యూజీసీ రద్దుకు కేంద్రం నిర్ణయం

Government proposes 'Higher Education Commission of India' to replace University Grants Commission - Sakshi

ఆ స్థానంలో హెచ్‌ఈసీఐ ఏర్పాటు

వర్షాకాల సమావేశాల్లో బిల్లు

న్యూఢిల్లీ: దేశంలోని ఉన్నత విద్యాసంస్థలకు నిధుల్ని అందజేస్తున్న యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ)ను రద్దుచేయాలని నిర్ణయించినట్లు కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి జవదేకర్‌ చెప్పారు. దీనిస్థానంలో హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా(హెచ్‌ఈసీఐ)ను ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకోసం యూజీసీ చట్టం–1951ను రద్దు చేస్తామన్నారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న హెచ్‌ఈసీఐ కోసం ముసాయిదా బిల్లును రూపొందించామన్నారు. జూలై 18 నుంచి ప్రారంభంకానున్న పార్లమెంటు వర్షకాల సమావేశాల్లో హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా బిల్లు–2018ను ప్రవేశపెడతామన్నారు.

తాజా బిల్లు ప్రకారం హెచ్‌ఈసీఐ కేవలం విద్యా సంబంధమైన విషయాలపై దృష్టి సారిస్తుందనీ, విద్యాసంస్థలకు  గ్రాంట్లు జారీచేసే అధికారం మానవవనరుల శాఖకు దక్కుతుందని వెల్లడించారు. అలాగే, విద్యా సంస్థల స్థాపనకు అనుమతులు, నిబంధనలు పాటించని వర్సిటీలు, కళాశాలల గుర్తింపును రద్దుచేసే అధికారం హెచ్‌ఈసీఐకి ఉంటుందన్నారు. విద్యా ప్రమాణాల్ని మెరుగుపర్చడంలో భాగంగా హెచ్‌ఈసీఐ సూచనలు ఇచ్చేందుకు సలహా మండలిని ఏర్పాటు చేస్తారు. సలహా మండలిలో అన్ని రాష్ట్రాల ఉన్నత విద్యా మండళ్ల చైర్మన్లు, వైస్‌ చైర్మన్లు సభ్యులుగా ఉంటారని తెలిపారు.  నియంత్రణ యంత్రాంగాన్ని సంస్కరించేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top