రాజకీయ శూన్యత పూరించేదెవరు?

After Karunanidhi Death Political Climate Change In Tamil Nadu - Sakshi

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రులు, రెండు ప్రధాన ద్రవిడ పార్టీలు డీఎంకే, ఏఐడీఎంకే నేతలు ఎం.కరుణానిధి, జయలలిత మరణంతో రాష్ట్రంలో రాజకీయాలు ఎటు తిరుగుతాయి? మూడున్నర దశాబ్దాలకు పైగా రాష్ట్రాన్ని పరిపాలించిన ఈ ఇద్దరు అగ్రనేతలు లేని లోటును ఎవరు తీరుస్తారు? ఇద్దరు తమిళ సూపర్‌ స్టార్లు రజనీకాంత్, కమల్‌హాసన్‌ నాయకత్వంలోని కొత్త ప్రాంతీయపక్షాలు ఎంత వరకు ఈ ఖాళీని భర్తీ చేస్తాయి? అనే ప్రశ్నలు తమిళ రాజకీయ పండితులకు చర్చనీయాంశాలుగా మారాయి. కరుణానిధి తన రాజకీయ వారసునిగా మూడో కొడుకు ఎంకే స్టాలిన్‌ను  కిందటేడాది జనవరిలో ప్రకటించారు.

పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షునిగా నియమించారు. ఫలితంగా ఆయన కుటుంబ సభ్యుల్లో రాజకీయలతో సంబంధమున్న రెండో కుమారుడు, కేంద్ర మాజీ మంత్రి ఎంకే అళగిరి, చిన్న కూతురు, రాజ్యసభ ఎంపీ కనిమొళి, ఇంకా ఆయన మేనల్లుడి కొడుకు, కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్‌లు డీఎంకే నాయకత్వం కోసం పోటీ పడే అవకాశాలు లేవు. 65 ఏళ్ల స్టాలిన్‌ 1973 నుంచీ డీఎంకే కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటూ, 1984 నుంచీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 45 ఏళ్లుగా పార్టీ కార్యకర్తలు, నాయకులతో ఉన్న సంబంధాలు, పార్టీ విభాగాలు, ఆస్తులపై ఉన్న పట్టు కారణంగా స్టాలిన్‌కు పార్టీని ముందుకు తీసుకెళ్లే అన్ని అవకాశాలూ ఉన్నాయి. 

ఏఐడీఎంకే నిలదొక్కుకుంటుందా?
ఏఐడీఎంకేలో సీఎం పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌సెల్వం ప్రస్తుతానికి కలిసి పనిచేస్తున్నా వారిద్దరి నాయత్వాన పార్టీలో రెండు గ్రూపులు నడుస్తున్నాయనేది బహిరంగ రహస్యమే. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పన్నీర్‌సెల్వంకు సన్నిహిత సంబంధాలున్నందున రాబోయే ఎన్నికల్లో ఆయన వర్గం ఎన్డీఏకు దగ్గరైతే పార్టీ బలహీనపడే ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితిలో జయ సన్నిహితురాలు వీకే శశికళ అక్క కొడుకు టీటీవీ దినకరన్‌ నాయకత్వంలోని అమ్మా మక్కల్‌ మున్నేట్ర కజగం మాతసంస్థ ఏఐడీఎంకే నేతలు, కార్యకర్తలను పెద్ద సంఖ్యలో చీల్చి కొంత మేరకు బలపడే అవకాశాలు కూడా లేకపోలేదు.

ఏఐడీఎంకే పాలనకుగాని, పళనిస్వామికిగాని జనాదరణ అంతంత మాత్రమే. ఈ పరిస్థితుల్లో ఏఐడీఎంకే ఎన్ని పార్టీలుగా చీలిపోతుందో కూడా చెప్పలేమని తమిళ రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. జయలలిత తర్వాత జనాకర్షణ శక్తి ఉన్న నేతలెవరూ లేకపోవడం, అర్థబలంతో అంగబలం సంపాదించిన శశికళ జైల్లో ఉండడంతో ఏఐడీఎంకే పూర్వ వైభవం సంపాదించడానికి చాన్సే లేదని తేల్చిచెబుతున్నారు. 

