46 మంది దుర్మరణం

46 మంది దుర్మరణం

కొండ చరియలు విరిగిపడి లోయలోకి పడిపోయిన బస్సులు.. హిమాచల్‌ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం

 

సిమ్లా/నార్కట్‌పల్లి/బీబీనగర్‌ (భువనగిరి): భారీ వర్షాలకు హిమాచల్‌ప్రదేశ్‌లో పెను ప్రమాదం జరిగింది. హిమాచల్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన రెండు బస్సులపై భారీ కొండచరియలు విరిగిపడటంతో 46 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. అదే సమయంలో జీపులో వెళ్తున్న తెలంగాణకు చెందిన ఇద్దరు వ్యక్తులు కూడా మృతి చెందారు. మండి–పఠాన్‌కోట్‌ జాతీయ రహదారి కొత్‌పురి వద్ద శనివారం అర్ధరాత్రి ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఇప్పటివరకు 46 మృతదేహాలను వెలికితీయగా 23 మందిని గుర్తించారు. అందులో నల్లగొండ జిల్లాకు చెందిన దుబ్బాక కొండల్‌రెడ్డి (48), యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన కొంతం రాజిరెడ్డి (52) ఉన్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్, ఆర్మీ, పోలీసు బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. 

 

ఛిద్రమైన మృతదేహాలు 

ఘటనా స్థలాన్ని హిమాచల్‌ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్‌ సందర్శించారు. చివరి మృతదేహం వెలికి తీసే వరకు సహాయక చర్యలు కొనసాగుతాయని ఆయన తెలిపారు. మనాలీ–కత్రా వోల్వో బస్సులో 8 మంది ప్రయాణిస్తుండగా.. ఇందులో ముగ్గురు చనిపోయారు. ఐదుగురిని కాపాడి మండి ఆసుపత్రికి తరలించారు. మనాలీ నుంచి చంబా వెళ్తున్న మరో బస్సులో 47 మంది ప్రయాణికులున్నట్లు వీరభద్ర సింగ్‌ వెల్లడించారు. గాయపడిన వారి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందన్నారు. మృతుల కుటుంబాలను పరామర్శించి సంతాపం తెలిపారు. చాలా మృతదేహాలు ఛిద్రమవటంతో గుర్తుపట్టడం కష్టంగా మారింది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం అందిస్తామని వీరభద్ర సింగ్‌ ప్రకటించారు. ఈ ఘటనతో రహదారిలో రాకపోకలు నిలిపివేశారు. దీంతో ఇరువైపులా వందలాది వాహనాలు నిలిచిపోయాయి. హిమాచల్‌లో గతంలోనూ రెండుసార్లు ఈ తరహా ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. 1988లో సిమ్లా జిల్లా మతియానాలో కొండచరియలు పడి 45 మంది, 1994లో కులు జిల్లా లుగ్గార్‌ హతీలో 42 మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. 

 

ప్రధాని సంతాపం 

హిమాచల్‌ ప్రమాదంపై ప్రధాని మోదీ సంతా పం తెలిపారు. ‘మండి ఘటన చాలా బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సాను భూతి. ప్రమాదంలో గాయపడిన వారు వెంట నే కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. ఆ రాష్ట్రానికి అవసరమైన సహాయాన్ని చేసేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని మోదీ ట్వీట్‌ చేశారు. 

 

టీ విరామం కోసం ఆపగా.. 

ఓ బస్సు మనాలి నుంచి కాత్రాకు, మరో బస్సు మనాలి నుంచి చంబాకు వెళుతున్న క్రమంలో శనివారం అర్ధరాత్రి టీ విరామం కోసం కొత్‌పురి వద్ద ఆపారు. ఈ సమయంలో వీటిపై భారీ కొండచరియలు విరిగిపడటంతో ఈ బస్సులు 800 మీటర్ల లోతునున్న లోయలో పడ్డాయి. చుట్టుపక్కన ఉన్న పలు వాహనాలు, ఇళ్లు కూడా ఈ ఘటనలో ధ్వంసమయ్యాయి. 

 

ఆఫీసు పనిపై వెళ్లి.. 

నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండ లం ఔరవాణికి చెందిన దుబ్బాక కొండల్‌రెడ్డి (48), యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ మండలం జంపల్లికి చెందిన కొంతం రాజిరెడ్డి (52).. హైదరాబాద్‌లోని సుశీ హైటెక్‌ కంపెనీలో మేనేజర్లు. ఆఫీసు పనిలో భాగంగా హిమాచల్‌ ప్రదేశ్‌కు వెళ్లారు. ఈ నేపథ్యంలో వీరు ప్రయాణిస్తున్న జీపుపై కొండచరియలు పడ్డాయి. జీపు లోయలో పడిపోయింది. ఘటనలో కొండల్‌రెడ్డి, రాజిరెడ్డి మృతి చెందారు. రాజిరెడ్డి మృతదేహా న్ని ఆదివారం  ఎల్‌బీనగర్‌లోని ఆయన నివాసానికి తరలించారు. కొండల్‌రెడ్డి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు మూడు రోజులు పడుతుందని  కుటుంబీకులు చెప్పారు. 
Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top