
ఢిల్లీ: కేంద్రం, ఆర్‌ఎస్‌ఎస్ మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వందేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొన్ని విషయాల్లో అభిప్రాయ బేధాలు ఉండొచ్చు.. వివాదం కాదంటూ చెప్పుకొచ్చారు. దేశ ప్రయోజనాలే ఇద్దరి ప్రాధాన్యతగా పేర్కొన్న మోహన్ భగవత్.. బీజేపీ అధ్యక్షుడి ఎన్నికను ఆర్‌ఎస్‌ఎస్ శాసించదన్నారు.
‘‘మేం సలహా ఇవ్వగలం .. తుది నిర్ణయం వారిదే. నూతన విద్యా విధానానికి మేం మద్దతిస్తున్నాం. ఇంగ్లీష్ నేర్చుకోవడంలో తప్పులేదు’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ తరఫున ఆర్‌ఎస్‌ఎస్ నిర్ణయాలు తీసుకుంటుందని ప్రతిపక్షాల నుండి వస్తున్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలతో తమకు మంచి సమన్వయం ఉందని మోహన్ భగవత్ వెల్లడించారు.
అంతర్గత వైరుధ్యాలు ఉన్న వ్యవస్థలు ఉన్నాయని.. అయితే ఏ విధంగానూ వివాదం లేదన్న ఆయన.. ప్రతి ప్రభుత్వంతో తమకు మంచి సమన్వయం ఉందంటూ పేర్కొన్నారు. ‘‘మనం రాజీ గురించి మాట్లాడినప్పుడు, పోరాటం తీవ్రమవుతుంది. అభిప్రాయాలు ఉండవచ్చు, కానీ మేం చర్చించుకుంటాం. సమష్టిగా నిర్ణయం తీసుకుంటాం. ఆర్ఎస్ఎస్, బీజేపీలు ‘ఒకరినొకరు విశ్వసిస్తాయి’’ అని మోహన్ భగవత్ పేర్కొన్నారు.