‘పోలవరం’ ఆపండి ప్లీజ్‌..!

Naveen Patnaik's letter to the Prime Minister - Sakshi

భువనేశ్వర్‌ : పోలవరం ప్రాజెక్టు పనుల్ని యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. ఇలా కొనసాగించి ప్రాజెక్టు పూర్తి చేస్తే ఒడిశాకు తీరని నష్టం వాటిల్లుతుంది. తక్షణమే ఈ వ్యవహారంలో వ్యక్తిగతంగా చొరవ కల్పించుకోవాలనే అభ్యర్థనతో  ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. అటవీ–పర్యావరణ విభాగం ఈ నెల 10వ తేదీన జారీ చేసిన వర్క్‌ ఆర్డర్‌ను రద్దు చేయాలని ముఖ్యమంత్రి అభ్యర్థించారు.

సుప్రీం కోర్టులో ఈ వివాదం ఊగిసలాడుతోంది. తుది తీర్పు వెలువడేంత వరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణపు పనుల నిలిపివేతకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ఆదేశించాలని నవీన్‌ పట్నాయక్‌ లేఖలో అభ్యర్థించారు. వచ్చే ఏడాది జులై నాటికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యే అవకాశాలు ఉన్నట్లు ప్రధాన మంత్రికి వివరించారు. కేంద్ర జల కమిషన్, పోలవరం ప్రాజెక్టుతో ప్రభావిత ఇతర రాష్ట్రాల సంప్రదింపుల నేపథ్యంలో ప్రాజెక్టు డిజైన్‌ సవరణకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ తెలిపారు.

గోదావరి జల వివాద ట్రిబ్యునల్‌ మార్గదర్శకాల మేరకు పోలవరం ప్రాజెక్టు చేపడితే ఉభయ తారకంగా ఉంటుందని సూచించారు. 2015వ సంవత్సరం నుంచి తరచూ జారీ అవుతున్న పనుల నిలుపుదల ఉత్తర్వుల్ని ఖాతరు చేయకుండా పోలవరం ప్రాజెక్టు పనుల్ని యథేచ్ఛగా నిర్వహించడంపట్ల ముఖ్యమంత్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్ని నివారించకుంటే పలు అటవీ భూములు, సారవంతమైన పంటపొలాలు నీట మునుగుతాయి. దళిత పల్లెలు కనుమరుగ వుతాయి. తక్షణమే వ్యక్తిగతంగా చొరవ కల్పించుకుని వైపరీత్యాల్ని నివారిస్తారని ఈ లేఖ రాస్తున్నట్లు నవీన్‌ పట్నాయక్‌ స్పష్టం చేశారు.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top