ఆరోజు నుంచి లాక్‌డౌన్‌ పాక్షిక ఎత్తివేత: మేఘాలయ

Meghalaya Says Will Relax Lockdown From April 15 Amid Covid 19 - Sakshi

షిల్లాంగ్‌: మహమ్మారి కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న నేపథ్యంలో మేఘాలయ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్‌ 15 నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాల సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయని ఈశాన్య రాష్ట్రం పేర్కొంది. ప్రైవేటు వాహనాల రాకపోకలకు అనుమతినిస్తామని.. అయితే విద్యా సంస్థలను మాత్రం ఏప్రిల్‌ 30 వరకు మూసివేస్తామని వెల్లడించింది. ప్రాణాంతక వైరస్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన లాక్‌డౌన్‌ ఏప్రిల్‌ 14తో ముగియనున్న విషయం తెలిసిందే. అయితే మేఘాలయలో ఇంతవరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ 15 నుంచి పాక్షికంగా లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.(కరోనాపై పోరు: డాక్టర్‌ కన్నీటిపర్యంతం)

ఈ మేరకు కేబినెట్‌ సమావేశం అనంతరం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. ‘‘ఏప్రిల్‌ 15 నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పూర్తిస్థాయిలో పనిచేస్తాయి. విద్యాసంస్థలను మాత్రం ఏప్రిల్‌ 30 వరకు మూసివేస్తున్నాం. రైతులు పొలాలకు వెళ్లొచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో మార్కెట్లు వారానికి ఒకసారి తెరుస్తాం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కొనసాగుతుంది. అయితే వ్యాపారాలపై మాత్రం లాక్‌డౌన్‌ ప్రభావం కొనసాగుతుంది. కోవిడ్‌-19 వ్యాప్తిస్తున్న తరుణంలో రోజూ కూలీలు, వేతన జీవులు, చిరు వ్యాపారులను ఆదుకునేందుకు వారానికి 700 రూపాయల చొప్పున ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఆర్థిక సహాయం అందజేస్తాం. లబ్దిదారుల ఖాతాలోకి నేరుగా నగదు బదిలీ చేస్తాం’’ అని ప్రభుత్వ అధికారి పేర్కొన్నారు.(ఆ దేశాలకు ఎగుమతి చేస్తాం: భారత్‌)

కాగా దేశ వ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో మహమ్మారి విస్తరిస్తున్న తరుణంలో లాక్‌డౌన్‌ మరికొన్ని రోజులు పొడగించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ మర్కజ్‌ ప్రార్థనల తర్వాత తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరగడంతో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరావు.. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ ఎత్తివేసినా తమ రాష్ట్రంలో మాత్రం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ క్రమంలో కరోనా బాధితులు ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, రాజస్తాన్‌, కేరళ, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ కూడా మరికొన్ని వారాల పాటు లాక్‌డౌన్‌ కొనసాగిస్తేనే వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడం సాధ్యమవుతుందని భావిస్తున్నట్లు సమాచారం. (తెలంగాణ బాటలో మరికొన్ని రాష్ట్రాలు!)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top