ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం-2014లో పొందుపరిచిన ప్రయోజనాల అమలుకు కేంద్రంలో కదలిక మొదలైంది.
* తాజా స్థితి తెలుసుకున్న వాణిజ్య మంత్రి నిర్మల
* ఆర్థిక మంత్రికి వివరాలు అందజేత
* చట్టంలో చెప్పినవన్నీ కేంద్రం చేస్తుంది: పూసపాటి, చౌదరి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం-2014లో పొందుపరిచిన ప్రయోజనాల అమలుకు కేంద్రంలో కదలిక మొదలైంది. చట్టంలో పొందుపరిచిన ప్రయోజనాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసిన ప్రతిపాదనలన్నింటిపై చర్చించేందుకు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం ఇక్కడి తన కార్యాలయంలో ఒక సమావేశం ఏర్పాటుచేశారు. కేంద్ర పౌరవిమానయాన మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు, కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖపట్నం ఎంపీ కంభంపాటి హరిబాబు ఈ సమావేశానికి హాజరయ్యారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించడం, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, పన్నుల రాయితీలు, ప్రోత్సాహకాలు, ద్రవ్యజవాబుదారీ బడ్జెట్ నిర్వహణ(ఎఫ్‌ఆర్‌బీఎం) చట్ట నిబంధనలను సడలించడం వంటి అంశాలపై చర్చ జరిగింది. ఈ అంశాలన్నింటి నీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి వివరిస్తానని చెప్పిన నిర్మలా సీతారామన్.. ఈమేరకు బుధవారం సాయంత్రమే అరుణ్‌జైట్లీని కలిసి నివేదిక ఇచ్చారు.
అన్ని హామీలూ అమలుచేస్తుంది: అశోక్
విభజన చట్టంలో పొందుపరిచిన అన్ని అంశాలనూ కేంద్రం అమలుచేస్తుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌తో సమావేశం అనంతరం ఆయన మాట్లాడారు. కేంద్ర సహాయ మంత్రి సుజనా చౌదరి మాట్లాడుతూ మళ్లీ 17, 18, 19 తేదీల్లో సమావేశాలు జరుగుతాయన్నారు.