
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ మంట అంతకంతకూ పెరుగుతూనే ఉంది. పదమూడు రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల కొనసాగుతూనే ఉంది. శుక్రవారం కూడా పెట్రోల్ ధర లీటరుకి 56 పైసలు పెరిగింది. డీజిల్ ధర లీటరుకి 63 పైసలు పెరిగింది. రెండు వారాలు పూర్తికాకుండానే పెట్రోల్ ధర రూ.7.11 పైసలు, డీజిల్ ధర రూ.7.67 పైసలు పెరిగింది. ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు వెల్లడించిన ధరలను బట్టి ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.77.81 నుంచి రూ.78.37కు పెరిగింది. డీజిల్ ధర లీటరుకి రూ.76.43 నుంచి రూ.77.06కు ఎగబాకింది. జూన్ 7వ తేదీనుంచి కంపెనీలు ధరలు సవరిస్తున్నాయి. అప్పటి నుంచి ధరలు పెరగడం వరసగా ఇది 13వ రోజు. అంతర్జాతీయంగా చమురు ధరలు పుంజుకోవడవంతో ఆయిల్ కంపెనీలు వాటికనుగుణంగా రిటైల్ ధరలను సవరిస్తున్నాయి.