‘జీశాట్‌–6ఏ’ విఫల ప్రయోగమే!

Indian communication satellite GSAT-6A to become space debris if contact is not re-established - Sakshi

4 రోజులుగా అందని సిగ్నల్స్‌

అంతరిక్ష వ్యర్థమంటున్న శాస్త్రవేత్తలు

శ్రీహరికోట(సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) షార్‌ నుంచి మార్చి 29న సాయంత్రం 4.56 గంటలకు ప్రయోగించిన జీశాట్‌–6ఏ ఉపగ్రహంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. పలు దేశాల అంతరిక్ష సంస్థల సాయంతో జీశాట్‌–6ఏతో సంబంధాల పునరుద్ధరణకు ఇస్రో యత్నించినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయింది. దీంతో ఈ ఉపగ్రహ ప్రయోగంలో పాలుపంచుకున్న శాస్త్రవేత్తల్లో నైరాశ్యం నెలకొంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో రూ.260 కోట్లతో నిర్మించి ప్రయోగించిన ఈ ఉపగ్రహం మరో అంతరిక్ష వ్యర్థంగా మిగిలిపోనుందని శాస్త్రవేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు.

మొబైల్‌ టెక్నాలజీతో పాటు సమాచార రంగం బలోపేతం కోసం జీఎస్‌ఎల్‌వీ–ఎఫ్‌08 రాకెట్‌ ద్వారా జీశాట్‌–6ఏను 170 కి.మీ పెరిజీ (భూమికి దగ్గరగా) 35,975 కి.మీ అపోజీ (భూమికి దూరంగా) భూ బదిలీ కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఈ ఉపగ్రహం కక్ష్యను 3 దశల్లో పెంచాలని హసన్‌లో ఉన్న ఉపగ్రహ నియంత్రణా కేంద్రం శాస్త్రవేత్తలు నిర్ణయించారు. 2,140 కిలోల బరువున్న ఈ ఉపగ్రహంలోని ఇంజిన్లను మండించి మార్చి 30, 31 తేదీల్లో జీశాట్‌–6ఏ కక్ష్యను రెండుసార్లు విజయవంతంగా పెంచారు. ఏప్రిల్‌ 1న మూడోసారి కక్ష్యను పెంచే క్రమంలో ఉపగ్రహంలోని ఎలక్ట్రిక్‌ వ్యవస్థలో షార్ట్‌ సర్క్యూట్‌ జరగడంతో జీశాట్‌–6ఏ మూగబోయింది.

దీంతో ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించామన్న ఆనందం శాస్త్రవేత్తలకు రెండ్రోజులు కూడా నిలవలేదు. ఇస్రో ప్రయోగించిన ఉపగ్రహాలు సాంకేతిక కారణాలతో అంతరిక్షంలో వ్యర్థాలుగా మిగిలిపోవడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఇస్రో ప్రయోగించిన ఇన్‌శాట్‌–4సీ ఉపగ్రహం కూడా కక్ష్యలోకి ప్రవేశించడంలో సాంకేతిక ఇబ్బందులు ఎదురుకావడంతో అంతరిక్ష వ్యర్థంగా మిగిలిపోయింది. అలాగే గతేడాది పంపిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌–1 హెచ్‌ హీట్‌షీల్డ్‌ తెరుచుకోకపోవడంతో ఆ ఉపగ్రహం ప్రస్తుతం అంతరిక్షంలో చక్కర్లు కొడుతోంది. ఇస్రో చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన డా.కె.శివన్‌కు తొలి ప్రయోగంలోనే వైఫల్యం ఎదురుకావడం గమనార్హం.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top