ఎంసీఐ వైఖరి సరికాదు | MCI, Health Ministry clash over seats in govt medical colleges | Sakshi
Sakshi News home page

ఎంసీఐ వైఖరి సరికాదు

Aug 29 2014 2:51 AM | Updated on Oct 9 2018 6:57 PM

ఎంసీఐ వైఖరి సరికాదు - Sakshi

ఎంసీఐ వైఖరి సరికాదు

మెడికల్ కాలేజీల సీట్లు రెన్యువల్, కొత్త సీట్లు మంజూరు, అదనపు సీట్లకు అనుమతికి సంబంధించి భారత వైద్య మండలి(ఎంసీఐ) వైఖరిపై దాఖలైన సుమారు 20 పిటిషన్లను సుప్రీం కోర్టు గురువారం విచారించింది.

* సుప్రీంలో వాదనలు వినిపించిన ప్రయివేట్ వైద్యకళాశాలలు
* ఏపీ, తెలంగాణల నుంచి 13 వైద్య కాలేజీల్లో సీట్ల కోత
* రెన్యువల్ సీట్లకైనా అనుమతి ఇప్పించండి

 
 సాక్షి, న్యూఢిల్లీ: మెడికల్ కాలేజీల సీట్లు రెన్యువల్, కొత్త సీట్లు మంజూరు, అదనపు సీట్లకు అనుమతికి సంబంధించి భారత వైద్య మండలి(ఎంసీఐ) వైఖరిపై దాఖలైన సుమారు 20 పిటిషన్లను సుప్రీం కోర్టు గురువారం విచారించింది. దేశవ్యాప్తంగా పలు ప్రయివేట్ వైద్య కాలేజీలు దాఖలు చేసిన ఈ పిటిషన్లపై జస్టిస్ అనిల్. ఆర్. దవే, జస్టిస్ విక్రమ్‌జిత్‌సేన్, జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. సీట్ల మంజూరు విషయంలో ఎంసీఐ తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించలేదని తెలిపారు. 77 ప్రభుత్వ కళాశాలల్లో తగిన వసతులు, బోధనా సిబ్బంది లేకపోయినా ఆ రాష్ట్రాల సీఎస్‌ల అండర్ టేకింగ్ తీసుకుని వాటికి అనుమతులు ఇచ్చారని, అయితే ప్రయివేట్ కళాశాలలకు మాత్రం అనుమతులు ఇవ్వలేదని కోర్టుకు తెలిపారు. అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో సీట్ల భర్తీకి ఇంకా సమయం ఉన్నందున రెన్యువల్స్, అదనపు సీట్లు, కొత్త కళాశాలలకు సీట్లకు అనుమతి మంజూరు చేయాలని కోరారు.
 
  కోర్టును ఆశ్రయించిన కళాశాలల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి 13 కళాశాలలున్నాయి. వీటిలో మూడు కొత్త కళాశాలలు కూడా ఉన్నాయి. ఈ కొత్త కళాశాలలు, పాత కళాశాలలకు సంబంధించి 1,250 సీట్లకు ఎంసీఐ కోత విధించింది. కళాశాలలను ఎంసీఐ తనిఖీ చేసిన తర్వాత లోటుపాట్లపై ఆయా కళాశాలలకు తెలిపి.. వాటిని పూరించేందుకు కొంత సమయం ఇవ్వాలని గతంలో సుప్రీం కోర్టు ఆదేశాలు జారీచేసిందని, అయితే ఈ విషయంలో ఎంసీఐ పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శించిందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు.
 
 కేవలం ఈ ప్రక్రియ పూర్తి చేయాలనే లక్ష్యంతోనే ఎంసీఐ పనిచేసింది తప్ప.. లోటుపాట్లపై సమాచారమివ్వలేదని, కేవలం 4 నుంచి 5 శాతం లోటుపాట్లు ఉన్నా సీట్ల మంజూరుకు అనుమతి నిరాకరించిందని పేర్కొన్నారు. ఈ వాదనలు విన్న ధర్మాసనం నాణ్యమైన విద్యకు చర్యలు తీసుకోవాల్సిందే కదా అని వ్యాఖ్యానించింది. దీనిపై పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వివరణ ఇస్తూ.. ప్రభుత్వం ఉన్నత విద్యను అందించే పరిస్థితుల్లో లేదని, ప్రయివేటు సంస్థలు వందల కోట్లు పెట్టి విద్యాసంస్థలు నెలకొల్పితే.. చిన్న చిన్న వసతుల లేమిని చూపి సీట్ల అనుమతిని నిరాకరించడం న్యాయం కాదన్నారు.
 
 నాణ్యత లేనివాటిని తొలగిస్తే తమకు అభ్యంతరం లేదని, ఆ పేరు చెప్పి అందరినీ పక్కనబెట్టడం అన్యాయమని వాదించారు. ఈ నేపథ్యంలో వైద్య కళాశాల వారీగా వాదనలు వింటామని ధర్మాసనం పేర్కొంది. ఆ మేరకు ఒక్కో కళాశాల తరఫున న్యాయవాదులు విడిగా తమ వాదనలు వినిపించారు. అయినప్పటికీ ధర్మాసనం ఆ సీట్లను పునరుద్ధరించేలా ఆదేశాలు ఇచ్చేందుకు సంతృప్తిచెందలేదు. కనీసం గత కొన్నేళ్లుగా అందుబాటులో ఉన్న సీట్లనైనా రెన్యువల్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని చివరగా పిటిషనర్ల తరఫు న్యాయవాది కపిల్ సిబల్ కోరగా.. ఈ కేసును వచ్చే గురువారానికి వాయిదావేస్తున్నట్టు ధర్మాసనం పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement