మనకు హాస్యం తెలుసో లేదో గానీ...బ్రహ్మానందం తెలుసు. ఆయన నవ్వించిన వ్వులకు మనం వెలకట్టాలంటే ఒకటే మార్గం.
నాకు హాస్యం తెలుసో లేదో కానీ... నేను హాస్యానికి తెలుసు! మనకు హాస్యం తెలుసో లేదో గానీ...బ్రహ్మానందం తెలుసు. ఆయన నవ్వించిన వ్వులకు మనం వెలకట్టాలంటే ఒకటే మార్గం. ‘నూరేళ్లు నిండుగా నవ్వించు’ అని ఆశీర్వదించడమే. రేపు ఆయన 60వ బర్త్‌డే. శత హాసం భవతి. ‘సాక్షి ఫ్యామిలీ’ కోసం జర్నలిస్టు అవతారమెత్తి, సీనియర్ మోస్ట్ టాప్ కమెడియన్ బ్రహ్మానందాన్ని ఇంటర్వ్యూ చేసిన యంగ్ కమెడియన్ ‘వెన్నెల’ కిశోర్
‘వెన్నెల’ కిశోర్: సార్! బ్రహ్మానందం గారూ! ఈ ఫిబ్రవరి 1కి మీకు 60 ఏళ్ళు. సినీ పరిశ్రమకు వచ్చి 32 ఏళ్లు. ఇన్నేళ్ల మీ కెరీర్‌ను ఒక్క మాటలో చెప్పాలంటే?
బహ్మానందం: ఎన్నేళ్లనేది పక్కనబెడితే, ఇప్పటికి 1056 సినిమాలు చేశా. అన్ని సినిమాలు చూడడమేకష్టమైన విషయం. మరి చేయడమంటే మాటలా? నాకే ఒక్కోసారి ఆశ్చర్యమనిపిస్తుంది. ఇన్ని సినిమాలు చేయడం నా అదృష్టం. ఇది తెలుగు సినిమాకే సాధ్యమేమో. నాకు ఈ అదృష్టం లభించేలా చేసిన మొత్తం తెలుగు నటీనటులు, దర్శక, నిర్మాతలు, టెక్నీషియన్లకు రుణపడి ఉంటాను. బహుశా, ఈ 32 ఏళ్ళ కెరీర్‌లో అప్పుడు 5 రోజులు, అప్పుడు 10 రోజుల చొప్పున అంతా కలిపితే ఏడాది మాత్రమే నేను ఇంట్లో ఉండి ఉంటా. మిగతా నా జీవితం అంతా సెట్స్‌లోనే గడిచిపోయింది.
కిశోర్: క్రికెట్‌లో సచిన్ ఎలాగో, సినిమాల్లో మీరలా అని నా అభిప్రాయం. ఓ సందర్భంలో సచిన్‌ను ‘మీరు ఇన్ని విజయాలు సాధించారు! ఏదైనా మిస్ అవుతున్నారా?’ అని అడిగితే ఫ్యామిలీ లైఫ్ మిస్ అవుతున్నానని చెప్పారు. మరి ఇన్నేళ్లలో మీకు అలాంటి ఫీలింగ్ వచ్చిందా?
బ్రహ్మానందం: నేను ఆయనతో పోల్చుకోను కానీ, ఫ్యామిలీని కచ్చితంగా మిస్ అయ్యాను. మద్రాసులో సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్‌లో నేను, నా భార్య, ఏడాది వయసున్న సిద్ధు, మూడేళ్ల గౌతమ్‌తో ఉండేవాళ్లం. అక్కడి నుంచే హైదరాబాద్, రాజమండ్రి, విశాఖపట్నం, తిరుపతిలకు షూటింగ్ నిమిత్తం తిరిగేవాణ్ణి. ఉదయాన్నే షూటింగ్‌కు బయలుదేరాల్సి వచ్చేది. పిల్లలేమో అప్పటికి లేచేవాళ్లు కాదు. మళ్లీ ఎప్పటికో రాత్రికి ఇంటికి చేరేవాణ్ణి. అప్పటికే పిల్లలు నిద్రపోయేవారు. ఒక్కోసారి ఏ నాలుగైదు నెలలకో ఇంటికి వెళితే ‘పిల్లలు పెద్దోళ్ళయ్యారే’ అనిపించేది. నిజాయతీగా చెప్పాలంటే బతుకుతెరువు కోసమే వాటన్నిటినీ భరించాను. నాలుగు వేళ్ళూ నోట్లోకి వెళ్లే స్థితి లేదు కాబట్టి అంత కష్టపడి పనిచేశాను. నేను పడ్డ కష్టం నా పిల్లలు పడకూడదనేది నా తపన.
కిశోర్: ఇన్నేళ్లలో జంధ్యాల, ఈవీవీ, ఎస్.వి. కృష్ణారెడ్డి, శ్రీను వైట్ల లాంటి వేర్వేరు దర్శకులతో పనిచేశారు. కామెడీలోని రకరకాల దశల్ని చూశారు. గత ఏడాది వచ్చిన ‘దోచేయ్’లో కూడా కాంటెంపరరీ కామెడీ చేశారు. ఇంతమంది దర్శకులతో, ఇన్ని దశల్లో మిమ్మల్ని మీరెలా మౌల్డ్ చేసుకున్నారు. ఏది బెస్ట్ అని చెబుతారు?
బ్రహ్మానందం: ఇది బెస్ట్ అని చెప్పడం కచ్చితంగా కష్టం. మనం పోషించే పాత్ర అంటేనే నిర్ణీత షేప్ ఉన్న వెస్సెల్ లాంటిది. నీటిని గ్లాసులో పోశామంటే గ్లాస్ షేప్ వస్తుంది. కుండలో పోస్తే కుండలా, బిందెలో పోస్తే బిందెలా ఉంటుంది. అంటే ఇచ్చిన క్యారెక్టర్‌కి తగ్గట్లు మనం మౌల్డ్ కావాలి. దర్శకుడు అంటే దార్శనికుడని! మన పాత్ర ఇలా ఉండాలని అతను చెబితే అందుకు తగ్గట్టు మనం యాక్ట్ చేయాలి. అప్పుడు ప్రేక్షకులు కూడా ‘అరె బాగా చేశాడురా’ అనుకుంటారు. ఆ రోజుల్లోనే లక్కీగా విఠలాచార్య గారి దర్శకత్వంలో ‘శ్రీ శైల భ్రమరాంబికా కటాక్షం’ చిత్రంలో నటించే అవకాశం దక్కింది. కమలాకర కామేశ్వరరావు గారు తెరకెక్కించిన ‘ఏడుకొండలస్వామి’ చిత్రంలో చేశాను. వి. మధుసూదనరావు గారి ‘పాపే మా ప్రాణం’లో చేశా. అలా అప్పటి పెద్ద దర్శకులు రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్న సమయంలో వాళ్లతో పనిచేశాను. అలాగే, దాసరి గారు, రాఘవేంద్రరావు గారు, వాళ్ల తర్వాత బి.గోపాల్, కోదండరామిరెడ్డి, రవిరాజా పినిశెట్టి, శరత్, ముత్యాల సుబ్బయ్య, ఎస్వీ కృష్ణారెడ్డి, జంధ్యాల, ఈవీవీ - ఇలా అందరూ నాకు మంచి క్యారెక్టర్స్ ఇచ్చారు. నాకు ఏజ్ పెరిగిపోతున్నా, కొత్త తరం దర్శకులు వీవీ వినాయక్, రాజమౌళి, పూరి జగన్నాథ్, త్రివిక్రమ్, శ్రీను వైట్లతో చేస్తున్నా. ఇప్పుడొస్తున్న ఆ తర్వాతి తరం వాళ్ళయిన బోయపాటి శ్రీను, కొరటాల శివ, మారుతిలతో కూడా చేస్తున్నా. ‘వాళ్లిచ్చిన క్యారెక్టర్స్‌ను పండించడానికి అద్భుత మైన కృషి చేశాను’ అని అంటే నా దృష్టిలో ఆ దర్శకులను డామినేట్ చేసినట్లుంటుంది. అదే గనక న్యాయం చేశానంటే కరెక్ట్‌గా ఉంటుందేమో! అదే నా ప్రధాన ఎజెండా. అందుకే ఇన్నాళ్లు ఉండగలిగాను.
కిశోర్: త్రివిక్రమ్‌ది ఒక తరహా శైలి అయితే, బోయపాటిది మరో రకం జానర్. ఎవరి సినిమాకు తగ్గట్లు వారికి మారడానికి మీ ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ ఏదైనా హెల్ప్ అయిందంటారా?
బ్రహ్మానందం: కచ్చితంగా! కెమేరా ముందు పాత్రను అర్థం చేసుకొని తగినట్లు నటించడంలో కానీ, బయట మన ప్రవర్తనలో కానీ మన చదువు, సంస్కారం హెల్పవుతాయి. చదువుకున్నతనం కనిపిస్తుంది.
కిశోర్: ‘పోకిరి’లో మీరు ఫస్ట్ టైమ్ ఐపాడ్ పట్టుకుని కనిపిస్తారు. ఆ తర్వాత అది ట్రెండ్ అయింది. ఇక వీవీ వినాయక్ గారి ‘కృష్ణ’లో అయితే డైలాగ్స్‌లో ఇంగ్లీష్ ప్రాసలుంటాయి. ఇలాంటి సంభాషణలు తర్వాత చాలా సినిమాల్లో వచ్చాయి. అలా మీరు ఆ తరం నుంచి ఈ తరం వరకు ఎప్పటికప్పుడు కాన్‌టెంపరరీగా ఉంటున్నారు! మీరు దర్శకులకు మీ పాత్ర విషయంలో ఏదైనా ఇన్‌పుట్స్ ఇస్తారా?
బ్రహ్మానందం: వినేవాళ్లకు ఇన్‌పుట్స్ ఇస్తాను. ‘వీడు చెబితే నేను వినేందేంటి’ అన్న ఫేస్ పెడితే వాళ్లు చెప్పిందే చేస్తాను (నవ్వులు...)! నాకే కాదు... ఏ ఆర్టిస్ట్‌కైనా, ఎంతటి ఆర్టిస్ట్‌కైనా జరిగేదే అది! ఏదైనా మనం సినిమా బెటర్‌మెంట్ కోసం చేస్తాం. అల్టిమేట్‌గా డెరైక్టర్ తన మనసులో ఊహించుకున్నది డెలివర్ చేయాలి. యంగ్ డెరైక్టర్స్‌కైనా అంతే! వాళ్ళు తమ పాత్రలు ఎలా ఉండాలనుకుంటున్నారో అలాగే నటిస్తాను. ఒకవేళ ఆ కాన్‌టెంపరరీ విషయాల గురించి తెలియకపోతే తెలుసుకుంటాను. అందుకే, ఇలాంటి ట్రెండీ క్యారెక్టర్స్ బ్రహ్మానందం చే స్తేనే బాగుంటుందని ద ర్శకులు నమ్మి, నాకు అలాంటివి ఇస్తున్నారు. రానున్న ‘కృష్ణాష్టమి’ సినిమాలో సెల్ఫీ దిగడం కోసం అష్టకష్టాలు పడే గమ్మత్తై పాత్ర ఉంది. ఇవాళ్టి వాతావరణాన్ని ప్రతిబింబించే పాత్ర అది.
కిశోర్:‘ నరసింహనాయుడు’, ‘ఇంద్ర’ లాంటి సినిమాల్లో మీరు పురోహితుడు వేషం వేశారు. పురోహితుడైనా ఆ స్వభావం నుంచి బయటకొచ్చి మళ్ళీ లోపలికి వెళ్లిపోయే తరహా క్యారెక్టర్స్ అవి. ఆ తర్వాత అవి చాలా సినిమాల్లో వచ్చాయి. 2, 3 ఏళ్ల పాటు ఈ ట్రెండ్ సాగింది. ప్రేక్షకులకూ నచ్చింది. కానీ, అలా చేస్తోంటే ‘ఏంటి ఇలాంటి పాత్రలు’ అని అనుకోలేదా?
బ్రహ్మానందం: నటుడిగా మనం ఇక్కడ ఓ కొట్టు పెట్టుకున్నట్టు లెక్క. ‘ఇక్కడ ఇది అమ్ముతాను. అది అమ్మను’ అని అంటే కుదరదు. నా మీద నమ్మకంతో ‘అరె! వీడి మీద ఈ క్యారెక్టర్ వర్కవుట్ అవుతుంది’ అని దర్శక-నిర్మాతలు నమ్మినప్పుడు మనం ‘ఈ పాత్రలు నాకు బోర్ కొట్టేస్తున్నాయి’ అనడానికి వీల్లేదు. ఆఫ్ట్రాల్! వెయ్యి సినిమాలు చేసినా, రెండు వేల సినిమాలు చేసినా దర్శకుడు ఇస్తేనే కదా మనం చేస్తున్నాం! కాబట్టి, దర్శకుణ్ణీ, అతనిచ్చిన పాత్రల్నీ గౌరవించాలి. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ‘రేసుగుర్రం’లో కిల్‌బిల్ పాండే క్యారెక్టర్ చేశాను. మంచి పేరొచ్చింది. ఆయన తన నెక్స్ట్ సినిమాలో ఛాన్సిస్తే చేసినా, వర్కౌట్ కాలేదు. కానీ, ‘నాకు నచ్చలేదు. నేను చేయను’ అనడం ఎంత వరకూ కరెక్ట్! కచ్చితంగా చేయాలి. దాని వల్ల వచ్చే ప్రశంసల్ని ఎంజాయ్ చేసినట్లే, ఇబ్బందిని కూడా ఫేస్ చేయగలగాలి. అంతేకానీ, వాళ్లిచ్చే అవకాశాలను మనం వద్దనడం భావ్యం కాదు. నన్నడిగితే ఒకే టైప్ క్యారెక్టర్స్ వస్తున్నా, అదే డెడికేషన్‌తో చేయాలి. నా దృష్టిలో ఆర్టిస్ట్ అనేవాడు ఎలాంటి క్యారెక్టర్ చేయడానికైనా సిద్ధపడాలి, దానికి న్యాయం చేయాలి. ఒక చిన్న ఉదాహరణ చెబుతా. సూర్యకాంతం చేసినన్ని గయ్యాళి అత్తగారి పాత్రలు ఏ నటీ చేయలేదు. చూసేవాళ్ళకు బోర్ కొట్టిందా? లేదే! తాజాగా నేను ‘సోగ్గాడే చిన్నినాయనా’లో దొంగ బాబా క్యారెక్టర్ చేశాను. గతంలో అలాంటివి చేసినా, బోర్ కొట్టలేదు కదా! అలాగే, రచయిత, దర్శకుడు పాత్రను సమపాళ్ళలో డిజైన్ చేస్తే ఎన్ని చేసినా బోర్ కొట్టదు. ఇక, చూసేవాళ్ళ కామెంట్స్ అంటారా? అది వాళ్ల ఇష్టం! వంద రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కుంటున్నారు కాబట్టి ‘ఏంట్రా బ్రహ్మానందం ఇలా చేస్తున్నాడు, అదే రకం పాత్రలు చేస్తున్నాడు. రొటీన్‌గా ఉంది’ అని అనుకోవచ్చు. కానీ, ప్రేక్షకుల గొప్పతనం ఏమిటంటే, గతంలో చేసిన తరహా పాత్రలే అయినా కొత్తగా చేసినప్పుడు బాగుంటే మళ్ళీ చూస్తారు. ఆర్టిస్ట్‌కి ఇదొక ఛాలెంజ్. మనం సిన్సియర్‌గా చేస్తే తరచూ చేసే పాత్రలో కూడా ఒక కొత్తదనం వస్తుంది. అలాంటివాడే అసలు సిసలు ఆర్టిస్ట్.
కిశోర్: మీరు చేసిన పాత్రల్లో కొన్ని హిట్స్‌తో పాటు ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి. మరి ఆ ఫెయిల్యూర్స్ ప్రభావం మీ మీద ఏమైనా ఉందా?
బ్రహ్మానందం: మనదేముంది! చెబితే మోడెస్టీగా ఉంటుంది గానీ హిట్, ఫ్లాప్‌ల ప్రభావం ఫస్ట్ హీరో, డెరైక్టర్ మీద పడుతుంది గానీ కమెడియన్ క్యారెక్టర్ గురించి ఎవరు పట్టించుకుంటారు! నా క్యారెక్టర్ వల్ల హిట్, ఫ్లాప్ ఏంటి? సక్సెస్ అయితే మనం ఉపయోగపడతాం గానీ, మన వల్లే సక్సెస్ అయిందనుకొంటే పొరపాటు! ఒక్కోసారి వరసపెట్టి హిట్ అవుతూ ఉంటాయి. వీవీ వినాయక్‌గారి డెరైక్షన్‌లో చేసిన ‘కృష్ణ, అదుర్స్, అల్లుడు శీను’ - అన్నీ సూపర్‌హిట్స్. కానీ ఈ మధ్య వచ్చిన ‘అఖిల్’ మిస్‌ఫైర్ అయింది. ఆ మూడు హిట్స్ ఇచ్చిన దర్శకుడూ వినాయకే! ‘అఖిల్’ కూడా వినాయక్‌దే. ఆ హిట్లు కానీ, ఈ ఫ్లాప్ కానీ నా వల్లే వచ్చిందనుకొంటే అంత కన్నా అజ్ఞానం ఇంకొకటి లేదు! (నవ్వులు...)
కిశోర్: కానీ, కమెడియన్ల వల్ల సినిమాలు హిట్టవుతున్నాయని ఈ మధ్య...
బ్రహ్మానందం: (అందుకుంటూ...) గత అయిదేళ్ళ నుంచి అలా ఫీలవుతున్నారు. మేము ఫీల్ కాకపోయినా, చుట్టూ చేరి ఫీలయ్యేలా చేస్తుంటారు (నవ్వులు...).
కిశోర్: అంటే సినిమా ఎక్కడైనా స్లో అయినా బ్రహ్మానందం వచ్చి ఎలివేట్ చేస్తారని ప్రేక్షకులు చాలా కాలం నుంచి నమ్ముతున్నారు. కానీ, అలా చేసినా సినిమా మిస్‌ఫైర్ అయితే మీకేమనిపిస్తుంది?
బ్రహ్మానందం: కమెడియన్ల వల్లే సినిమాలు ఆడతాయనో, పోతాయనో అనుకొంటే అంతకన్నా అమాయకత్వం లేదు. సినిమాలో ఆ సమయంలో బ్రహ్మానందం వస్తే బాగుంటుందని డెరైక్టర్స్ క్రియేట్ చేస్తారు. అది నా క్రెడిట్ కాదు. ఆ పాత్రనీ, మనల్నీ నమ్మిన దర్శక, రచయితల క్రెడిట్. నాతో ‘రేసుగుర్రం’లో సురేందర్‌రెడ్డి అలా చేయించి ఉండకపోతే కిల్‌బిల్ పాండే క్యారెక్టర్ పండదు కదా! కానీ, అదే ‘కిక్-2’లో పండలేదు. ఒక్కమాట! మన ఒక్కడి వల్ల ఏ సినిమా ఫెయిల్ ఎలా కాదో, అలాగే సక్సెస్ కూడా కాదు. మీరు (‘వెన్నెల’ కిషోర్) కనిపించినప్పుడు కొంత మంది అభిమానులు ‘మీరు లేకపోతే సినిమా లేదు’ అని అంటారు. దానికి సంతోషించాలే తప్ప, నిజమని నమ్మేయకూడదు. ముందు ఆ భ్రమ నుంచి బయటపడాలి. కొన్నిసార్లు అది నిజమనుకొని, ఆ భ్రమ ఏ స్టేజ్ వరకూ వెళుతుందంటే ‘ఎవరో ఎందుకు? హీరోగా మనమే వేస్తే పోలా’ అనుకుని చేసిన వాళ్లూ ఉన్నారు. ఇప్పటికీ చేస్తున్నారు కూడా! కానీ, దాని వల్ల లాభం లేదు. సినిమా సక్సెస్‌ను మనం తలకెక్కించుకోకూడదు. మన తర్వాతే ఎవరైనా అనుకోవడం కరెక్ట్ కాదు. శరీరంలో గుండెకాయ, బ్రెయిన్, లివర్ లాంటి చాలా కీలక భాగాలున్నట్లే, సినిమా సక్సెస్‌కు చాలా ఉంటాయి. కానీ అవేవీ మనం కానే కాదు. కమెడియన్ అనేవాడు కేవలం ఒక చిటికెన వేలు లాంటి వాడు. కీలకమైనవన్నీ బాగున్నప్పుడే దీనితో తమాషాలు చేయవచ్చు. అది గ్రహించాలి. ఇది నేను ఈ తరం కమెడియన్స్‌కు ఇచ్చే సలహా అనే కంటే చిన్న సూచన అనుకోండి.
కిశోర్: తెలుగు పరిశ్రమలో ఉన్నంత మంది హాస్యనటులు ఇంకెక్కడా ఉండరేమో! మీరు ఎప్పటి నుంచో ఎంత మందినో చూశారు. కానీ, ‘అబ్బ! ఫలానా కొత్త కమెడియన్ వచ్చాడు. బ్రహ్మానందం పని అయిపోయింది’ అనే కామెంట్ చాలా కాలం నుంచి తరచూ వినిపిస్తోంది. కానీ వెంటనే మీరు ఫామ్‌లోకి వచ్చి, ఆ కామెంట్స్ తప్పని నిరూపించారు. ఇలాంటివన్నీ వింటున్నప్పుడు ఏమనిపిస్తుంది?
బ్రహ్మానందం: పర్‌ఫెక్ట్ క్వశ్చన్ ఇన్ పర్‌ఫెక్ట్ టైమింగ్! నేను గర్వపడే విషయం ఏంటంటే - ఎవరు వచ్చినా సరే బేసిక్‌గా అందరికీ నేనే టార్గెట్! బ్రహ్మానందాన్ని దాటాలనేదే వాళ్ళ లక్ష్యం. అది గొప్పే కదా! బాబూమోహన్ వచ్చినప్పుడు బ్రహ్మానందం అయిపోయాడన్నారు. ఏవీయస్, ధర్మవరపు సుబ్రమణ్యం,ఎల్బీ శ్రీరామ్, వేణుమాధవ్, ఎమ్మెస్ నారాయణ, సునీల్ - ఇలా ఒక్కొక్కళ్ళు వచ్చినప్పుడల్లా ఇదే కామెంట్! ఇలా ప్రతిసారీ అయిపోతూనే ఉన్నా (నవ్వులు...). నేను కాదనడం లేదు. టీవీలో వచ్చే ‘వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్’ (డబ్ల్యు డబ్ల్యు ఇ) కుస్తీ పోటీల్లో ఓ పహిల్వాన్ ప్రతిసారీ గెలుస్తూ ఉంటే, వాణ్ణి కొట్టేవాడి కోసం అందరూ ఎదురూచూస్తూ ఉంటారు. వాడికి ఏదో చిన్న దెబ్బ తగలగానే ‘అయిపోయాడ్రా’ అని శాటి స్ఫై అవుతాం. ఇది మానవ నైజం. తప్పు కాదు! కానీ ఒకవేళ నేనే గనక నిజంగా అయిపోతే ఇప్పుడు ‘బ్రహ్మోత్సవం’, ‘సర్దార్ గబ్బర్ సింగ్’, వెంకటేశ్-మారుతి సినిమా ‘బాబు... బంగారం’, అల్లు అర్జున్ ‘సరైనోడు’, చిన్న ఎన్టీయార్ ‘జనతా గ్యారేజ్’ - ఇన్ని సినిమాల్లో నాకు అవకాశాలు వస్తాయా? అందుకే, అలాంటి అవాకులు, చవాకులు చెవికి లోలాకుల లాంటివి. వినడానికి చాలా బాగుంటాయి. సత్యం వేరే ఉంటుంది.
సాక్షి: కానీ, పేపర్లలో, టీవీల్లో ఇలాంటి కామెంట్స్ వస్తుంటాయి. మరి, కొత్త కమెడియన్లను చూసినప్పుడు మీకేమనిపిస్తుంటుంది?
బ్రహ్మానందం: బ్రహ్మానందం అయిపోయాడని ఆ మధ్య కూడా టీవీ, పేపర్లలో వచ్చిందన్నారు. అలా రాయడం వాళ్ల డ్యూటీ! నటించడం నా డ్యూటీ! అంతే! ఇవాళ ‘జబర్దస్త్’కమెడియన్లతో పాటు చాలా మంది వస్తున్నారు. నా లాంటి సీనియర్లు సాధారణంగా వాళ్లను చూసి ఏమనుకుంటారు... ‘ఏంటి వాళ్ల మొహం! పిచ్చి కామెడీ చేస్తున్నారు. మా రోజుల్లో ఇలా ఉండేది కాదు’ అని వేళాకోళం చేస్తాం. నిజానికి, మేమూ ఒకప్పుడు అలాంటి కామెడీ చేసి వ చ్చినవాళ్లమేగా! అత్తా ఒకింటి కోడలే కదా!
సాక్షి: కానీ, కొత్త మార్పులు రుచిస్తున్నాయా?
