బిహేవియరల్‌ వ్యాక్సిన్‌తో కరోనాకు చెక్‌!

Follow Behavioural Vaccine Guidelines Avoid Affecting Covid 19 - Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా 190 కి పైగా దేశాలకు వ్యాపించింది. 15 వేల జీవితాలను కబళించి.. 3.5 లక్షలకు పైగా జనాన్ని ఆస్పత్రుల పాల్జేసింది. అయితే, కోవిడ్‌-19ను ఎదుర్కొనేందుకు ఇప్పటివరకైతే ఎలాంటి వ్యాక్సిన్‌ లేదు. ఇక తయారీ దశలో ఉన్న వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావాలంటే మరో ఏడాది పట్టొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ప్రాణాంతక వైరస్‌కు చెక్‌ పెట్టేందుకు బిహేవియరల్‌ వ్యాక్సిన్‌ ఒక్కటే సరైన మార్గమని పలువురు వైద్యశాస్త్ర నిపుణులు చెప్తున్నారు. మెడికల్‌ సంబంధమైన వ్యాక్సిన్‌ కోసం ఆలోచించడం మానేసి మన ‘చేతు’ల్లోనే ఉన్న ఈ వ్యాక్సిన్‌ను ట్రై చేయండని సూచిస్తున్నారు. ప్రవర్తనా పరమైన నాలుగు నియమాల్ని డోసులుగా భావించాలని చెప్తున్నారు. (చదవండి: కరోనా కట్టడి : ఇదీ అసలైన కర్ఫ్యూ)

ఒకటో డోసు..
దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు టిష్యూ పేపర్‌ లేదా చేతి రుమాలును అడ్డుగా పెట్టుకోండి. ఇతరులకు ఇబ్బంది కలగకుండా ‘ఎక్స్‌క్యూజ్‌ మీ’ అని ఆ పనిచేస్తే కాస్త హుందాగా ఉంటుంది. టిష్యూ పేపర్‌ అయితే ఎక్కడపడితే అక్కడ కాకుండా చెత్త డబ్బాల్లోనే వేయండి. కర్చీఫ్‌ను ఇంటికెళ్లాక సబ్బుతో శుభ్రం చేసి, ఎండలో మాత్రమే ఆరేయడం మరవొద్దు.

రెండో డోసు..
చేతులను రెండు వైపులా తరచూ సబ్బు నురగతో 20 సెకండ్లపాటు శుభ్రం చేసుకోండి. దీన్ని ఒక అలవాటుగా మార్చుకోండి. లేదంటే  ఇతర వ్యాధికారక క్రిములతో పాటు, కరోనా క్రిములు మీ చేతులకు అంటుకుని ఉంటాయి. సబ్బుతో చేతులు కడుక్కునే వీలు లేకుంటే.. ఆల్కహాల్‌తో తయారు చేసిన శానిటైజర్‌ను వాడండి. 60 శాతం ఆల్కహాల్‌ ఉన్న శానిటైజర్‌తోనే చేతులు శుభ్రం చేసుకుంటే మంచిది. వాటికే వైరస్‌ క్రిములను తొలగించే శక్తి ఉంటుంది. ఇక శానిటైజర్‌, సబ్బు రెండింటిని పోల్చినప్పుడు.. సబ్బుతో చేతులు కడిగితేనే క్రిములన్నీ తొలగిపోతాయన్నది నిరూపితం.

మూడో డోసు..
మఖాన్ని చేతులతో తాకొద్దు. ఆ అలవాటు మానుకోవాలి. లేదంటే అది మిమ్మల్ని ప్రాణాంతక వైరస్‌ బారిన పడేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రోజూవారి పనుల్లో భాగంగా చేతులకు ఎన్నో రకాల క్రిములు అంటుకుని ఉంటాయని ముందే చెప్పుకున్నాం. కాబట్టి చేతులతో నోరు, ముక్కు, చెవులను తాకొద్దు. వైరస్‌ క్రిములు ఈ మార్గాల ద్వారానే శరీరంలోకి వెళ్తాయి. క్రిములు ఒక్కసారి శరీరంలోకి చేరాయంటే అవి అంతకంతకూ శక్తి పెంచుకుని జీవితాల్ని అంతం చేస్తాయి. ఒక పరిశోధన ప్రకారం.. మనిషి ఒక గంట సమయంలో 20 నుంచి 30 సార్లు తన ముఖాన్ని తాకుతాడట. అంటే, ప్రతిరోజు మనం 500 సార్లు ముఖాన్ని చేతులతో తాకుతాం. ఇక కొందరైతే అదే అలవాటుగా రోజూ 3 వేల సార్లు ముఖాన్ని టచ్‌ చేస్తారట.

నాలుగో డోసు..
ఇతరులకు దూరంగా ఉండటం. అంటే సామాజిక దూరం పాటించడం. మనదేశంలో ఇది కొంచెం కష్టంగా తోచే వ్యవహారం. ఎందుకంటే బస్సుల్లో తోసుకుని పోవడం.. కిక్కిరిసిన రైళ్లల్లో ప్రయాణాలు చేయడం చాలా మంది ఎదుర్కొనే అనుభవాలు. అయితే, ఎదుటి వ్యక్తి ఎవరైనా దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు లేదా మనమూ అదే చేసినప్పుడు కనీసం మీటరు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రెండు మీటర్ల దూరం పాటిస్తే మరింత మంచిదని అంటున్నారు. కరచాలనం బదులు నమస్కారం చేయాలని చెప్తున్నారు. లేదంటే ఎదుటివారి చేతుల్లో దాగి ఉన్న కరోనా కత్తుల్ని సాదరంగా ఆహ్వానించిన వారవుతారని హెచ్చరిస్తున్నారు.

చివరగా.. ప్రతి ఒక్కరు ఈ నియమాలు (బిహేవియరల్‌ వ్యాక్సిన్‌) పాటిస్తే కరోనాకు ఇక చావే గతి! అయితే ఒక్క విషయం. నాకు కరోనా లేదు. నేనెందుకు ఇవన్నీ పాటించాలి అని మీరనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇవన్నీ అందరూ పాటిస్తేనే వైరస్‌ వ్యాప్తి చెందదు. అందరిలో మీరొకరు అని మరిచిపోవద్దు. అందరూ క్షేమంగా ఉంటారు. అందులో మీరూ ఉండండి!!
(చదవండి: కరోనా : జైలులో తిరుగుబాటు.. 23 మంది మృతి)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top