
న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాల కోసం డిసెంబర్ 14 సాయంత్రం వరకూ వేచి చూడాల్సిందేనని సీనియర్ ఎన్నికల అధికారి తెలిపారు. రెండు రాష్ట్రాల్లో చివరి దశ పోలింగ్ ముగిసిన అరగంట అనంతరం ఎగ్జిట్ పోల్స్ ప్రసారం చేయవచ్చని పేర్కొంటూ ఎన్నికల సంఘం ఉత్తర్వుల్ని ఆయన ఉదహరించారు. హిమాచల్‌లో నవంబర్ 9న ఒకే దశలో ఎన్నికలు జరగనుండగా, గుజరాత్‌లో డిసెంబర్ 9, డిసెంబర్ 14న రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో గుజరాత్ రెండు దశల ఎన్నికలు పూర్తయ్యేవరకూ హిమాచల్ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించడం నిషేధం.
హిమాచల్ బరిలో 349 మంది అభ్యర్థులు
సిమ్లా: నవంబర్ 9న జరగనున్న హిమాచల్ల్ ఎన్నికల్లో 349 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. గురువారం సాయంత్రంతో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియడంతో పోటీలో నిలిచిన అభ్యర్థుల వివరాల్ని అధికారులు వెల్లడించారు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీలు మొత్తం 68 స్థానాల్లో అభ్యర్థులను నిలపగా, సీపీఎం 18 చోట్ల పోటీ చేస్తోంది. 22 నియోజకవర్గాల్లో చతుర్ముఖ పోటీ జరగనుంది. ధర్మశాలలో అత్యధికంగా 12 మంది, కర్సోగ్‌లో 10 మంది తలపడుతున్నారు. ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ అర్కి స్థానంలో బీజేపీ అభ్యర్థి రత్తన్‌పాల్‌ను ఢీకొడుతున్నారు. సుజన్‌పూర్ నుంచి పోటీ చేస్తున్న ప్రతిపక్ష నేత ప్రేమ్ కుమార్ ధూమల్‌తో కాంగ్రెస్ అభ్యర్థి రాజీందర్ రానా తలపడుతున్నారు. కాంగ్రెస్ నుంచి నలుగురు, బీజేపీ నుంచి ఇద్దరు రెబెల్స్ బరిలో ఉన్నారు.