ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

Lok Sabha Passed The Triple Talaq Bill - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : వివాదాస్పద ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. బిల్లుకు అనుకూలంగా 303 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 82 ఓట్లు వచ్చాయి. విపక్షాల నిరసనల మధ్య బిల్లును సభ ఆమోదించింది. బిల్లుపై జరిగిన చర్చలో పాలక, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదంతో సభలో గందరగోళం నెలకొంది. 2017లో సుప్రీం కోర్టు ట్రిపుల్‌ తలాక్‌ను నిషేధించినా ఈ పద్ధతి కొనసాగుతుండటంతో ట్రిపుల్‌ తలాక్‌ను నిషేధించే చట్టాన్ని ప్రభుత్వం తీసుకువచ్చిందని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ అన్నారు.

మూడుసార్లు తలాక్‌ చెప్పడం ద్వారా భార్యకు విడాకులు ఇవ్వడం నేరమని ఇందుకు మూడేళ్ల జైలు శిక్ష విధించేలా ముసాయిదా బిల్లులో పొందుపరిచారు. నరేంద్ర మోదీ సారథ్యంలో ఎన్డీయే ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన తొలి సెషన్‌లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టడం గమనార్హం. కాంగ్రెస్‌, తృణమూల్ కాంగ్రెస్‌, డీఎంకే, జేడీ(యూ), పీడీపీ వంటి పలు పార్టీలు బిల్లును పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపాలని కోరినా లింగ సమానత్వం, మహిళల హక్కుల పరిరక్షణ దిశగా బిల్లు ఆమోదం అనివార్యమని ప్రభుత్వం పేర్కొంది. ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును వ్యతిరేకిస్తూ జేడీ(యూ), తృణమూల్‌ కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ ఎంపీలు వాకౌట్‌ చేశారు.

కాగా, ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుపై లోక్‌సభలో చర్చ సందర్భంగా ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వలింగ సంపర్కాన్ని సుప్రీంకోర్టు చట్టబద్ధం చేస్తే.. ట్రిపుల్‌ తలాక్‌ను నేరంగా పరగణించాలంటూ కేంద్రం బిల్లు తీసుకురావడమేమిటని ప్రశ్నించారు. గురువారం సభలో ఆయన మాట్లాడుతూ...‘ మీరు తెచ్చిన బిల్లు ప్రకారం.. ఓ ముస్లిం వ్యక్తి తన భార్యకు మూడుసార్లు తలాక్‌ చెప్పినా వారి వివాహం చట్టబద్ధమే. అదే విధంగా ట్రిపుల్‌ తలాక్‌ ద్వారా భార్యకు విడాకులు ఇచ్చిన పురుషుడికి మూడేళ్లు జైలు శిక్ష విధిస్తారు. అదే జరిగితే భర్త జైలులో ఉన్నపుడు భార్యకు భరణం ఎలా లభిస్తుంది. విడాకులిచ్చిన భర్త జైలు నుంచి విడుదలయ్యే దాకా సదరు మహిళ ఎదురుచూస్తూ ఉండాలా?’ అని ప్రశ్నించారు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top