అమ్మాయి, అబ్బాయి ఇద్దరికీ 18 ఏళ్లు చాలు!!

Law Commission Suggests Reduce Legal Age Of Marriage For Men - Sakshi

బాల్య వివాహాలను అరికట్టేందుకు లా కమిషన్‌ ప్రతిపాదనలు

కన్సల్టేషన్‌ పేపర్‌లో పలు కీలక అంశాలు

సాక్షి, న్యూఢిల్లీ : బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని పదే పదే చెబుతున్నా ఆ దురాచారం మాత్రం కనుమరుగవడం లేదు. పెళ్లి అంటే ఏమిటో కూడా తెలియని వయసులోనే బాల్యం ‘ముళ్ల’ బారిన పడుతోంది. ఈ నేపథ్యంలో బాల్య వివాహాలను అరికట్టేందుకు, అసమానతలు తొలగించేందుకు లా కమిషన్‌ సరికొత్త ప్రతిపాదనలు రూపొందించింది. మతాలకతీతంగా యువతీ, యువకులిద్దరికీ కనీస వివాహ వయస్సును 18 సంవత్సరాలుగా నిర్ణయించాలని అభిప్రాయపడింది. ఈ మేరకు పర్సనల్‌ లాలో చేపట్టాల్సిన సంస్కరణల ఆవశ్యకతను వివరిస్తూ... కన్సల్టేషన్‌ పేపర్‌ను శుక్రవారం విడుదల చేసింది.

ప్రజాప్రతినిధులను ఎన్నుకునే సామర్థ్యం ఉన్నపుడు...
‘ స్త్రీ పురుష భేదం లేకుండా.. రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ పద్దెనిమిదేళ్లకే ఓటు హక్కు కల్పించింది. మరి ఆ వయసులో ప్రభుత్వాన్ని ఎన్నుకునే సామర్థ్యం ఉన్నపుడు జీవిత భాగస్వామిని ఎన్నుకునే సామర్థ్యం ఉన్నట్టేగా. లింగ భేదం లేకుండా అన్ని విషయాల్లో స్త్రీ పురుషులిద్దరికీ హక్కులు కల్పించినపుడే సమానత్వ హక్కు పరిపూర్ణం అవుతుందని’ లా కమిషన్‌ పేర్కొంది. ‘అమ్మాయికి 18 ఏళ్లు, అబ్బాయికి 21 ఏళ్లు వివాహ వయస్సుగా నిర్ణయించడం ద్వారా భర్తల కంటే భార్యలు ఎప్పుడూ చిన్న వయస్సులోనే ఉండాలనే భావన బలంగా నాటుకుపోయింది. తద్వారా స్త్రీ, పురుష సమానత్వానికి భంగం కలిగినట్లే కదా’ అని కమిషన్‌ నివేదించింది.

బాల్య వివాహాలను ప్రోత్సహిస్తున్నట్లే కదా...
సమానత్వ భావన ఆవశ్యకతను వివరిస్తూ...‘ స్పెషల్‌ మ్యారేజ్‌ యాక్ట్‌- 1954 ప్రకారం అమ్మాయికి 18, అబ్బాయికి 21 సంవత్సరాలు ఉండాలి. కానీ ఈ చట్టంలోని 11, 12 సెక్షన్ల ప్రకారం భార్యాభర్తల్లో ఒకరికి వివాహానికి కనీస వయస్సు లేకపోయినా ఆ వివాహం చెల్లుబాటు అవుతుందని పేర్కొన్నారు. అదే విధంగా గార్డియన్‌షిప్‌ చట్టాల ప్రకారం భార్యకు గార్డియన్‌గా భర్తే ఉండాలి. మరి అటువంటి సమయంలో భర్త మైనర్‌ అయితే పరిస్థితి ఏంటి?. అలాగే గర్భవిచ్ఛిత్తి చట్టం- 1972లోని సెక్షన్‌ 3లో.. తప్పని పరిస్థితుల్లో గర్భవిచ్ఛిత్తి చేయవలసి వచ్చినపుడు భార్య మైనర్‌ అయితే భర్త అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు’ ... ఈ చట్టాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే బాల్య వివాహాలను ప్రోత్సహిస్తున్నారా అనే భావన కలుగుతోంది. కాబట్టి వీటన్నింటిలో సవరణలు చేయాల్సిన ఆవశ్యకత ఉందని లా కమిషన్‌ పేర్కొంది. ఈ ప్రతిపాదనలకు అనుగుణంగా ఉమ్మడి పౌర స్మృతిలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని కమిషన్‌ గుర్తుచేసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top