ఇంతకీ ఆ సినిమాలో హీరోయిన్ ఎవరు.? | Who is In Rajini Next Movie Heroine | Sakshi
Sakshi News home page

ఇంతకీ ఆ సినిమాలో హీరోయిన్ ఎవరు.?

Jul 3 2018 8:20 AM | Updated on Oct 30 2018 6:01 PM

Who is In Rajini Next Movie Heroine - Sakshi

తమిళ సినిమా: అగ్రనటి అనుష్క, చెన్నై బ్యూటీ త్రిష, క్రేజీ నటి కాజల్‌అగర్వాల్‌ ఈ ముగ్గురిలో హక్కెవరికున్నదన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. సౌత్‌ ఇండియన్‌ సూపర్‌స్టార్‌తో రొమాన్స్‌ చేయడానికి ఈ ముగ్గురు భామలు పోటీ పడుతున్నారన్నది తాజా సమాచారం. చెబుతున్నది ఏ హీరో గురించో, ఏ చిత్రం గురించో ఇప్పటికే అర్థం అయ్యే ఉంటుంది. ఎగ్జాక్ట్‌గా అదే. స్టైల్‌ కింగ్, అభిమానుల తలైవా, ఎవర్‌గ్రీన్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తాజా చిత్రం గురించే ఈ ప్రస్తావన. ఆయన నటించి న కాలా అభిమానులు ఆశించిన స్థాయిలో లేకపోవచ్చు. అయితే అందులో నటుడిగా రజనీ కాంత్‌ ఫెయిల్‌ అవ్వలేదు. అందుకేనేమో నూతనోత్సాహంతో తదుపరి చిత్రానికి రెడీ అయిపోయారు. యువ దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో నటించడానికి డార్జిలింగ్‌ వెళ్లిపోయారు. ఈ చిత్రంలో చాలా విశేషాలే చోటు చేసుకుంటున్నాయి. ఇందులో రజనీకాంత్‌ లెక్చరర్‌గా నటిస్తున్నట్లు సమాచారం. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్ర కథ రాజకీయాలకు అతీతంగా ఉంటుందనీ, యాక్షన్‌ సన్నివేశాలు మాత్రం భారీ స్థాయిలోనే ఉంటాయని దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్‌ ఇంతకు ముందే స్పష్టం చేశారు.

మరో విశేషం ఏమిటంటే ఇంతకు ముందు ఎందిరన్, శివాజీ, కోచ్చడైయాన్‌ వంటి రజనీకాంత్‌ చిత్రాలకు స్టంట్‌ కొరియోగ్రఫి నెరపిన పీటర్‌ హెయిన్‌ ఈ చిత్రానికి పోరాట దృశ్యాలను కంపోజ్‌ చేయనున్నారు. యువ నటులు విజయ్‌సేతుపతి, బాబీ సింహాలు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. చిత్రం డార్జిలింగ్‌లో ప్రారంభమై హిమాలయాలు, ఇండియా పాకిస్థాన్‌ సరిహద్దులు అంటూ చాలా రిస్కీ ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకోనుందని సమాచారం. ఇంత సమాచారాన్ని అందించిన చిత్ర వర్గాలు కథానాయకి ఎవరన్నదాని గురించి చిన్న క్లూ కూడా ఇవ్వడం లేదు. ప్రచారంలో మాత్రం చాలా మంది ప్రముఖ నటీమణుల పేర్లు నానుతున్నాయి. మొదట్లో నటి సిమ్రాన్‌ పేరు వైరలైంది. అయితే ఆ ప్రచారాన్ని చిత్ర వర్గాలు ఖండిచాయి. ఆ తరువాత నటి కాజల్‌ అగర్వాల్‌ పేరు తెరపైకి వచ్చింది. ఇప్పుడు తాజాగా అందాల తార అనుష్క పేరు హల్‌చల్‌ చేస్తోంది. ఇక రజనీకాంత్‌తో ఒక్క చిత్రంలోనైనా నటించాలన్నది చెన్నై చిన్నది త్రిష చిరకాల కోరిక. దీంతో ఈసారి అయినా రజనీకాంత్‌తో నటించాలని తహతహలాడుతోందట. అందుకు ప్రయత్నాలూ తీవ్రం చేస్తోందట. ఆమెతో పాటు కాజల్‌ అగర్వాల్, అనుష్క వంటి టాప్‌ హీరోయిన్లు రజనీకాంత్‌తో నటించడానికి పోటీ పడుతున్నట్లు సమాచారం. వీరిలో అనుష్క మాత్రమే ఇంతకు ముందు రజనీకాంత్‌తో లింగా చిత్రంలో జత కట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement