3 రోజులుగా తిండి లేదు.. ఫుట్‌బాల్‌లా ఆడుకున్నారు

Migrant Workers Stopped Karnataka Border For 3 Days Allowed Now - Sakshi

కర్ణాటక సరిహద్దులో వలస కార్మికుల కష్టాలు

బెంగళూరు: లాక్‌డౌన్‌ నిబంధనలు సడలిస్తూ స్వస్థలాలకు వెళ్లేందుకు కేంద్రం అనుమతి ఇవ్వడంతో వలస కార్మికులు ఇంటి బాట పట్టారు. శ్రామిక్‌ రైళ్లలో పలువురు సొంత రాష్ట్రాలకు వెళ్తుండగా.. మరికొందరు కాలినడకను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో అహ్మదాబాద్‌ నుంచి కర్ణాటక సరిహద్దుకు చేరుకున్న వలస కార్మికులకు చేదు అనుభవం ఎదురైంది. అధికారులు అడ్డుకోవడంతో కర్ణాటక- మహారాష్ట్ర సరిహద్దులో తిండీతిప్పలు లేకుండా 72 గంటల పాటు పడిగాపులు కాయాల్సి వచ్చింది. ప్రతిపక్ష నేత సిద్దారామయ్య సహా ఇతర నాయకులు జోక్యం చేసుకోవడంతో ఎట్టకేలకు శుక్రవారం ఉదయం 2 గంటలకు కర్ణాటకలో ప్రవేశించేందుకు పోలీసులు వారికి అనుమతినిచ్చారు. (మ‌హారాష్ర్ట‌లో లాక్‌డౌన్ పొడిగింపు!)

వివరాలు.. కర్ణాటకలోని బాగల్‌కోటెకు చెందిన 30 మంది రెండు నెలలుగా అహ్మదాబాద్‌లో చిక్కుకుపోయారు. అక్కడే 20 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో మే 4న లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించిన క్రమంలో సొంతూరికి వెళ్లేందుకు అహ్మదాబాద్‌ ప్రభుత్వ యంత్రాంగం వారికి అనుమతినిచ్చిది. ఈ క్రమంలో వారు మంగళవారం రాత్రి నాటికి కర్ణాటక సరిహద్దులోని నిప్పనికి చేరుకోగా పోలీసులు అడ్డుకున్నారు. గుజరాత్‌ ప్రభుత్వం ఇచ్చిన అనుమతి పత్రాలు చూపించినప్పటికీ రాష్ట్రంలో ప్రవేశించిందేకు అనుమతి నిరాకరించారు. యాప్‌లో అప్లై చేసుకున్నప్పటికీ దానిని హోల్డ్‌లో పెట్టేశారు. దీంతో గత మూడు రోజులుగా వారు అక్కడే ఉండిపోయారు.(తొలి రోజే రూ.172 కోట్ల మద్యం అమ్మకాలు)

ఈ విషయం గురించి బాధితుడు యూసఫ్‌ ముధోల్‌ మాట్లాడుతూ.. ‘‘వాళ్లు మమ్మల్ని క్రిమినల్స్‌లా చూస్తున్నారు. శరణార్థులకు కూడా ఇలాంటి కష్టాలు ఉండవు. మా పోలీసులే మమ్మల్ని లోపల అడుగుపెట్టనీయడం లేదు. మహారాష్ట్ర లేదా గుజరాత్‌కి వెళ్లిపొమ్మని చెబుతున్నారు. అక్కడి పోలీసులేమో కన్నడిగులు కర్ణాటకకు వెళ్లాలని చెప్తున్నారు. మూడురోజులుగా ఫుట్‌బాల్‌లా మమ్మల్ని ఆడుకుంటున్నారు’’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. మంచి నీళ్లు, ఆహారం దొరకక నానా అవస్థలు పడుతున్నామని ఉద్వేగానికి గురయ్యాడు. కాగా కర్ణాటక- గోవా సరిహద్దులో కూడా ఇలాంటి ఘటనలే చోటుచేసుకోవడంతో యడ్డీ సర్కారుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై స్పందించిన సీఎం యడియూరప్ప ఇటువంటి ఘటనలు పునరావృతం కావని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా.. ఢిల్లీ, గుజరాత్‌, మహారాష్ట్రలో కరోనా తీవ్రత ఉధృతంగా ఉండటంతో.. అక్కడి నుంచి వచ్చే వాళ్లను రాష్ట్రంలోకి అనుమతించకూడదని సీఎస్‌ ఆదేశించారని ఓ ప్రభుత్వ అధికారి పేర్కొనడం గమనార్హం.  (మాస్కులు లేనివారిని గుర్తించేందుకు ఏఐ టెక్నాలజీ)

వలస కార్మికులు: రైళ్లను రద్దు చేసిన కర్ణాటక!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top