లీకేజీకి డిజిటల్‌ ప్రశ్న పత్రాలతో చెక్‌

Microsoft builds digital solution for CBSE to prevent question paper leaks - Sakshi

చేతులు కలిపిన సీబీఎస్‌ఈ, మైక్రోసాఫ్ట్‌

వాటర్‌మార్క్‌ ఉన్న ప్రశ్న పత్రాల రూపకల్పన

పరీక్షకు అరగంట ముందే యాక్సస్‌

న్యూఢిల్లీ: ప్రశ్న పత్రాల లీకేజీ ఇటీవలి కాలంలో పెద్ద సమస్యగా పరిణమించింది. హైస్కూలు స్థాయి నుంచి ఎంసెట్‌ వంటి ప్రవేశపరీక్షలు, పోటీ పరీక్షల వరకు ప్రశ్న పత్రాలు ముందుగానే బయటకు రావడం, దాంతో ఆ పరీక్షలను రద్దు చేసి మళ్లీ నిర్వహించడం సంబంధిత విభాగాలకు తలనొప్పిగా మారింది. సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌(సీబీఎస్‌ఈ) ఈ ఏడాది నిర్వహించిన పది, పన్నెండు తరగతులకు సంబంధించిన గణితం, ఎకనామిక్స్‌ ప్రశ్న పత్రాలు లీకవడంతో ఆ పరీక్షలను మళ్లీ నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఈ సమస్యను అధిగమించడం కోసం సీబీఎస్‌ఈ మైక్రోసాఫ్ట్‌తో కలిసి డిజిటల్‌ ప్రశ్న పత్రాలను రూపొందించే ప్రక్రియను అభివృద్ధి చేసింది. మూడు నెలల్లో ఈ డిజిటల్‌ ప్రశ్నపత్రం తయారవడం విశేషం. పరీక్షకు ముందే ప్రశ్న పత్రం బయటకు తేవడానికి వీల్లేని విధంగా,ఒకవేళ తెచ్చిన ఏ సెంటర్‌ నుంచి తెచ్చారో వెంటనే తెలిసిపోయే విధంగా ఈ డిజిటల్‌ ప్రశ్న పత్రాన్ని రూపొందించారు.గత జులైలో సీబీఎస్‌ఈ ప్రయోగాత్మకంగా 487 కేంద్రాల్లో  పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలను ఈ డిజిటల్‌ ప్రశ్న పత్రాలతో విజయవంతంగా నిర్వహించింది. దీంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్‌ఈ పది,పన్నెండో తరగతుల పరీక్షలన్నింటినీ ఈ డిజిటల్‌ విధానంలోనే నిర్వహిస్తామని మానవ వనరుల అభివృద్ధి శాఖ అధికారులు తెలిపారు.

అమలు చేసేదిలా..
విండోస్‌10, ఆఫీస్‌ 365లలో ఉన్న సాఫ్ట్‌వేర్‌ ఆధారంగా ఈ డిజిటల్‌ ప్రశ్నపత్రాలను రూపొందించారు. మొత్తం డిజిటల్‌ ప్రశ్న పత్రాలన్నీ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ పర్యవేక్షణలో ఉంటాయి. అక్కడ నుంచే వివిధ పరీక్షా కేంద్రాలకు డౌన్‌లోడ్‌ అవుతాయి. ఈ ప్రశ్న పత్రాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి సంబంధిత పరీక్షా కేంద్రం అధికారి రెండు రకాల ధ్రువీకరణలను ఇవ్వాల్సి ఉంటుంది. ఓటీపీ ద్వారా లేదా బయోమెట్రిక్‌ ద్వారా ఆ అధికారి తన గుర్తింపును ధ్రువీకరించాలి. ఆధార్‌ ద్వారా కూడా ఈ పని చేయవచ్చు. గుర్తింపు పొందిన అధికారికి కంట్రోలర్‌ ప్రశ్న పత్రాలను ఈ–మెయిల్‌ ద్వారా పంపుతారు.

కంట్రోలర్‌ పంపే కోడ్‌ సహాయంతో పరీక్షా కేంద్రం అధికారి ప్రశ్న పత్రాన్ని డౌన్‌లోడ్‌ చేసుకుంటారు. తర్వాత అవసరమైనన్ని కాపీలు ముద్రించి అభ్యర్ధులకు అందజేస్తారు. ఇదంతా పరీక్ష ప్రారంభం కావడానికి కేవలం అరగంట ముందు మాత్రమే జరుగుతుంది. పరీక్షా కేంద్రాల వారీగా డిజిటల్‌ ప్రశ్న పత్రాలపై వేర్వేరు వాటర్‌ మార్క్‌లను ముద్రిస్తారు. దానివల్ల ఒకవేళ ప్రశ్నపత్రం లీకయితే అది ఏ సెంటర్‌లో జరిగిందో వెంటనే తెలుసుకోవచ్చు. ఈ డిజిటల్‌ ప్రశ్నపత్రాల కోసం ప్రతి పరీక్షా కేంద్రంలో విద్యుత్, కంప్యూటర్, ప్రింటర్, ఇంటర్‌నెట్‌లు తప్పనిసరిగా ఉండాలి. కరెంటు లేని చోట జనరేటర్లను ఏర్పాటు చేయాలని, ఇంటర్‌నెట్‌ సదుపాయం లేని కేంద్రాలకు సీడీలను పంపాలని సీబీఎస్‌ఈ నిర్ణయించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top