చంద్రబాబుకు పుట్టగతులుండవు | Manda krishna slams chandrababu naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు పుట్టగతులుండవు

May 4 2016 2:28 AM | Updated on Oct 8 2018 3:00 PM

చంద్రబాబుకు పుట్టగతులుండవు - Sakshi

చంద్రబాబుకు పుట్టగతులుండవు

ఎస్సీ వర్గీకరణకు తీర్మానం చేసేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మీనమేషాలు లెక్కిస్తున్నాడని, ఎమ్మార్పీఎస్ సహకారాన్ని మరచిన ఆయనకు పుట్టగతులు ఉండవని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ధ్వజమెత్తారు.

- ఎస్సీ వర్గీకరణ తీర్మానానికి మీనమేషాలు లెక్కిస్తున్నారు
- తెలంగాణ సీఎం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు
- ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ ధ్వజం

 
 సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ వర్గీకరణకు తీర్మానం చేసేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మీనమేషాలు లెక్కిస్తున్నాడని, ఎమ్మార్పీఎస్ సహకారాన్ని మరచిన ఆయనకు పుట్టగతులు ఉండవని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ధ్వజమెత్తారు. వెంటనే తీర్మానం చేసి అఖిలపక్షంతో ఢిల్లీకి రావాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో చంద్రబాబు మాదిగల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాదిగల పట్ల కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని, అసెంబ్లీలో తీర్మానం చేసి ఆ విషయాన్నే మరిచిపోయారని మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణ కోసం మంద కృష్ణ మాదిగ నేతృత్వంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద మంగళవారం భారీ ధర్నా నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణ చేస్తామని బీజేపీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఎమ్మార్పీఎస్ జాతీయ కమిటీ ఈ సందర్భంగా డిమాండ్ చేసింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి అధికార పార్టీలపై ఒత్తిడి చేసిన బీజేపీ ఇప్పుడు మరిచిపోవడం బాధాకరమని మందకృష్ణ విమర్శించారు.
 
 బిల్లు పెట్టకపోవడం బాధాకరం: సురవరం
 సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్నప్పుడు రాజ్యాంగ సవరణ బిల్లు పెట్టకపోవడం బాధాకరమని విమర్శించారు. రిజర్వేషన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ అమలైతేనే మాదిగలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.
 
 ఎస్సీ వర్గీకరణ న్యాయమైన పోరాటం: కొప్పుల రాజు
 ఎస్సీ వర్గీకరణ న్యాయమైన పోరాటమని కాంగ్రెస్ జాతీయ ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పుల రాజు పేర్కొన్నారు. ఎమ్మార్పీఎస్ ఉద్యమం మాలలకు వ్యతిరేకం కాదని, అలాగే మాలలు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకం కాదని పేర్కొన్నారు. వర్గీకరణ జరిగితే మాలలకు నష్టమని కొన్ని దుష్టశక్తులు మభ్యపెడుతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ ఎంపీలు వి.హనుమంతరావు, రాపోలు ఆనంద భాస్కర్, నంది ఎల్లయ్య, గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ ఉద్యమం వల్ల సమాజం చైతన్యవంతమైందని వివరించారు. ఎస్సీ వర్గీకరణకు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. టీడీపీ ఎంపీ దేవేందర్ గౌడ్, కర్ణాటక ఎంపీ చంద్రప్ప, సీపీఎం జాతీయ నాయకులు శ్రీనివాసరావు, ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు పిల్లి మాణిక్య రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ రాగడి సత్యం, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బి.ఎన్.రమేశ్, వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేశ్, ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య, జాతీయ కార్యదర్శి బోయిని కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement