
ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని పటిష్ట పర్చాలి
ఏపీ, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపుల పర్వం యథేచ్ఛగా కొనసాగుతున్న నేపథ్యంలో ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తక్షణమే
‘సాక్షి’తో ఎన్సీపీ అధినేత శరద్ పవార్
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపుల పర్వం యథేచ్ఛగా కొనసాగుతున్న నేపథ్యంలో ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తక్షణమే పటిష్ట పర్చాల్సిన అవసరం ఉందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ చెప్పారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ ప్రజాప్రతినిధుల బృందం మంగళవారం ఢిల్లీలో శరద్ పవార్‌ను కలుసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో అధికార టీడీపీ రకరకాల ప్రలోభాలతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న తీరును వివరించింది. ఈ సమావేశం అనంతరం శరద్ పవార్ ‘సాక్షి’తో మాట్లాడారు.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తమతో సమావేశమయ్యారని చెప్పారు. ఏపీలో కొనసాగుతున్న పార్టీ ఫిరాయింపుల తీరుతోపాటు పలు అంశాలను వివరించారని తెలిపారు. ఫిరాయింపులను ప్రోత్సహించడం సరైంది కాదన్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని వెంటనే పటిష్ట పర్చాలని పేర్కొన్నారు. ఈ చట్టంలో లోపాలను సరిదిద్దడంపై జాతీయస్థాయిలో చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. అఖిలపక్ష సమావేశంలో చర్చించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేసే అధికారాన్ని స్పీకర్ పరిధి నుంచి తప్పించి ఎన్నికల సంఘం పరిధిలోకి తేవాలన్న ప్రతిపాదనపై స్పందిస్తూ... పార్లమెంటరీ ప్రక్రియలో భాగంగానే ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని పటిష్ట పర్చాలని పవార్ చెప్పారు.
అసెంబ్లీ స్థానాల పెంపునకు రాజ్యాంగ సవరణే మార్గం
ఏపీ, తెలంగాణలో శాసనసభ నియోజకవర్గాల పెంపు విషయంలో రాజ్యాంగ సవరణే మార్గమని శరద్ పవార్ తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26ను సవరించడం ద్వారా ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపు సాధ్యం కాదన్నారు. అసెంబ్లీ సీట్లను పెంచాలంటే రాజ్యాంగ సవరణ తప్పనిసరి అని పేర్కొన్నారు. అసెంబ్లీ స్థానాల పెంపును చూపించి, ఫిరాయింపులు ప్రోత్సహించడం సరి కాదన్నారు.
గోవాలో పోరాడి సాధించాం
‘‘గోవాలో మా పార్టీ ఎమ్మెల్యేలను అప్పటి అధికారపార్టీ కొనుగోలు చేసింది. మేము హైకోర్టుకు వెళ్లాం. తరువాత సుప్రీంకోర్టుకు వెళ్లాం. తాము పార్టీ మారలేదు, కండువాలు మార్చుకున్నామని ఫిరాయింపుదారులు చెప్పారు. అయినా పార్టీ ఫిరాయింపుదారులపై అనర్హత వేటు పడింది. మేము మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించాం. ఫిరాయింపులను ఎవరూ అంగీకరించకూడదు. మీరు కూడా ఈ విషయంలో గట్టిగా పోరాడండి. మీకు మేము అండగా ఉంటాం’’
- వైఎస్సార్‌సీపీ నేతలతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్