విజ్ఞానాన్ని టెక్నాలజీతో మేళవించండి

విజ్ఞానాన్ని టెక్నాలజీతో మేళవించండి - Sakshi


► 103వ సైన్స్ కాంగ్రెస్‌లో ప్రధాని మోదీ

► పరిశోధనలకు మరిన్ని వనరులను సమకూరుస్తాం

► శాస్త్రీయ విద్యలో నాణ్యత మరింత పెంచుతాం

► శాస్త్రవేత్తలూ.. పరిశోధనల్లో ఐదు ‘ఇ’ల సూత్రాన్ని పాటించండి

► సముద్ర విజ్ఞానాన్ని మదించాలని సూచన


 

 మైసూరు: సంప్రదాయ విజ్ఞానాన్ని ఆధునిక పరిజ్ఞానంతో అనుసంధానం చేసేందుకు కృషి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చారు. దీనివల్ల అనేక సమస్యలకు స్థానికంగానే ఉత్తమ పరిష్కారాలు చూపిం చడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. దేశంలో శాస్త్రీయ పరిశోధనలు జరిపేందుకు ప్రస్తుతం ఎదురవుతున్న అడ్డంకులను తొలగి స్తామని చెప్పారు. పరిశోధనల సమయంలో ఐదు ‘ఇ’ (ఎకానమీ, ఎన్విరాన్‌మెంట్, ఎనర్జీ, ఎంపతీ, ఈక్విటీ) సూత్రాన్ని దృష్టిలో ఉంచుకోవాలని శాస్త్రవేత్తలకు సూచించారు. ఐదు రోజులపాటు సాగనున్న 103వ ‘ఇండియన్ సైన్స్ కాంగ్రెస్’ ఆదివారం కర్ణాటకలోని మైసూరులో ప్రారంభమైంది. ఈ సదస్సులో ప్రధాని మోదీ ప్రారంభోపన్యాసం చేశారు. ప్రతీ రంగంలో కేంద్రం-రాష్ట్రాల మధ్య సహకార సమాఖ్య వెల్లివిరుస్తున్నట్టే కేంద్ర, రాష్ట్రాల పరిధిలోని పరిశోధనల సంస్థల మధ్య మరింత సహకారం పెంపొందాలని అన్నారు. ‘‘శాస్త్రవేత్తలు ఐదు ‘ఇ’ల సూత్రాన్ని దృష్టిలో ఉంచుకొని పరిశోధనలు చేస్తే వాటి ఫలితాలు మరింత అద్భుతంగా ఉంటాయి.



ఎకానమీ(అత్యంత తక్కువ ఖర్చుతో పరిష్కారం చూపించడం), ఎన్విరాన్‌మెంట్(కర్బన ఉద్గారాలను తక్కువస్థాయికి పరిమితం చేస్తూ పర్యావరణహితమైన ఆవిష్కరణలు రూపొందించడం), ఎనర్జీ(తక్కువ ఇంధన వినియోగంతో పరిశోధనలు చేయడం), ఎంపతీ(పరిశోధనలు మన సంస్కృతీ సంప్రదాయాలకు అనుగుణంగా ఉండడం), ఈక్విటీ(అత్యంత బలహీనులైనవారికి కూడా టెక్నాలజీ అందేలా సమ్మిళిత అభివృద్ధి జరిగేలా చూడడం)లకు పెద్దపీట వేయాలి. ఉత్తమ పాలన అంటే కేవలం విధాన నిర్ణయాలు తీసుకోవడం, పారదర్శకతకు పెద్దపీట వేయడం మాత్రమే కాదు.. సైన్స్ అండ్ టెక్నాలజీలను కలుపుకొని ముందుకు సాగడం కూడా! శాస్త్రీయ పరిశోధనలకు మరిన్ని వనరులను సమకూరుస్తాం. వ్యూహాత్మక రంగాల్లో శాస్త్రజ్ఞుల సేవలను వినియోగించుకుంటాం’’ అని ప్రధాని అన్నారు. దేశంలో పరిశోధనలు జరిపేందుకు మరింత అనువైన వాతావరణం కల్పిస్తామని, శాస్త్రీయ విద్యను మరింత నాణ్యంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.



 సముద్ర విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి

 సముద్రాలు దేశ ఆర్థిక రంగానికి చోదక శక్తులుగా మారనున్నాయని, అందువల్ల ఈ రంగంలో పరిశోధనలకు పెద్దపీట వేయాలని ప్రధాని సూచించారు. ‘‘దేశానికి 7,500 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉంది. 1,300 దీవులున్నాయి. ప్రత్యేక ఆర్థిక మండళ్లు 24 లక్షల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. వీటన్నింటినీ సమర్థంగా వినియోగించుకున్నట్లయితే దేశం మరింత సంపన్నమవుతుంది. క్లీన్ ఎనర్జీ అందుతుంది. అనేక ఔషధాలు దొరుకుతాయి. మత్య్స సంపదతో ఆహార భద్రతకు భరోసా కలుగుతుంది. సముద్ర విజ్ఞానాన్ని మరింత గా పెంపొందించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉంది. సముద్ర జీవజాలం, బయోటెక్నాలజీ రంగంలో పరిశోధనలకు ఒక అత్యాధునిక సంస్థను నెలకొల్పుతాం. అలాగే తీర ప్రాంతాలు, దీవులపై పరిశోధనకు భారత్‌తోపాటు విదేశాల్లో పరిశోధన సంస్థలను ఏర్పాటు చేస్తాం’’ అని ప్రధాని వివరించారు. ఈ ఏడాది ఢిల్లీలో ఓషియన్-ఎకానమీ, పసిఫిక్ దేశాల సదస్సు జరగనుందని తెలిపారు. మానవ చరిత్రలో సముద్రాలతోపాటు నదులు కూడా కీలక పాత్ర పోషించాయని, నదులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ‘మేకిన్ ఇండియా’కు ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నందున ‘భారత్‌లో దేశీయ అభివృద్ధి, సైన్స్ అండ్ టెక్నాలజీ పాత్ర’ నేపథ్యంతో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. మైసూరు యూనివర్సిటీలోని మానస గంగోత్రి క్యాంపస్‌లో ఐదురోజులపాటు సాగనున్న ఈ సైన్స్ కాంగ్రెస్‌లో దేశంలోని 500 ప్రముఖ శాస్త్రవేత్తలు పాల్గొననున్నారు.

 

 సంప్రదాయ వైద్యంతో యోగాను జత చేయండి

 భారత సంప్రదాయ వైద్యంతో యోగాను అనుసంధానించి అందరికీ ఆరోగ్యం పంచాలని ప్రధాని నరే ంద్రమోదీ సూచించారు. వివిధ వైద్య విధానాల మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చాల్సిందిగా వైద్య నిపుణులు, ప్రభుత్వ రంగ సంస్థలను కోరారు. ఆదివారం బెంగళూరుకు 30 కి.మీ. దూరంలోని జిగానీలో యోగా పరిశోధనపై ప్రారంభమైన అంతర్జాతీయ సదస్సులో మోదీ ప్రసంగించారు. అంతర్జాతీయంగా యోగాకు ప్రాధాన్యం పెరుగుతోందని చెప్పారు. ఆధునిక వైద్యం ఎన్నో విజయాలను నమోదు చేసినా, రానురాను ఆర్థికంగా భారమవుతోందని, సైడ్ ఎఫెక్టులు కూడా సమస్యగా మారుతున్నాయన్నారు. అన్ని వైద్య విధానాల్లో అత్యుత్తమ పద్ధతులతో ఒక సమగ్రమైన వైద్య విధానాన్ని ఆవిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు.

 

 15 ఏళ్లలో 600 దేశీయ హెలికాప్టర్లు

కర్ణాటకలోని తుమకూరు జిల్లా బీదరహళ్లి కావల్‌లో హిందూస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) హెలికాప్టర్ల తయారీ కేంద్రానికి ప్రధాని మోదీ ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ కేంద్రం ఏర్పాటుతో తుమకూరు ప్రపంచ పటంలోనే ప్రత్యేక స్థానాన్ని సంపాదించనుందన్నారు. రక్షణ పరికరాల ఉత్పత్తిలో దేశం స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరం ఉందన్నారు. 15 ఏళ్లలో ఈ కేంద్రం నుంచి 600 దేశీయ హెలికాప్టర్లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. వీటిని సైన్యానికి అందజేస్తామన్నారు. ఈ కర్మాగారం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 4 వేల కుటుంబాలకు ఉపాధి లభించనుందన్నారు. ఉద్యోగాల్లో తుమకూరు ప్రాంతంలోని రైతు కుటుంబాలకే మొదటి ప్రాధాన్యం ఇస్తామన్నారు. 2018 నాటికి ఈ కర్మాగారం నుంచి తయారైన మొదటి దేశీయ హెలికాప్టర్ నింగిలో ఎగరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సీఎం సిద్ధరామయ్య, కేంద్ర మంత్రులు మనోహర్ పారికర్, అనంతకుమార్, సదానందగౌడ, రాష్ట్ర గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలా తదితరులు పాల్గొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top