
ఏపీకి ఏటా రూ.60వేల కోట్ల నష్టం: జైరాం
ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏటా రూ.60వేల కోట్ల నష్టం వాటిల్లుతుందని కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ అన్నారు.
న్యూఢిల్లీ : ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏటా రూ.60వేల కోట్ల నష్టం వాటిల్లుతుందని కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ అన్నారు. శుక్రవారం ఆయన న్యూఢిల్లీలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర విభజన చట్టంలో అన్ని విషయాలు స్పష్టంగా ఉన్నాయన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పలేదన్నారు. హోదా ఇవ్వని పాపం మోదీ ప్రభుత్వానిదేనని జైరాం రమేష్ విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించడం సరికాదన్నారు. ఒకవేళ అప్పగిస్తే చట్టసవరణ అవసరం అని ఆయన అన్నారు. చట్టంలోని అంశాలను కేంద్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని జైరాం రమేష్ ఆరోపించారు.
చట్టసవరణకు కాంగ్రెస్ మద్దతివ్వదని ఆయన స్పష్టం చేశారు. ఓ సీనియర్ మంత్రిలా వెంకయ్య మాట్లాడటం లేదని, ప్రధాని మోదీని ఆయన పక్కదారి పట్టిస్తున్నారన్నారు. కాంగ్రెస్ మీద విమర్శలు మాని ఏపీకి న్యాయం చేయాలన్నారు. ఉప రాష్ట్రపతి పదవి కోసమే వెంకయ్య ఇదంతా చేస్తున్నారని జైరాం రమేష్ మండిపడ్డారు. చంద్రబాబుకు కేంద్రానికి సఖ్యత లేదని అన్నారు. అరుణ్ జైట్లీ ఏపీకి కొత్తగా ఏమీ ఇవ్వలేదని ఆయన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ సీనియర్ నేత జేడీ శీలం మాట్లాడుతూ... సాయం గురించి కాదని... ప్రత్యేక హోదా గురించి కేంద్రం మాట్లాడాలని డిమాండ్ చేశారు. ఏపీకి హోదా రాకపోతే రూ.60వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.3లక్షల కోట్ల నష్టం జరుగుతుందన్నారు.