రజనీ, కమల్‌ పార్టీలకు ఇంకా పునాదులే లేవు
ఇద్దరు తమిళ రాజకీయ దిగ్గజాలు జయ, కరుణ లేని పరిస్థితుల్లో తమ అదష్టం పరీక్షించుకోవడానికి మక్కల్‌ నీతి మెయ్యం అనే పార్టీ పెట్టిన కమల్‌హాసన్‌గాని, ఇంకా పార్టీ పేరు ప్రకటించకుండానే కొత్త పార్టీకి ఇంకా ఏర్పట్ల పనిలో మునిగి ఉన్న రజనీకాంత్‌గాని ఇప్పట్లో ఈ రాజకీయ శూన్యాన్ని భర్తీచేసే సామర్ధ్యం లేదు. బ్రాహ్మణేతర కులాలకు సామాజికన్యాయం, మూఢాచారాల నిర్మూలన, హిందీ వ్యతిరేకత, తమిళ భాషా వికాసం వంటి సైద్ధాంతిక భూమికతో ఎదిగిన డీఎంకే, అన్నాడీఎంకేలు నేడు ఎలాంటి సైద్ధాంతిక బలం లేకుండా ముందుకుసాగుతున్నాయి. ఇలాంటి సిద్ధాంతాలేవీ లేకుండా, సమకాలీన తమిళ ప్రజలను ఆకట్టుకోవడానికి సినీ గ్లామర్‌ ఒక్కటే  ఈ ఇద్దరు నటులకు సరిపోదు.

వామపక్షాలకు దగ్గరగా ఉన్నట్టు కనిపించే కమల్‌ పార్టీ నిర్మాణం కూడా అనుకున్నట్టు జరగడం లేదు. రజనీకాంత్‌కు ఎలాంటి సైద్ధాంతిక బలం లేకున్న తనకున్న ‘ఆధ్యాత్మిక’ నేపథ్యంతో ఎన్నికల్లో బీజేపీకి దగ్గరవ్వచ్చేమోగాని అధికారంలోకి వచ్చే స్థాయిలో సీట్లు గెలుచుకోవడం సాధ్యం కాదనే అభిప్రాయం ఉంది. మళ్లీ పుంజుకునే అవకాశాలే లేని కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో పోటీచేయాలని కమల్‌హాసన్‌ ఆలోచిస్తున్నారు. హిందుత్వ సిద్ధాంతంతో తమిళులను ఆకట్టుకోవడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు కూడా ఆశించిన ఫలితాలు ఇచ్చే పరిస్థితులు లేవు.

స్టాలిన్‌ సామర్ధ్యంపైనే డీఎంకే భవితవ్యం!
అంకితభావంతో పనిచేసే కార్యకర్తలతో నిండిన పార్టీ యంత్రాంగం, అవసరమైన వనరులు, తగినంత అనుభవం ఉన్న స్టాలిన్‌ చాకచక్యంగా వ్యవహరిస్తూ పార్టీని నడపగలిగితే డీఎంకేను మరోసారి అధికారంలోకి తీసుకురావడానికి వీలవుతుంది. ఎప్పటి నుంచో పొత్తుల అనుబంధం ఉన్న కాంగ్రెస్, ఇతర చిన్నచితకా పార్టీలతో కలిసి బలమైన కూటమి నిర్మిస్తే కరుణానిధి వారసునిగా ముఖ్యమంత్రి పదవి చేపట్టడం కష్టమేమీ కాదనే అభిప్రాయాన్ని ఎక్కువ మంది రాజకీయ పండితులు వ్యక్తం చేస్తున్నారు. ద్రవిడ సిద్ధాంత వారసత్వం కూడా డీఎంకేకు కలిసొచ్చే ప్రధానాంశం. ప్రస్తుతమున్న సంక్లిష్ట రాజకీయ వాతావరణంలో డీఎంకే పార్టీ మాత్రమే ఎన్నికలను సునాయాసంగా ఎదుర్కొనగలదని రాజకీయ విశ్లేషకుల్లో అధిక శాతం అభిప్రాయపడుతున్నారు.
 - (సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top