జుకర్‌ బర్గ్‌ను భారత్‌కు రప్పిస్తారా?

Facebook Breach: Data Ptotection Laws In India - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కేంబ్రిడ్జి అనలిటికా (సీఏ) సేవలను ఉపయోగించుకున్నట్లు కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు బుధవారం పరస్పరం పార్లమెంట్‌లో ఆరోపణలు చేసుకున్నాయి. ఫేస్‌బుక్‌ నుంచి సేకరించిన అమెరికా ఓటర్ల డేటాను అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈ కేంబ్రిడ్జి అనలిటికా సంస్థ ఉపయోగించినట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలో ఈ రెండు పార్టీల మధ్య వాదోపవాదనలు జరిగాయి. ఈ సందర్భంలోనే మన కేంద్ర సమాచార శాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ జోక్యం చేసుకొని ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌ను భారత్‌లో అనుమతిస్తామని, అయితే ఇలా ఖాతాదారుల డేటాను ఇతరులకు అందజేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు.

అవసరమైతే ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ను భారత్‌కు రప్పిస్తామని మంత్రి హెచ్చరించారు. ఇలాంటి ఉత్తుత్తి బెదిరింపులను మనం తాటాకు చప్పుళ్లు చేయడం అని చెప్పవచ్చు. దేశంలో తగినన్ని క్రిమినల్‌ చట్టాలు ఉన్నప్పటికీ విదేశాలకు పారిపోయిన నేరస్థులు నీరవ్‌ మోదీ, లలిత్‌ మోదీలను భారత్‌కు రప్పించలేక పోతున్నాం. ఇక భారతీయుల డేటా పరిరక్షిణకు దేశంలో తగిన చట్టాలే లేనప్పుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌ లాంటి వారిని భారత్‌కు రప్పిస్తామంటూ హెచ్చరించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి! పైగా ఇదే మంత్రిగారి ప్రభుత్వం సుప్రీం కోర్టు ముందు ఇటీవల ‘ప్రైవసీ’ ప్రాథమిక హక్కు కాదని వాదించింది. కేవలం ఐదు వందల రూపాయలకు ఆధార్‌ కార్డు వివరాలు ఎవరికైనా అందుబాటులో ఉండే ఈ దేశంలో పౌరుల వ్యక్తిగత వివరాలకు భద్రత ఎంతో ఊహించవచ్చు!

కేంద్ర ప్రభుత్వం 2000 సంవత్సరంలో తీసుకొచ్చిన ఒకే ఒక ఐటీ సమాచార చట్టం కింద పౌరుల వ్యక్తిగత డేటాకు భద్రతను కల్పిస్తోంది. ఇది కూడా కొన్ని అంశాలకు మాత్రమే పరిమితమై ఉంటుంది. ఫేస్‌బుక్‌ వ్యక్తం చేసే అభిప్రాయలలాంటివాటికి భద్రత ఉండదు.

ఈ చట్టం కింద భద్రంగా ఉంచాల్సిన అంశాలు
1. పాస్‌వర్డ్‌
2. ఆర్థిక సమాచారం అంటే, బ్యాంక్‌ ఖాతాల వివరాలు, ఆర్థిక చెల్లింపు సాధనాలు
3. ఆరోగ్య పరిస్థితి
4. వైద్య రికార్డులు, హిస్టరీ
5.లైంగిక దక్పథం.
6. బయోమెట్రిక్‌ సమాచారం.

ఈ ఆరు అంశాలకు తగిన భద్రత కల్పించాలని, అందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని చట్టంలో ఉందిగానీ ఈ అంశాలను తస్కరించిన వారికి, అందుకు సహకరించిన వారికి ఎలాంటి శిక్షలు విధించాలో లేదు. బిహార్‌ ఎన్నికల్లో ఓటర్ల నాడిని పట్టుకునేందుకు ఇదే కేంబ్రిడ్జి సంస్థ, ఫేస్‌బుక్‌లో భారతీయుల వివరాల డేటాను ఉపయోగించుకుంది. అలాంటప్పుడు ఈ 2000–ఐటీ చట్టం కింద భారత ప్రభుత్వం జూకర్‌ బర్గ్‌ను భారత్‌కు రప్పించగలదా? అన్నది కోటి రూకల ప్రశ్న.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top