సోషల్‌ మీడియాకు ప్రధాని మోదీ సైన్‌ ఆఫ్‌

PM Modi Hands Over Social Media Accounts To Seven Women Achievers - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సోషల్‌ మీడియాకు ఈ రోజు గుడ్‌బై చెప్పేశారు. ఆయన గతంలో చెప్పినట్టు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక్కరోజు తన సోషల్ మీడియా ఖాతాల నుంచి వైదొలిగారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నారీ శక్తి సాధించిన విజయాలకు, వారి స్ఫూర్తికి నా సెల్యూట్. కొన్ని రోజుల క్రితం నేను చెప్పినట్టు ఈ రోజు మొత్తం నేను సోషల్ మీడియా అకౌంట్ల నుంచి సైన్ ఆఫ్ అవుతున్నా. అయితే, ఏడుగురు మహిళల విజయగాథలను నా సోషల్‌ మీడియా అకౌంట్ల ద్వారా షేర్‌ చేస్తాను.’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

కాగా, సామాజిక మాధ్యమాల్లో అనునిత్యం చురుగ్గా ఉండే మోదీ.. సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటానని ఇటీవల చేసిన ట్వీట్‌ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సోషల్‌ మీడియా నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నారని పుకార్లు వచ్చాయి. అయితే ఉమెన్స్‌డే సందర్భంగా ఒక్క రోజు మాత్రమే సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటానని మోదీ మరో ట్వీట్‌ చేసి రకరకాల ఊహాగానాలకు తెరదించారు.

తన సోషల్‌ మీడియా ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్లను అందరిలోనూ స్ఫూర్తిని నింపే మహిళలకి ఆదివారం అంకితం ఇస్తున్నానని స్పష్టం చేశారు. ‘ఈ మహిళా దినోత్సవాన్ని (మార్చి 8) పురస్కరించుకొని నా సోషల్‌ మీడియా ఖాతాలను ఏ మహిళల జీవితాలైతే అందరిలోనూ స్ఫూర్తిని నింపుతాయో, వారు చేసే పనులు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తాయో వారికి అంకితం ఇస్తున్నాను. అలాంటి మహిళల నిజ జీవిత గాథలు లక్షలాది మందికి ప్రేరణగా నిలుస్తాయి’ అని ఇటీవల ట్వీట్‌ చేశారు.‘మీరు అలాంటి మహిళ అయినా, లేదంటే అలాంటి స్ఫూర్తిని రగిల్చే మహిళల గురించి మీకు తెలిసినా వారి జీవిత గాథల్ని # SheInspiresUs అన్న హ్యాష్‌ ట్యాగ్‌తో షేర్‌ చేయండి’ అని ప్రధాని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో చాలామంది మహిళలను వారి విజయగాథల్ని మోదీకి షేర్‌ చేశారు. వాటిలో ఏడుగురి మహిళల విజయగాథలను నేడు తన సోషల్‌ మీడియా అకౌంట్ల ద్వారా షేర్‌ చేయనున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top