‘మోదీ’ వెబ్‌ సిరీస్‌పై ఈసీ కీలక ఆదేశాలు

EC Bans Web Series Made On PM Modi Until Further Orders - Sakshi

న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా రూపొందిన వెబ్‌సిరీస్‌ను తాత్కాలికంగా నిషేధిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసింది. ‘మోదీ- జర్నీ ఆఫ్‌ ఏ కామన్‌ మ్యాన్‌’ పేరిట ఆన్‌లైన్‌లో స్ట్రీమ్‌ అవుతున్న వెబ్‌సిరీస్‌ను తక్షణమే నిలిపివేయాలని ఈరోస్‌ నౌను ఆదేశించింది. ఈ మేరకు.. ‘ ప్రధాని మోదీ జీవితం ఆధారంగా రూపొందిన వెబ్‌ సిరీస్‌లోని ఐదు ఎపిసోడ్‌లు ఇప్పటికీ మీ ప్లాట్‌ఫాంలో అందుబాటులో ఉన్నాయని మా దృష్టికి వచ్చింది. వెంటనే వాటిని నిలిపివేయాల్సిందిగా ఆదేశిస్తున్నాం. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్‌ స్ట్రీమింగ్‌ ఆపేయాలి. అదే విధంగా వెబ్‌ సిరీస్‌ కంటెంట్‌ను పూర్తిగా తొలగించాలి’ అని ఈసీ పేర్కొంది.

కాగా దేశంలో లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యే వరకు రాజకీయ నాయకుల బయోపిక్‌లను విడుదల చేయకూడదని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా వివేక్‌ ఒబేరాయ్‌ ప్రధాన పాత్రలో ‘పీఎం నరేంద్ర మోదీ’  సినిమా విడుదలకు బ్రేక్ పడింది. ప్రస్తుతం వెబ్‌ సిరీస్‌ను కూడా ఈసీ బ్యాన్‌ చేయడంతో ఎన్నికలు ముగిసేంతవరకు మోదీ అభిమానులు వేచి చూడక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇక దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో మంగళవారం(ఏప్రిల్‌ 23) మూడో దఫా ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. మొత్తం 116 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్న తరుణంలో రాజకీయ నాయకులు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలో కేరళలోని వయనాడ్‌ నుంచి తొలిసారిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తరఫున.. ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా ప్రచారం ముమ్మరం చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top