మావోల ఏరివేతకు మహిళా కమాండోలు

All Women Anti Naxal Commando Unit Deployed In Dantewada - Sakshi

రాయ్‌పూర్‌ : హింసాత్మక ఘటనలతో పేట్రేగిపోతున్న మావోయిస్టుల కార్యకలాపాలను కట్టడి చేసేందుకు ఛత్తీస్‌గఢ్ సరికొత్త ప్రణాళికతో ముందుకొచ్చింది. 30 మంది మహిళలతో యాంటీ నక్సల్స్ కమాండో యూనిట్‌ను ఏర్పాటు చేసింది. నక్సల్స్ చర్యలను సమర్థవంతంగా తిప్పికొట్టే చర్యల్లో భాగంగా ఏర్పాటైన ఈ బృందానికి ‘దంతేశ్వరి లఢకే’ అని నామకరణం చేశారు. మావో ప్రభావిత ప్రాంతాలైన బస్తర్, దంతేవాడ ప్రాంతాల్లో ఈ మహిళా కమాండోల బృందం సేవలు అందించనుంది. ఇక ఈ ప్రత్యేక బృందంలో 10 మంది మాజీ నక్సలైట్లు ఉండటం విశేషం. గతంలో నక్సలైట్లుగా పనిచేసి లొంగిపోయిన మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి.. దంతేశ్వరి బృందంలోకి తీసుకున్నారు.

మహిళా సాధికారతకు మరో ఉదాహరణ
పురుషులతో కూడిన కమాండోల బృందానికి అనుబంధంగా ఈ మహిళా కమాండోల బృందం సేవలు అందిస్తుందని బస్తర్ ఐజీ వివేకానంద సిన్హా తెలిపారు. వీరంతా సమర్థవంతంగా విధులు నిర్వహిస్తారని ధీమా వ్యక్తం చేశారు. దంతేశ్వరి లఢకే ఏర్పాటు మహిళా సాధికారితకు మరో ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. కాగా ఇటీవల కాలంలో ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు అంతకంతకూ తమ కార్యకలాపాలు విస్తరిస్తున్నారు. పలు హింసాత్మక ఘటనలతో పోలీసులకు సవాల్ విసురుతున్నారు. మందుపాతరల పేలుళ్లతో బెంబేలెత్తిస్తున్నారు. ఇందులో భాగంగా కొద్ది రోజుల కిందట పోలీస్ వ్యాన్‌ను పేల్చేసిన ఘటనలో 16 మంది పోలీసులు దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సవాల్‌ విసురుతున్న మావోల వ్యవహారంలో భద్రతా బలగాలు మరింత పకడ్బందీగా వ్యూహాలు అమలు చేయడంలో నిమగ్నమయ్యాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top