మతం పేరుతో దేశంలో విభేదాలు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారంటూ గురువారం కాంగ్రెస్, బీజేపీలు పరస్పరం విమర్శలు
కాంగ్రెస్, బీజేపీల పరస్పర ఆరోపణలు
న్యూఢిల్లీ: మతం పేరుతో దేశంలో విభేదాలు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారంటూ గురువారం కాంగ్రెస్, బీజేపీలు పరస్పరం విమర్శలు గుప్పించుకున్నాయి. బీజేపీ మతతత్వ ఎజెండాతో, దేశంలో విభజన రాజకీయాలు చేస్తోందంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా ధ్వజమెత్తగా, మతం పేరుతో దేశంలో చీలికలు తేవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని బీజేపీ విరుచుకుపడింది. కేంద్రం, దాని అధినేతలు ప్రణాళికాబద్ధంగా దేశంలో కాంగ్రెస్ పార్టీ వారసత్వాన్ని రూపుమాపేందుకు వ్యూహం పన్నుతున్నారని సోనియా విమర్శించారు.
ఇందిరాగాంధీ 98వ జయంతి సందర్భంగా ఆమె ప్రసంగించారు. మాఫియా డాన్ చోటా రాజన్ గురించి కాంగ్రెస్ నేత షకీల్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఆ వ్యాఖ్యలు కాంగ్రెస్ మతతత్వ వైఖరిని తేటతెల్లం చేస్తున్నాయని పేర్కొంది. ‘చోటా రాజన్, అనూప్ చేటియాలు ముస్లింలు అయ్యుంటే.. వారిపై మోదీ ప్రభుత్వ వైఖరి వేరేగా ఉండేది’ అంటూ షకీల్ అహ్మద్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ‘బిహార్‌లో అసహనం అంటూ ప్రచారం చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలతో మతం పేరుతో దేశాన్ని విభజించాలనుకుంటున్నారు. చివరకు టైస్టులకు కూడా మతం రంగు పులుముతున్నారు’ అంటూ ధ్వజమెత్తారు.