
ఢిల్లీ: చినుకు కోసం మేఘాలను చిలకబోతోంది దేశ రాజధాని ఢిల్లీ నగరం. కాలుష్య రక్కసిని సంహరించడానికి వరుణుడినే ఓ అస్త్రంగా సంధించబోతోంది. సాంకేతిక పరిజ్ఞానం దన్నుతో ఢిల్లీ నగరం కాలుష్య భూతంతో పోరాటానికి సిద్ధమవుతోంది. ఢిల్లీలో ఈ నెలాఖరు నుంచి ఐదు ప్రదేశాల్లో మేఘమథనం ట్రయల్స్ నిర్వహించనున్నారు.
మేఘాలు, తేమ ఆధారంగా ఆ ఐదు ప్రాంతాలను అప్పటికప్పుడు నిర్ణయిస్తారు. సరైన తేమ ఉంటేనే మేఘాలు వర్షిస్తాయి. అందుకే అనువైన మేఘాలు, సరిపోను తేమ వంటి అంశాలను గమనించి ఆ ఐదు ప్రదేశాలను ఎంపిక చేయనున్నారు. భద్రతా కారణాల రీత్యా లుట్యెన్స్ ఢిల్లీ, ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాంతాలను మేఘమథనం నుంచి మినహాయించినట్టు అధికార వర్గాలు తెలిపాయి.
కాన్పూర్ ఐఐటీ సాంకేతిక సహకారంతో ఢిల్లీ శివార్లలో అమలయ్యే ఈ ప్రాజెక్టు వ్యయం రూ.3.21 కోట్లు. 100 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో కృత్రిమ వర్షం తొలి ట్రయల్ నిర్వహిస్తారు. ఒక్కో ప్రయోగం వ్యవధి గంట నుంచి గంటన్నర. వేర్వేరు రోజుల్లో జరపనున్న ఈ మేఘమథనం కోసం 13 కేంద్ర, రాష్ట్ర (ఢిల్లీ) ప్రభుత్వ సంస్థల నుంచి లాంఛనపరమైన అనుమతులు లభించాల్సివుంది. ఢిల్లీలో కృత్రిమ వాన కురిపించాలనే ప్రతిపాదనలు తెరపైకి రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం 2023 శీతాకాలంలో ఈ ప్రతిపాదనను ప్రకటించింది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవంటూ ఆ కార్యక్రమాన్ని అప్పట్లో అది విరమించుకుంది.
నిరుడు శీతాకాలంలోనూ మేఘమథనం కోసం ‘ఆప్’ సర్కారు పాకులాడింది. కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదంటూ ఆ ప్రయత్నం నుంచి మరోమారు వెనక్కు తగ్గింది. ఈ ప్రయోగంలో వర్షించడానికి అనుకూలమైన, సరిపోను తేమ గల మేఘాల కోసం శాస్త్రవేత్తలు అన్వేషిస్తారు. వాటిని గుర్తించాక సిల్వర్ అయోడైడ్, సోడియం క్లోరైడ్ (ఉప్పు), డ్రై ఐస్ (ఘనీకృత కార్బన్ డై ఆక్సైడ్) వంటి రసాయన పదార్థాలను విమానంలో తీసుకెళ్లి ఆ మేఘాలపై చల్లుతారు. అలా మేఘాలు వర్షిస్తాయి. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి, గాలి నాణ్యతను మెరుగుపరచడానికి పలు దేశాల్లో ఇలాంటి ‘స్వల్పకాలిక’ ప్రయోగాలు చేస్తున్నారు. అయితే వీటితో ఉపయోగమెంత అనేది ఓ చర్చనీయాశంగానే మిగిలింది!
- జమ్ముల శ్రీకాంత్