ముంచుకొస్తున్న తుపాను : పలు విమానాలు రద్దు

Nisarga Cyclone : IndiGo Vistara SpiceJet Mumbai flights  cancel - Sakshi

ఇండిగో,  విస్తారా, స్పైస్‌జెట్  పలు విమానాలు రద్దు

 ఆయా ప్రయాణీకులకు సమాచారం

సాక్షి, ముంబై: నిసర్గ తుపాను పెనువేగంతో  ముంబై తీరంవైపు దూసుకొస్తోందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో దేశీయ విమానయాన సంస్థలు అప్రమత్తమయ్యాయి. బుధవారం దేశ ఆర్థిక రాజధాని ముంబైకి రాకపోకలను సాగించే విమానాలను రద్దు చేశాయి.  ఇండిగో,  విస్తారా, స్పైస్‌జెట్  సంస్థలు పలు విమానాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించాయి. ఈ  సమాచారాన్ని సంబంధిత ప్రయాణీకులకు అందించామనీ,  దీన్ని దృష్టిలో ఉంచుకుని వారు అప్రమత్తంగా కావాలని  సూచించాయి. (తీవ్ర తుఫానుగా ‘నిసర్గ’)

ఇండిగో  17 విమానాలను రద్దు చేసింది. . ముంబై నుండి చండీగఢ్, రాంచీ పాట్నాకు కేవలం మూడు విమానాలను మాత్రమే నడుపుతున్నట్టు ఇండిగో పేర్కొంది. ప్రత్యామ్నాయ విమానంలో తిరిగి బుక్ చేసుకునే అవకాశం లేదా క్రెడిట్  సౌకర్యాన్ని అందివ్వనున్నామని ఇండిగో మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.

తుపాను కారణంగా తమ  సేవలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని విస్తారా ప్రకటించింది. ప్రధానంగా ముంబై, గోవా మధ్య విమానాలను రద్దు చేసినట్టు  తెలిపింది. మరిన్ని వివరాలకు విస్తారా అధికారిక వెబ్ సైట్ ను గానీ,  9289228888 నంబరుగానీ సంప్రదించాలని ట్వీట్ చేసింది. అలాగే ముంబై నుంచి , ఢిల్లీ కోల్‌కతాకు వెళ్లే విమానాలను కూడా బుధవారం రద్దు చేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఎయిరిండియా ఉదయం విమానాలను రీషెడ్యూల్ చేస్తోంది. అలాగే విమాన షెడ్యూల్‌లో ఏదైనా రద్దు, మార్పులను ఇ-మెయిల్స్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తామని స్పైస్‌జెట్ తెలిపింది. కాగా కరోనా వైరస్ , లాక్ డౌన్ కారణంగా పూర్తిగా నిలిచిపోయిన దేశీయ విమాన  ప్రయాణాలకు ఆంక్షల సడలింపుల నేపథ్యంలో ఇటీవల  అనుమతి లభించించి. మళ్లీ ఇంతలోనే నిసర్గ తుపాను రూపంలో  అంతరాయం ఏర్పడింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top