అభ్యర్థులు అవసరమైన వివరాలను వెల్లడించకపోతే ఎన్నికల్లో పోటీ చేయడానికి అనుమతించకూడదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ: అభ్యర్థులు అవసరమైన వివరాలను వెల్లడించకపోతే ఎన్నికల్లో పోటీ చేయడానికి అనుమతించకూడదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. వారి నామినేషన్లను తిరస్కరించే అధికారం రిటర్నింగ్ అధికారికి ఉందని శుక్రవారం ఓ తీర్పులో ప్రకటించింది. అభ్యర్థులు తమ ఆస్తులు, నేర చరిత్ర , విద్యార్హత వంటి వివరాలను దాచిపెట్టడం ఓటర్లు తమ కాబోయే ప్రజాప్రతినిధి ఎలాంటివాడో తెలుసుకోవాలకునే హక్కును ఉల్లంఘించడమేనని చీఫ్ జస్టిస్ పి.సదాశివం నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.
కోరిన వివరాలను అభ్యర్థులు ఇవ్వకపోయినా, పత్రాల్లోని ఖాళీలను పూరించాలని గుర్తుచేసినప్పటికీ పాటించకపోయినా వారి పత్రాలను తిరస్కరించే అధికారం రిటర్నింగ్ అధికారికి ఉందని పేర్కొంది. అయితే ఖాళీలను పూరించకుండా వదిలేసే అభ్యర్థులపై చర్యలు తీసుకోవాలని కేంద్రం చేసిన విజ్ఞప్తిని మాత్రం కోర్టు తోసిపుచ్చింది. నామినేషన్లు తిరస్కరించే అధికారాన్ని జాగ్రత్తగా వాడుకోవాల్సి ఉంటుందని సూచించింది. అభ్యర్థులు కీలకమైన వివరాల నమోదుకు ఉద్దేశించిన ఖాళీలను పూరించడం లేదని దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని ‘రిసర్జన్స్ ఇండియా’ అనే పౌరహక్కుల సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించి కోర్టు ఈ తీర్పు చెప్పింది.