‘ఓల్డ్‌’ భారతం!

Old People Population Increasing In India - Sakshi

వృద్ధులు పెరుగుతున్నారు.. పిల్లల సంఖ్య తగ్గుతోంది.. వర్కింగ్‌ ఏజ్‌ గ్రూప్‌లో పెరుగుదల

దేశవ్యాప్తంగా సంతానోత్పత్తి రేటు (టీఎఫ్‌ఆర్‌) తగ్గుముఖం పడుతుండడం సరికొత్త ఆందోళనకు తెరలేపింది. తాజామార్పుల ద్వారా జనాభాలో చిన్నారులు, యువత శాతం తగ్గుముఖం పట్టి.. వృద్ధుల సంఖ్య రెట్టింపు కానుంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే సంబంధిత గణాంకాలను విశ్లేషించింది. 2018–19 ఆర్థిక సర్వే విశ్లేషించిన వివరాల ప్రకారం.. వర్కింగ్‌ ఏజ్‌ గ్రూప్‌ మొత్తం జనాభాలో 59% వరకూ ఉండనుంది. టీఎఫ్‌ఆర్‌ తగ్గుతుండడంతో మొత్తం జనాభాలో 0–19 ఏళ్ల వయసు మధ్య గల జనాభా తగ్గుతుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. 2011లో ఈ గ్రూపులో ఉన్న జనాభా 41% ఉండగా.. 2041 నాటికి 25% పడిపోతుందని పేర్కొంది. అలాగే 60 ఏళ్ల పైబడిన జనాభా గ్రూపు పెరుగుతుందని వివరించింది. 2011లో వీరు 8.6% ఉండగా.. 2041 నాటికి 16 శాతానికి పెరగనుంది. 20–59 మధ్య ఉండే వర్కింగ్‌ గ్రూప్‌ జనాభా 59 శాతంగా ఉంటుందని అంచనా వేసింది.     – సాక్షి, న్యూఢిల్లీ

వయసు వారీ జనాభా మార్పులపై ఆర్థిక సర్వే వెలువరించిన ముఖ్యాంశాలు

  •  తెలంగాణలో 0–19 మధ్య వయస్సు గల గ్రూపులో 2011లో 37% మంది ఉండగా.. 2021 నాటికి 30%, 2031 నాటికి 26%, 2041 నాటికి 23% శాతానికి తగ్గనున్నారు.  
  •  అలాగే 20–59 మధ్య వయసున్న గ్రూపులో 2011లో 53.8% మంది ఉండగా.. 2021 నాటికి 59.4 శాతానికి, 2031 నాటికి 60.5 శాతానికి పెరగనున్నారు. 2041 నాటికి 58.8 శాతానికి తగ్గనున్నారు. ఇక 60 ఏళ్ల పైబడిన వారు మొత్తం జనాభాలో 2011లో 9.2% ఉండగా.. 2021 నాటికి 10.6 శాతానికి, 2031 నాటికి 13.5 శాతానికి, 2041 నాటికి 18.2 శాతానికి పెరగనున్నారు.
  • ఆంధ్రప్రదేశ్‌లో 0–19 మధ్య వయసున్న గ్రూపులో 2011లో 34.8% మంది ఉండగా.. 2041 నాటికి 21.4 శాతానికి తగ్గనున్నారు. అలాగే 20–59 మధ్య వయస్సు గల గ్రూపులో 2011లో 55.1 శాతం మంది ఉండగా.. 2041 నాటికి 58.6 శాతానికి తగ్గనున్నారు. ఇక 60 ఏళ్ల పైబడిన 2011లో 10.1% ఉండగా.. 2041 నాటికి 20 శాతానికి పెరగనున్నారు.

