సరిహద్దులో పేట్రేగిన పాక్‌

nearly 100 villages deserted as thousands flee Pakistan shelling - Sakshi

కాల్పుల్లో ఐదుగురు పౌరుల మృతి

సరిహద్దు గ్రామాల నుంచి 76 వేల మంది వలస

జమ్మూ  / ఆర్నియా / శ్రీనగర్‌: కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్తాన్‌ మరోసారి తూట్లు పొడిచింది.అంతర్జాతీయ సరిహద్దు(ఐబీ) వెంట జమ్మూకశ్మీర్‌లోని  గ్రామాలు, బీఎస్‌ఎఫ్‌ ఔట్‌పోస్టులు లక్ష్యంగా పాక్‌ రేంజర్లు బుధవారం మోర్టార్లు, భారీ ఆయుధాలతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఐదుగురు పౌరులు ప్రాణాలు కోల్పోగా, మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆర్‌ఎస్‌ పురా, ఆర్నియా, బిష్‌నాహ్, రామ్‌గఢ్, సాంబా సెక్టార్లలో కొన్నిచోట్ల మంగళవారం అర్థరాత్రి నుంచే పాక్‌ బలగాలు కాల్పులు ప్రారంభించాయని పోలీస్‌ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ కాల్పులు క్రమంగా మిగతా సెక్టార్లకూ విస్తరించాయన్నారు.

పాక్‌ కాల్పుల నేపథ్యంలో ప్రజలంతా సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోవడంతో ఆర్నియా పట్టణం నిర్మానుష్యంగా మారిపోయిందన్నారు. ఆర్నియా పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన 76,000 మందికి పైగా ప్రజలు ప్రాణ భయంతో సురక్షిత ప్రాంతానికి తరలివెళ్లారన్నారు. మరోవైపు పాక్‌ కాల్పుల మోతపై బిషన్‌సింగ్‌(78) అనే స్థానికుడు స్పందిస్తూ.. ‘1971 తర్వాత ఇంత భారీస్థాయిలో షెల్లింగ్‌ను నేనెప్పుడూ చూడలేదు. వెంటనే పాకిస్తాన్‌తో యుద్ధం చేసి ఈ సమస్యలన్నింటిని ఒకేసారి పరిష్కరించాలని ప్రధాని నరేంద్ర మోదీని మేం డిమాండ్‌ చేస్తున్నాం’ అని చెప్పారు. మరోవైపు అనంతనాగ్‌ జిల్లాలో గస్తీలో ఉన్న బలగాలపై ఉగ్రవాదులు గ్రెనేడ్‌ను విసిరి పరారయ్యారు. ఈ ఘటనలో 10 మంది పౌరులు గాయపడ్డారు.  
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top