బ్రహ్మానందం: చూడండి. మార్పు సహజం. సినీ రంగంలోనే కాకుండా రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాలన్నీ ఎంతో మారిపోయాయి. అప్పట్లో అర్ధరూపాయి పెడితే వచ్చేది ఇప్పుడు 15 రూపాయలు పెడితేనే గానీ రావడం లేదు కదా! అన్ని మార్పులకూ మనం సిద్ధంగా ఉండాలి. ఏమైనా, ప్రతి రంగంలో ఇలా ఒకరినొకరు డామినేట్ చేసుకుని ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నంలో ఇలాంటివన్నీ భరిస్తూ ఉండాల్సిందే. నేనూ భరిస్తా. సచిన్ టెండూల్కర్ తన రిటైర్‌మెంట్ ఇంటర్వ్యూలో ‘‘నా ముందు క్రికెట్ ఉంది. నా తర్వాత కూడా క్రికెట్ ఉంటుంది’’ అన్నాడు. హాస్యం విషయంలో నా మాట కూడా అదే! అంతేకాదు... హాస్యం నాకు తెలుసో లేదో తెలీదు గానీ హాస్యానికి మాత్రం నేను తెలుసు! నేను పెద్ద హాస్యనటుణ్ణి అని ఎప్పుడూ అనుకోలేదు. హాస్యకళామతల్లి వాడుకుంటున్న బిడ్డల్లో నేనూ ఒకణ్ణి అనుకుంటా. నాకు అది చాలు.
కిశోర్: (నవ్వుతూ...) మీకు ఇండస్ట్రీలో ఓ బ్యాడ్ నేమ్ ఉంది. మీ ఇంటికి ఎవరైనా వస్తే ఫుడ్ పెట్టి చంపేస్తారని!
బ్రహ్మానందం: (నవ్వేస్తూ...) చిరంజీవిగారి టైమ్ నుంచి నాకీ బ్యాడ్ నేమ్ ఉంది.
కిశోర్: మీకు గుర్తుందా? ‘దూకుడు’ సినిమా టైంలో మహేశ్‌బాబు లేచి వెళుతుంటే మీరు వెంటనే ‘సార్! ఇంటి నుంచి ఫుడ్ తెప్పించా’ అనగానే, ఆయన దణ్ణం పెట్టి వెళ్ళిపోయారు!
బ్రహ్మానందం: నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో క్యారవాన్లు లేవు. అందరం కలసి ఉండాలి, కలసి తినాలి. పదిమందితో పెరిగిన నాకు ఒక్కణ్ణే భోజనం చేయడమంటే తెలీదు. చిన్నప్పటి నుంచీ ఉన్నదాంట్లోనే కలిసి భోజనం చేయడం అలవాటు. సినిమాల్లోకి వచ్చాక కూడా అదే అలవాటు కొనసాగింది. అయితే, ఈ క్రె డిట్ అంతా నా భార్య లక్ష్మికే చెందుతుంది. ఇటీవల ఓ చానల్‌లో జరిగిన ప్రోగ్రామ్‌లో కూడా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ - ఇలా అందరూ నా భార్య చేతి వంట గురించి గొప్పగా చెబుతుంటే సంతోషంగా అనిపించింది. ఆ చిన్న విషయాన్ని కూడా అందరూ చాలా చెబుతుంటే ఎక్కడో తెలియని ఆనందం కలిగింది. ఎన్ని ఆస్తిపాస్తులున్నా ఇలాంటి మాటల ముందు అవి ఏవీ గొప్పగా అనిపించవు. బాపు-రమణ గారు, సింగీతం శ్రీనివాసరావు, ఎస్.పి.బాలసుబ్రమణ్యం, విన్సెంట్, రజనీకాంత్ - ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది గొప్పవాళ్లకు ఆతిథ్యమిచ్చే, అవకాశం, అదృష్టం దక్కాయి. అంత మాత్రాన ‘నేను గొప్పవాణ్ణి’ అని అనుకుంటే పప్పులో కాలేసినట్టే! నేను ఎంత గొప్ప నటుణ్ణి అయినా చివరికి కమెడియన్‌నే. అది మాత్రం మర్చిపోను.
కిశోర్: ‘సార్! ఏమీ అనుకోకపోతే రేపు షూటింగ్‌కి మీ ఇంటి నుంచి ముద్దపప్పు-ఆవకాయ తీసుకురండి’ అని చాలామంది నటులు మిమ్మల్ని అడిగేంత స్వేచ్ఛ ఇచ్చారు.
బ్రహ్మానందం: క్యాటరింగ్ వాళ్ళకు ఆర్డర్ ఇచ్చినట్లు ఆర్డర్ ఇచ్చేవాళ్ళూ ఉన్నారు (ఘొల్లున నవ్వులు...). ‘లక్ష్మిగారు కొంచెం పప్పు, రసం ఎలాగూ చేస్తారు కదా’ అని మొత్తం లిస్ట్ చెబుతారు. నేను, ఎమ్మెస్ నారాయణ కలిసి దాదాపు 15 రోజుల పాటు ‘దేనికైనా రెడీ’ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నాం. అప్పుడు ఎమ్మెస్‌కు మా ఇంటి నుంచే క్యారెజ్ వెళ్ళేది. అప్పుడు ఎమ్మెస్ ‘అన్నయ్యా! నా ఒంట్లో 500 గ్రాములు మీ ఇంటి భోజనంతో పెరిగినవే’ అనేవాడు. ఇలా ఎమ్మెస్, కృష్ణభగవాన్, నువ్వు (‘వెన్నెల’ కిశోర్), ‘జబర్దస్త్’ బ్యాచ్ వాళ్లు మాట్లాడుతుంటే టప టప మంటూ జోక్స్ వస్తూ ఉంటాయి. అందరితో అలా గడపడంలో ఆనందం ఉంది. ఆనందాన్ని వేరే చోటికి వెళ్లి పొందలేను.
