‘తమాంగ్‌’పై లెక్కలు తప్పిన ‘ఈసీ’

EC Equations Went Wrong In CM Prem Singh Tamang - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భారత ఎన్నికల కమిషన్‌ ఆదివారం నాడు ఓ అసాధారణ నిర్ణయం తీసుకుంది. సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్‌సింగ్‌ తమాంగ్‌ ఎన్నికల్లో ఆరేళ్లపాటు పోటీ చేయకూడదనే ఆంక్షలను ఏడాది ఒక నెలకు (13 నెలలకు) కుదించింది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 11వ సెక్షన్‌ కింద తమకున్న అధికారాలను ఉపయోగించుకొని ఈ అసాధారణ నిర్ణయం తీసుకున్నట్లు గొప్పగా సమర్థించుకుంది. ఇక్కడే దాని లెక్కలు పూర్తిగా తప్పాయి. అన్ని విషయాలను అవగాహన లోకి తీసుకొని ఆలోచిస్తే గుడ్లు తేలేసే పరిస్థితి దానికి తప్పదు.

ఓ అవినీతి కేసులో దోషిగా తేలిన ప్రేమ్‌సింగ్‌ తమాంగ్‌ 2018, ఆగస్టు నెలలో జైలు నుంచి విడుదలయ్యారు. ప్రజా ప్రాతినిధ్యం చట్టం నిబంధనల ప్రకారం దోషిగా నిర్ధారితుడైన వ్యక్తి జైలు నుంచి విడుదలైన నాటి నుంచి ఆరేళ్ల పాటు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయడానికి వీల్లేదు. అయితే 2019, మే నెలలో సిక్కిం అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మిత్రపక్షంగా ప్రేమ్‌సింగ్‌ తమాంగ్‌ నాయకత్వంలోని ’సిక్కిం క్రాంతికారి మోర్చా’ పోటీ చేసింది. అసెంబ్లీలోని 32 సీట్లకుగాను 17 సీట్లను గెలుచుకుంది. మిత్రపక్షమైన బీజేపీ ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయింది.

అసెంబ్లీ ఎన్నికల్లో అధిక సీట్లను గెలుచుకున్న ‘సిక్కిం క్రాంతికారి మోర్చా’ తమ శాసన సభాపక్ష నేతగా ప్రేమ్‌సింగ్‌ తమాంగ్‌ను ఎన్నుకుంది. ఈ నేపథ్యంలో తమాంగ్‌పై ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయరాదనే అనర్హత వేటు ఉన్నప్పటికీ ఆయన్నే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా సిక్కిం గవర్నర్‌ ఆహ్వానించారు. ఆ మేరకు 2019, మే 27వ తేదీగా సిక్కిం ముఖ్యమంత్రిగా తమాంగ్‌ ప్రమాణ స్వీకరాం చేశారు. ఆయన గత నాలుగు నెలలుగా సీంగా పదవిలో కొనసాగుతున్నారు. శాసన సభ్యత్వం లేకుండా సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వ్యక్తి చట్ట ప్రకారం ఆరు నెలల్లో శాసస సభకు ఎన్నిక కావాల్సి ఉంది. అంటే ఆయన ఎన్నిక కావడానికి మరో రెండు నెలల వ్యవధి ఉంది. ఈ లోగా ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హత లేని వ్యక్తిని ఎలా సీఎం చేస్తారంటూ ఆయన ఎన్నికను సవాల్‌ చేస్తూ ఓ రిట్‌ పిటిషన్‌ దాఖలైంది. అది ప్రస్తుతం సుప్రీం కోర్టు విచారణలో ఉంది.

