నిధులున్నా.. ఖర్చు చేయలేదు!

Authorities in Delhi have over Rs 1,500 cr funds to fight pollution - Sakshi

కాలుష్య నియంత్రణలో ఢిల్లీ యంత్రాంగం అలసత్వం

రూ.1500 కోట్లున్నా ఖర్చు చేయని వైనం

రెండేళ్ల ముందే బీఎస్‌–6 ఇంధనం

న్యూఢిల్లీ: దేశరాజధానిలో వాయు కాలుష్యాన్ని ఎదుర్కొనడానికి రూ.1500 కోట్ల మేర నిధులు ఉన్నప్పటికీ అధికారులు చాలావరకు వాటిని వినియోగించుకోలేదని వెల్లడైంది.  ఈ మొత్తంలో 2015 నుంచి ఢిల్లీలోకి ప్రవేశించే ట్రక్కులపై సుప్రీం కోర్టు విధించిన పర్యావరణ పరిహార చార్జీ(ఈసీసీ) కింద రూ.1,003 కోట్లు వసూలుకాగా, మిగతా మొత్తం రాష్ట్రంలో డీజిల్‌ అమ్మకాలపై విధించిన సెస్‌ ద్వారా సమకూరాయి. గతేడాది నుంచి సుప్రీం ఆదేశాల మేరకు 2,000 సీసీ, అంతకంటే ఎక్కువ సామర్థ్యమున్న డీజిల్‌ కార్లపై 1% సెస్‌ విధించడం ద్వారా కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు(సీపీసీబీ)కి రూ.62 కోట్లు సేకరించినట్లు సమాచార హక్కుచట్టం కింద దాఖలు చేసిన పిటిషన్‌కు ప్రభుత్వం జవాబిచ్చింది. 2007లో అప్పటి సీఎం షీలా దీక్షిత్‌ డీజిల్‌పై విధించిన సెస్‌ వల్ల ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ ఆధ్వర్యంలోని ‘ఎయిర్‌ అంబియెన్స్‌ ఫండ్‌’లో రూ.500 కోట్ల మేర నిధులు జమ అయ్యాయంది. ఈ విషయమై రాష్ట్ర రవాణాశాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు స్పందిస్తూ.. ఎలక్ట్రిక్‌ బస్సుల్ని కొనుగోలు చేయడానికి ఈ నిధి నుంచి సబ్సిడీ అందజేస్తామని తెలిపారు. మరోవైపు దేశరాజధానిలో కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ, హరియాణాల సీఎంలు కేజ్రీవాల్, మనోహర్‌లాల్‌ ఖట్టర్‌లు నిర్ణయం తీసుకున్నారు.

2018, ఏప్రిల్‌ నుంచే బీఎస్‌–6 అమలు
ఢిల్లీలో కాలుష్యాన్ని అరికట్టడంలో భాగంగా తక్కువ సల్ఫర్‌ ఉద్గారాలను వెలువరించే భారత్‌ స్టేజ్‌(బీఎస్‌)–6 పెట్రోల్, డీజిల్‌లను 2018, ఏప్రిల్‌ 1 నుంచి అమలు చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. తొలుత 2020 నాటికి బీఎస్‌–6 నిబంధనల్ని అమలు చేయాలని నిర్ణయించినప్పటికీ తాజా పరిస్థితుల నేపథ్యంలో ఢిల్లీలో రెండేళ్లు ముందుకు జరిపారు. దేశంలోని మిగతా ప్రాంతాల్లో సాధారణంగా 2020 ఏప్రిల్‌ నుంచే ఈ నిబంధనల్ని అమలు చేయనున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top