కిశోర్: షూటింగ్ అయిపోయాక ఇంట్లో టైం స్పెండ్ చేయడమంటేనే మీకు ఇష్టం. ఆ మాట నాకు చాలాసార్లు చెప్పారు. కానీ, ఇప్పుడున్న జనరేషన్‌కు బయట ఎంటర్‌టైన్‌మెంట్ బోల్డంత ఉంది. మిడ్‌నైట్ పార్టీస్ అని చాలా ఉన్నాయి. ఇన్నేళ్ల కెరీర్‌లో మీకెప్పుడూ అలాంటివి మిస్ అవుతున్నామని అనిపించలేదా?
బ్రహ్మానందం: లేనే లేదు. నేను సినిమాలకు వెళ్ళను. షికార్లకు వెళ్ళను. ఆ మాటకొస్తే, పేపర్లలో చదవడమే తప్ప, రాత్రి 9.30 గంటల తర్వాత హైదరాబాద్ నైట్ లైఫ్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. నాకు ఎంటర్‌టైన్‌మెంట్ పుస్తకాల్లోనే దొరుకుతుంది. ఏదో ఒక పుస్తకం కాస్త చదివితే గానీ పడుకోను. నా జీవితం నాది. నా పని నాది.
సాక్షి: మీ సినిమాలు చూసి చాలా మంది తమ బాధల నుంచి రిలాక్స్ అవుతుంటారు. నిరాశా నిస్పృహల నుంచి తేరుకుంటారు. మరి మీకు నిరాశగా అనిపించినప్పుడు ఏం చేస్తారు?
బ్రహ్మానందం: జీవితంలో ఏదో ఒక టైమ్‌లో ప్రతి మనిషికీ బాధ, నిస్పృహలు కామన్. సుఖాన్ని ఎలా అనుభవిస్తామో, దుఃఖాన్ని కూడా భరించడానికి మనం సిద్ధపడాలి. దాని కోసం వేరే ఇక రిక్రియేషన్ ఎందుకని నా ఫీలింగ్! మీరన్నట్లు ఎవరైనా ఏదైనా అంటే మనం బాధపడిపోయి మందు కొట్టడం, లేదా వాడిని మరొకడి దగ్గర ఏదైనా నాలుగు మాటలు అని రిక్రియేట్ కావాలనుకుంటాం. అది తప్పు.
సాక్షి: మీరు ఈ మధ్య నటుడిగా కొంత రిలాక్స్ అయ్యారనుకోవచ్చా?
బ్రహ్మానందం: ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో ‘షూటింగ్‌కు నేను ఉదయం 9 30కి వస్తా. సాయంత్రం కాగానే వెళ్ళిపోతా’ అని చెబితే, ఓ నటుడు ‘ఏమిటండీ! అలా చెప్పేశారు! మీకు వేషాలు పోవా?’ అని అడిగాడు. నా స్థితి నేను చెప్పాను. అది తప్పు కాదు కదా! అయినా, గాంధీ గారి లాగా నేను అందరితో మంచిగా ఎలా ఉండగలను! ఉంటే ఏమైంది. గాడ్సే చంపేశాడు! మంచి మాటలు ఎవరూ వినరు. దురదృష్టవశాత్తూ, చెడు ఆకర్షించినంతగా మంచి ఆకర్షించడం లేదు. ఇన్నేళ్ళుగా నాన్‌స్టాప్‌గా పనిచేస్తూ వచ్చా. ఇప్పుడిక అతిగా ఆరాటపడకూడదు.
కిశోర్ - ఆ మధ్య ‘హుద్‌హుద్’ బాధితుల సహాయార్థం చేసిన ప్రోగ్రామ్‌లో మీరొక మానసిక వికలాంగుడి పాత్ర చేసి, అందరికీ కన్నీళ్ళు తెప్పించారు.అలాంటివి సినిమాల్లోనూ చేయాలని...
బ్రహ్మానందం - (అందుకుంటూ...) నాకు కొన్ని డ్రీమ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. అందులో ఇదొకటి. నా ఆత్మసంతృప్తి కోసం... తండ్రి, కొడుకు, మనుమడు - మూడు పాత్రలూ నేనే చేస్తూ, వేరెవరో నిర్మాతల మీద భారం పెట్టకుండా, నా సొంత డబ్బుతో, నా డెరైక్షన్‌లో నేనే చేయాలని అనుకుంటున్నా.
సాక్షి - మూడు నాలుగేళ్ళుగా ఆ పాత్ర గురించి మమ్మల్ని ఊరిస్తున్నారు!