ఈ నేపథ్యంలో అదివారం నాడు కేంద్ర ఎన్నికల కమిషన్‌ తమాంగ్‌పై ఆరేళ్లపాటున్న అనర్హత ఆంక్షలను 13 నెలలకు కుదిస్తూ అసాధారణ నిర్ణయం తీసుకుంది. తమాంగ్‌ 2018, ఆగస్టు నెలలో విడుదలయ్యారు గనుక ఆయనపై ఆంక్షలు 2019, సెప్టెంబర్‌ నెల వరకు వర్తిస్తాయి. అక్టోబర్‌ నుంచి వర్తించవు. ఆయన నాలుగు నెలల క్రితమే సీఎం బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో అక్టోబర్‌ లేదా నవంబర్‌ నెలల్లో ఆయన అసెంబ్లీకి పోటీ చేయవచ్చన్నది ఎన్నికల కమిషన్‌ అంచనా లేదా వ్యూహం అని చెప్పవచ్చు. ఇక్కడే ఎన్నికల కమిషన్‌ అడుసులో కాలేసింది. అనర్హత వేటును ఎదుర్కొంటున్న వ్యక్తి సీఎంగా బాధ్యతలు స్వీకరించడానికే అనర్హుడు. ఈ విషయం ఎన్నికల కమిషన్‌ దృష్టిలో లేనట్లుంది.

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత విషయంలో 2001లో సుప్రీం కోర్టు ఈ విషయాన్ని స్పష్టం చేసింది. 2000, ఏప్రిల్‌ నెలలో ఓ ప్రభుత్వ భూమి అమ్మకంలో జయలలిత అవినీతికి పాల్పడినట్లు 2001లో తేలింది. దాంతో ప్రజాప్రాతినిధ్య చట్టం కింద ఆమె ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేకుండా పోయింది. 2001లో తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో జయలలితకు చెందిన ఏఐఏడిఎంకే పార్టీ విజయం సాధించింది. ఆ నేపథ్యంలో 2001, జూన్‌ నెలలో ఆమెతో సీఎంగా ఆ రాష్ట్ర గవర్నర్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆమె నియామకాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ కేసులో జయలలిత నియామం చెల్లదంటూ సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది.

‘అనర్హత ఆంక్షలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ముఖ్యమంత్రిగా గవర్నర్‌ ఏ కారణంతోని నియమించినా ఆ నియామకం చెల్లదు. ఆ నియామకం భారత రాజ్యాంగంలోని 164వ అధికరణకు విరుద్ధం. గవర్నర్‌ నియమించారన్న కారణంగా సీఎం నియామకం చెల్లుబాటు కాదు. రాజ్యాంగ నిబంధనలకు ఏమాత్రం విరుద్ధంగా ఉన్నా ఆ నియామకాన్ని రద్దు చేయాల్సిందే. ఆ తదుపరి న్యాయ ప్రక్రియ ద్వారాగానీ, నోటిఫికేషన్‌ ద్వారాగానీ నియామకాన్ని రద్దు చేయవచ్చు’ అంటూ సుప్రీం కోర్టు స్పష్టమైన తీర్పు చెప్పింది. తమాంగ్‌పై అనర్హత ఆంక్షలను ఎన్నికల కమిషన్‌ 13 నెలలకు కుదించడం వల్ల ఆ ఆంక్షలు ఈ సెప్టెంబర్‌ నెల వరకు వర్తిస్తాయి. తమాంగ్‌ నియామకం నాలుగు నెలల క్రితమే జరిగినందున సుప్రీం కోర్టు ఉత్తర్వులు చెల్లవు.

తమాంగ్‌ తనపై ఆంక్షలను రద్దు చేయాల్సిందిగా గానీ లేదా కుదించాల్సిందిగా గానీ ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించారా? అంటూ ఎన్నికల కమిషన్‌ వర్గాలను మీడియా ప్రశ్నించగా, లేదని సమాధానం వచ్చింది. అలాంటప్పుడు ఆయనపై ఎన్నికల కమిషన్‌కు ఈ అసాధారణ ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తీవ్ర ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న ఎన్నికల కమిషన్‌ ఈసారి కూడా ఒత్తిళ్లకు తలొగ్గే ఇలాంటి అసాధారణ నిర్ణయం తీసుకుందా ? ఏదేమైనప్పటికీ అంతిమ తీర్పు రాజ్యాంగానికి లోబడాల్సిందే కదా!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top