దేశంలో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతుండడంపై విపక్షాలు గురువారం లోక్‌సభలో సర్కారుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి.
న్యూఢిల్లీ: దేశంలో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతుండడంపై విపక్షాలు గురువారం లోక్‌సభలో సర్కారుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి. మోడీ సర్కార్ వస్తే అంతా బాగుంటుందని అరచేతిలో స్వర్గం చూపించారని, అయితే ఇప్పుడు అందుకు భిన్నంగా ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని సాధారణ బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ప్రభుత్వాన్ని విమర్శించాయి.
కీలకమైన ఆరోగ్యం, విద్యారంగాలకు బడ్జెట్‌లో తగినంత కేటాయింపులు చేయలేదని అసంతృప్తి వ్యక్తంచేశాయి. విదేశాలనుంచి నల్లధనాన్ని వెనక్కి తీసుకువచ్చే విషయంలో కూడా విపక్ష సభ్యులు ప్రభుత్వాన్ని నిలదీశారు. సాధారణ బడ్జెట్‌పై సభలో గురువారం తిరిగి చర్చ ప్రారంభమైంది. బీజేపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక నిత్యావసర సరకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు ములాయంసింగ్ యాదవ్ అన్నారు.
ధరలు తగ్గిస్తామని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదని ఆయన దుయ్యబట్టారు. నల్లధనాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం గట్టిచర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. చిన్నా, చితకా వ్యక్తులపై దాడులు చేస్తే లాభం లేదని, దమ్ముంటే బడా సంస్థలపై దాడులు చేయాలని అన్నారు.
ముస్లింల ప్రగతికి చర్యలేవీ?: ఒవైసీ
మైనారిటీల ప్రగతికి ఎలాంటి చర్యలనూ ప్రకటించని ఈ బడ్జెట్‌ను వ్యతిరేకిస్తున్నామని ఎంఐఎంకు చెందిన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. బడ్జెట్‌పై చర్చలో ఆయన మాట్లాడుతూ మదర్సాలకు ప్రభుత్వం ఇస్తామన్న రూ. వంద కోట్లను పంచితే ఒక్కో మదర్సాకు రూ. 15 కూడా రావని ఎద్దేవా చేశారు. కాగా, ఈ బడ్జెట్‌లో కేంద్రం తెలంగాణ రాష్ట్రాన్ని విస్మరించిందని వైఎస్సార్‌సీపీ ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. టీఆర్‌ఎస్‌కు చెందిన పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.