సక్రమంగా అమలవడం లేదని, అక్కడ లిక్కర్ మాఫియా రంగప్రవేశం చేసిందని మద్యాన్ని స్వచ్ఛందంగా మానేయాలని వాదించే వర్గాలు చెబుతున్నాయి. అసలు ఎన్నికల హామీలనే రాజకీయ నాయకులు సీరియస్‌గా తీసుకోరని, ఎన్నికలు కాగానే వాటిని మరచిపోతారని, వారి హామీలపై ఒత్తిడి తేవాల్సింది మళ్లీ ప్రజలేనని పర్యావరణవేత్త ఎంకే ప్రసాద్ అభిప్రాయపడ్డారు.
మద్యంతాగి భార్యలను వేధిస్తున్నారనడం ఈ రోజుల్లో సరైనది కాదని, మద్యంతాగి వేధించే వారిని ఎలా హ్యాండిల్ చేయాలో నేటి మహిళలకు పూర్తి అవగాహన ఉందని రచయిత్రి భట్టాతిరి అభిప్రాయపడ్డారు. గృహ హింసకు పాల్పడితే పోలీసులను ఆశ్రయించే ధైర్యం నేటి మహిళకు ఉందని ఆమె చెప్పారు.