దేశ రక్షణలో రాజీ లేదు!

PM Narendra Modi addresses NCC Rally in New Delhi  - Sakshi

దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రక్షణ ప్రాజెక్టులకు మోక్షం

రఫేల్‌ వివాదంపై స్పందించిన ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: భారత్‌ శాంతికాముక దేశమే అయినా.. దేశ రక్షణ విషయంలో రాజీ పడబోదని ప్రధాని మోదీ తేల్చి చెప్పారు. యుద్ధ విమానాలు, సాయుధ దళాల ఆధునీకరణలకు సంబంధించి దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రక్షణ రంగ ప్రాజెక్టులకు తాము అధికారంలోకి వచ్చాకే మోక్షం వచ్చిందని మోదీ గుర్తు చేశారు. దేశీయంగా క్షిపణులు, యుద్ధ ట్యాంకులు, హెలికాప్టర్లను ఉత్పత్తి చేస్తున్నామన్నారు. రఫేల్‌ యుద్ధ విమానాల ఒప్పందానికి సంబంధించి మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ ఆరోపణల నేపథ్యంలో మోదీ స్పందించారు.

తాను స్వప్నిస్తున్న ‘నవ భారత్‌’లో అవినీతికి చోటు లేదన్న మోదీ.. అవినీతికి పాల్పడిన వారిని ఎంతవారైనా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఎన్‌సీసీ క్యాడెట్లను ఉద్దేశించి సోమవారం ఆయన ప్రసంగించారు. ‘మీ భవిష్యత్తును నిర్దేశించేవి మీ కుటుంబం, మీ ఆర్థిక నేపథ్యం కాదు.. మీ పట్టుదల, మీ నైపుణ్యం, మీ ఆత్మవిశ్వాసమే బంగారు భవితకు బాటలు వేస్తుంది’ అని అన్నారు. వీఐపీ సంస్కృతి స్థానంలో తన ప్రభుత్వం ఈపీఐ(ఎవ్రీ పర్సన్‌ ఈజ్‌ ఇంపార్టెంట్‌– ప్రతీ వ్యక్తి ప్రముఖుడే) సంస్కృతిని చేర్చిందన్నారు. 

గ్రామాల నుంచి వచ్చి ఎన్‌సీసీలో శిక్షణ పొందుతున్న వారిని ప్రధాని ఈ సందర్భంగా అభినందించారు. తమ ప్రభుత్వం గత నాలుగున్నరేళ్లుగా రక్షణ శాఖలో చేపట్టిన ప్రాజెక్టులన్నీ భవిష్యత్‌లో దేశ భద్రతకు తోడ్పడతాయని ధీమా వ్యక్తం చేశారు. అప్పటివరకు దేశ ప్రజలు తమపై భరోసా ఉంచాలన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని.. రాబోయే ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో ఓటు వేసేలా యువతను ప్రోత్సహించాలని వారికి సూచించారు.

ఇక తమ ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమానికి యువత భారీగా మద్దతు ఇస్తున్నట్లు ప్రధాని తెలిపారు. లింగ వివక్షకు తావీయకుండా స్త్రీ, పురుషులిద్దరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని మోదీ ఉద్ఘాటించారు. మహిళలను యుద్ధ విమానాలకు పైలట్‌లుగా నియమించామని, నేవీలోని మహిళా దళాలు ప్రపంచాన్ని చుట్టివచ్చాయని తెలిపారు. మిలటరీ సహా పలు కీలక విభాగాల్లో మహిళలను భాగస్వామ్యం చేసేలా తమ ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.  

బెంగాల్‌లో ప్రధాని ర్యాలీ ప్రాంతం మార్పు
పశ్చిమ బెంగాల్‌లో ఫిబ్రవరి 2న ప్రధాని మోదీ పాల్గొననున్న బహిరంగ సభ స్థలాన్ని మార్చినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ వెల్లడించారు. ముందుగా అనుకున్నట్లు నార్త్‌ 24 పరగణా జిల్లాలోని థాకూర్‌నగర్‌లో కాకుండా దానికి సమీపంలోని మరో స్థలంలో ర్యాలీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top