లాల్జీ సింగ్‌ కన్నుమూత | Lalji Singh, ‘father of DNA fingerprinting in India,’ passes away | Sakshi
Sakshi News home page

లాల్జీ సింగ్‌ కన్నుమూత

Dec 12 2017 2:59 AM | Updated on Dec 12 2017 2:59 AM

Lalji Singh, ‘father of DNA fingerprinting in India,’ passes away - Sakshi

వారణాసి/హైదరాబాద్‌: ప్రముఖ శాస్త్రవేత్త, భారత డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌ పితామహుడు లాల్జీ సింగ్‌ (70) ఆదివారం రాత్రి కన్నుమూశారు. వారణాసి విమానాశ్రయంలో ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఛాతిలో తీవ్రమైన నొప్పి రావటంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ‘విమానాశ్రయంలో ఉన్న సమయంలో లాల్జీ తీవ్రమైన ఛాతీ నొప్పితో కుప్పకూలారు. వెంటనే బీహెచ్‌యూ ట్రామా కేర్‌ సెంటర్‌లో అత్యవసర సేవలందించాం. అయినా లాభంలేదు’ అని బీహెచ్‌యూ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ తెలిపారు. వారణాసి పక్కనున్న జౌన్‌పూర్‌ జిల్లాలోని మారుమూల గ్రామంలో జన్మించిన లాల్జీ సింగ్‌ బీహెచ్‌యూ 25వ వైస్‌చాన్స్‌లర్‌గా ఉన్నారు. ఇదే యూనివర్సిటీలో ఆయన బీఎస్సీ, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ పూర్తిచేశారు.

ఈయన మృతిపట్ల యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని కేంద్ర డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌ అండ్‌ డయాగ్నొస్టిక్స్‌ (సీడీఎఫ్‌డీ)లో ఓఎస్డీగా (1995–99)కూడా ఆయన సేవలందించారు. ల్యాకోన్స్, జెనోమ్‌ ఫౌండేషన్‌ (పేదప్రజలకు జన్యుపరమైన సమస్యలకు చికిత్సనందించే సంస్థ) వంటి పలు సంస్థలను ఆయన స్థాపించారు. హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులార్‌ బయాలజీ (సీసీఎంబీ) వ్యవస్థాపకుల్లో లాల్జీ ఒకరు. భారత బయోలాజికల్‌ సైన్సెస్‌కు చిరస్మరణీయమైన సేవలందించారు. లాల్జీ హఠాన్మరణంపై సీసీఎంబీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. సీసీఎంబీ ప్రస్తుత డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌ కే మిశ్రా, ఇతర శాస్త్రవేత్తలు సోమవారం ఆయనకు నివాళులర్పించారు.

‘డీఎన్‌ఏ ప్రింటింగ్‌’ ఆద్యుడు
దేశంలో డీఎన్‌ఏ ఆధారంగా పితృత్వాన్ని నిర్ధారించే పరీక్షలను లాల్జీ సింగ్‌ అభివృద్ధి చేశారు. 1991లోనే డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌ టెక్నాలజీకి ఆయన ఆద్యుడు. డీఎన్‌ఏను కోర్టులో సాక్ష్యంగా ప్రవేశపెట్టడం ద్వారా ఓ పితృత్వ కేసును నిర్ధారించారు. తర్వాత ఈ టెక్నాలజీ ఆధారంగా వందలాది సివిల్, క్రిమినల్‌ కేసులు కొలిక్కి వచ్చాయి. మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ, పంజాబ్‌ మాజీ సీఎం బియంత్‌ సింగ్‌ హత్య కేసుల్లోనూ మృతుల నిర్ధారణకు ఈ టెక్నాలజీనే ఉపయోగపడింది.

► 1970లలో లాల్జీ సింగ్‌ తన సహచరులతో కలసి పాములపై పరిశోధనలు చేసేవారు. ఇండియన్‌ బ్రాండెడ్‌ క్రెయిట్‌ అనే పాము జన్యుక్రమంలో కొంతభాగం మళ్లీమళ్లీ పునరావృతమవుతున్నట్లు గుర్తించారు. తదుపరి పరిశోధనల్లో ఇలాంటి డీఎన్‌ఏ భాగాలు ఇతర జాతుల పాములతో పాటు మనుషుల్లోనూ ఉన్నట్లు తెలియడంతో దీని ఆధారంగా డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌ టెక్నాలజీని అభివృద్ధి చేయొచ్చని లాల్జీ సింగ్‌ గుర్తించారు.  

► కాలక్రమంలో అంతరించిపోతున్న జీవజాతుల పరిరక్షణకు లాల్జీ సింగ్‌ కృషి చేశారు. హైదరాబాద్‌లోని సీసీఎంబీ డైరెక్టర్‌గా.. కృత్రిమ గర్భధారణ పద్ధతుల ఆధారంగా అంతరించిపోతున్న జీవజాతుల సంతతిని పెంచేందుకు లేబొరేటరీ ఫర్‌ కన్సర్వేషన్‌ ఆఫ్‌ ఎన్‌డేంజర్డ్‌ స్పీషీస్‌ (ల్యాకోన్స్‌)ను ఏర్పాటు చేశారు.  

► కణాల్లోని వై–క్రోమోజోమ్‌లోని చిన్న భాగం ఆడ ఎలుకను మగ ఎలుకగా మార్చేసేందుకు సరిపోతుందని లాల్జీసింగ్‌ 1982లో గుర్తించారు.  

► 1998 వరకు భారత్‌లో జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు ఎలాంటి సౌకర్యాల్లేవు. ఈ నేపథ్యంలో లాల్జీసింగ్‌ దేశంలోనే తొలి జన్యువ్యాధి నిర్ధారణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.                            

–సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement