ముంబై వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా అదుపులోకి తీసుకున్న సిట్‌

Karnataka Congress MLA Roshan Baig Detained at Bengaluru Airport - Sakshi

బెంగళూరు : కర్ణాటకలో రాజకీయ సంక్షోభంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్‌ నుంచి సస్పెండయిన ఎమ్మెల్యే రోషన్‌ బేగ్‌ను ఐఎమ్‌ఏ అవినీతి కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌ ) అదుపులోకి తీసుకుంది.  ముంబయి వెళ్లడానికి సిద్ధమైన రోషన్‌ బేగ్‌ను సిట్‌ అధికారులు బెంగళూరు విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. అవినీతి కేసులో ఉన్న ఓ వ్యక్తిని బీజేపీ కాపాడేందుకు ప్రయత్నిస్తోందని కుమారస్వామి ఆరోపించారు.

దీన్ని సిగ్గుమాలిన చర్యగా కుమార స్వామి వర్ణించారు. సంకీర్ణ ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందనడానికి ఇదే నిదర్శనమన్నారు. గురువారం జరగబోయే బలపరీక్షలో ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని కుమార స్వామి ఆరోపించారు.ఆ సమయంలో బీజేపీ ఎమ్మెల్యే యోగేశ్వర్‌ సైతం సంఘటనా స్థలంలో ఉండడం అనుమానాలు రేకెత్తిస్తోందన్నారు కుమారస్వామి.
 

దీనిపై సిట్‌ అధికారులు స్పందిస్తూ.. ఐఎమ్‌ఏ కేసులో విచారణ నిమిత్తం ఈ నెల 19న హాజరు కావాల్సి ఉంటుందని బేగ్‌కు నోటీసులు జారీ చేశాం. కానీ ఈ లోపు ఆయన రాష్ట్రం విడిచి వెళ్లేందుకు ప్రయత్నించారు. దాంతో ఆయనను అదుపులోకి తీసకోవాల్సి వచ్చింది. బేగ్‌ను అరెస్ట్‌ చేయాలా వద్దా అనే అంశాన్ని విచారణ పూర్తయిన తర్వాత నిర్ణయిస్తాం అన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top