గణనీయంగా తగ్గుతున్న జనాభా వృద్ధి రేటు

  • దేశవ్యాప్తంగా జనాభా వృద్ధి రేటు గణనీయంగా తగ్గింది. దక్షిణాది రాష్ట్రాలతో పాటు పశ్చిమ బెంగాల్, పంజాబ్, ఒడిశా, మహారాష్ట్ర, అసోం, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో వృద్ధి రేటు 1% కంటే తక్కువగా ఉంది.
  • 2031–41 నాటికి ఆంధ్రప్రదేశ్‌ జనాభా వృద్ధి రేటు సున్నాగా ఉంటుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. తెలంగాణ సహా కర్ణాటక, కేరళ, హిమాచల్‌ ప్రదేశ్, బెంగాల్, పంజాబ్, మహారాష్ట్రల్లో ఈ వృద్ధి రేటు 0.1–0.2గా ఉంటుందని పేర్కొంది. ఇక తమిళనాడులో వృద్ధిరేటు 2031–41 నాటికి తిరోగమనదిశలో ఉంటుందని పేర్కొంది.
  • వార్షిక జనాభా వృద్ధిరేటు దేశవ్యాప్తంగా 2001–11 మధ్య 1.77% ఉండగా, 2011–2021 మధ్య 1.12%, 2021–31 మధ్య 0.72%, 2031–41 మధ్య 0.46% ఉంటుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది.
  • తెలంగాణలో వార్షిక జనాభా వృద్ధి రేటు 2011–2021 మధ్య 0.80%, 2021–31 మధ్య 0.53 శాతం, 2031–41 మధ్య 0.22% ఉంటుందని ఆర్థికసర్వే అంచనా వేసింది. ఆంధప్రదేశ్‌లో ఈ వార్షిక జనాభా వృద్ధి రేటు 2001–11 మధ్య 1.10% ఉండగా, 2031–41 మధ్య 0.02% ఉంటుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది.
  •  మొత్తం సంతానోత్పత్తి రేటు (టోటల్‌ ఫర్టిలిటీ రేటు–టీఎఫ్‌ఆర్‌) తెలంగాణలో 2001 నాటికి ఇది 2.3శాతంగా ఉండగా.. 2011కు 1.8శాతానికి, 2017కు 1.6 శాతానికి పడిపోయింది. 2021 నాటికి 1.6%, 2031 నాటికి 1.6%, 2041కి 1.6% శాతంగా ఉంటుందని ఎకనమిక్‌ సర్వే అంచనా వేసింది. ఏపీలో 2001 నాటికి ఇది 2.3 శాతంగా ఉండగా.. 2041కి 1.5 శాతంగా ఉంటుందని పేర్కొంది.

లింగ నిష్పత్తిలో వృద్ధి..
బేటీ బచావో బేటీ పఢావో పథకం ప్రారంభించిన తరువాత ఆంధ్రప్రదేశ్‌ సహా పలు పెద్ద రాష్ట్రాల్లో లింగ నిష్పత్తి పెరిగింది. అంతకుముందు 2001 నుంచి 2011 వరకు లింగ నిష్పత్తి తగ్గగా.. ఈ పథకం ప్రారంభమయ్యాక ఈ నిష్పత్తిలో మార్పు వచ్చింది. 2015–16లో ఏపీలో లింగ నిష్పత్తి 873 నుంచి 901 మధ్య ఉండగా.. 2018–19 నాటికి 930–980 నమోదైంది. ముఖ్యంగా వైఎస్సార్‌ జిల్లాలో 40 పాయింట్ల మేర వృద్ధి చెందింది. తెలంగాణలో కూడా లింగ నిష్పత్తిలో సానుకూల మార్పు కనిపించింది.

సర్వీస్‌ సెక్టార్‌లో తెలంగాణ టాప్‌
సేవలరంగంలో వృద్ధి చూపించడంలో తెలంగాణ రాష్ట్రం దేశవ్యాప్తంగా అగ్రగామిగా నిలిచింది. గ్రాస్‌ స్టేట్‌ వ్యాల్యూ యాడెడ్‌ (జీఎస్‌వీఏ)లో సర్వీస్‌ సెక్టార్‌ వాటా 50% కంటే అధికంగా ఉన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో తెలంగాణ ముందంజలో నిలిచింది. రాష్ట్రాల వారీగా 3వ స్థానంలో, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వారీగా ఆరోస్థానం సంపాదించింది. ఆర్థికసర్వే విశ్లేషణ ప్రకారం తెలంగాణలో 2017–18లో మొత్తం సర్వీస్‌ సెక్టార్‌ వాటా 63.2% కాగా.. వృద్ధిరేటు 10.7% (2013–17 సగటు)గా ఉంది. దేశవ్యాప్తంగా ఇదే అత్యధిక వృద్ధిరేటు కావడం విశేషం. తదుపరి కర్ణాటక, హరియాణా 10.5% వృద్ధి రేటు కనబరిచాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌ జీఎస్‌వీఏలో సర్వీస్‌ సెక్టార్‌ వాటా కేవలం 42.7% మాత్రమే కాగా.. వృద్ధి రేటు 9.2 శాతంగా ఉంది. రాష్ట్రాల వారీగా చూస్తే సర్వీస్‌ సెక్టార్‌లో ఆంధ్రప్రదేశ్‌ 21వ స్థానంలో నిలిచింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి చూస్తే 25వ స్థానంలో నిలిచింది.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top