బ్రహ్మానందం - ఈ బిజీ తగ్గాక, చేయాలని ఉంది. అదే కాదు. నా దగ్గర చిన్న చిన్న షార్ట్ స్టోరీస్ ఉన్నాయి. అవన్నీ సమాజానికి ఉపయోగపడేవి. ఒక్కొక్కదాన్నీ కొద్ది నిమిషాలు వచ్చే షార్ట్ ఫిల్మ్స్‌గా తీయాలని నా ఆలోచన.
సాక్షి - అయితే, స్క్రిప్ట్‌లు రాసుకుంటున్నారన్న మాట!
బ్రహ్మానందం - అలా ఏమీ లేదు. నేను బేసిగ్గా బద్ధకస్థుణ్ణి. కూర్చొని, పద్ధతిగా నేనెప్పుడూ స్క్రిప్ట్‌లు రాసుకోను. ఆలోచనలు వచ్చినప్పుడు, మాటల్లో వాటిని పక్కవాళ్ళతో పంచుకొంటూ ఉంటా.
సాక్షి - అరవై ఏళ్ళ జీవిత ప్రయాణంలో మీరు స్మరించుకోవాల్సిన వ్యక్తులెవరు?
బ్రహ్మానందం - చాలామంది ఉన్నారు. చిన్నప్పుడు బెత్తంతో కొట్టి మరీ పాఠాలు చెప్పిన పోటు కోటయ్య మాస్టారు. భీమవరంలో బి.ఏ (హిస్టరీ, పాలిటిక్స్, స్పెషల్ తెలుగు) చదువుతున్నప్పుడు నాకు వాళ్ళ ఇంట్లో ఆశ్రయమిచ్చి, అన్నం పెట్టి పోషించిన పొలిటికల్ సైన్స్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ సున్నం ఆంజనేయులు గారు, ఆయన భార్య సున్నం శారదాదేవి గారు. ఆ తరువాత ప్రిన్సిపాల్ అయిన ఆంజనేయులు గారి రికమండేషన్‌తోనే అత్తిలిలోని కాలేజ్‌లో లెక్చరర్‌గా చేరాను. ఇక, సినిమా రంగంలో నాకు తొలి ఛాన్సిచ్చిన జంధ్యాల గారు, ఆదరించిన చిరంజీవి గారు, ‘అహ నా పెళ్ళంట’లోని అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చిన నిర్మాత డి. రామానాయుడు గారు - ఇలా ఎంతోమందిని నేను రోజూ స్మరించుకుంటా.
సాక్షి - మీకు బాగా కన్నీళ్ళు తెప్పించిన సంఘటన, సందర్భం ఏదైనా?
బ్రహ్మానందం - నటుడు, మిత్రుడు ఎమ్మెస్ నారాయణ ఏడాది క్రితం చనిపోయినప్పుడు నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయా. ఎమ్మెస్ జ్ఞానసంపన్నుడు. అతను చనిపోయే ముందు కాగితం, కలం తీసుకొని, నన్ను చూడాలని ఉందని రాశాడట! వాళ్ళమ్మాయి ఫోన్ చేసి చెబితే, ఊరవతల షూటింగ్‌లో ఉన్న నేను హుటాహుటిన కిమ్స్ హాస్పటల్‌కి వచ్చా. చివరి దశలో ఎన్నెన్నో ఉన్నప్పుడు ఒక మనిషికి మనం గుర్తొచ్చిన మనిషి మనమంటే దాన్ని ఏమనాలి! అందుకే, నేను దుఃఖం ఆపుకోలేకపోయా.
సాక్షి - మరి, మీరు బాగా బాధపడిన సందర్భాలు?
బ్రహ్మానందం - ‘పద్మశ్రీ’ వివాదం టైమ్‌లో. నా ప్రమేయం లేకుండా వచ్చిన వివాదమది. సినిమా టైటిల్స్‌లో నా పేరు ముందు ‘పద్మశ్రీ’ వేశారని నన్ను కోర్టులో వివాదంలోకి లాగితే బాధపడ్డాను.
సాక్షి - చాలా ఏళ్ళ క్రితం రేలంగి విగ్రహస్థాపన వివాదం... ఇప్పుడిది... ఇలా వివాదాలొచ్చినప్పుడు...
బ్రహ్మానందం - మన ప్రమేయం లేని వాటికి మనం ఏం చేస్తామండీ! ప్రశంసలు వచ్చినప్పుడు తీసుకున్నట్లే, వివాదాలు వస్తే వాటినీ భరించాలి. తప్పదు. అందుకే, ఏదొచ్చినా సరే ఇవన్నీ ఏమిట్లే అని అనుకోవాలే తప్ప, మన గొప్ప, ప్రతిభ అని అహంకరించకూడదు.
సాక్షి - అన్నట్లు ‘వెన్నెల’ కిశోర్ గారూ! మీకు బ్రహ్మానందం గారితో ఎలా పరిచయమైంది?
కిశోర్ - దట్ క్రెడిట్ గోస్ టు బ్రహ్మానందం గారి పెద్దబ్బాయి గౌతమ్! మొదటి నుంచి అయామ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ బ్రహ్మానందం గారు. అమెరికా నుంచి ఇక్కడకు వచ్చాక సార్‌ను వ్యక్తిగతంగా కలవాలనుకున్నా. దర్శకుడు దేవ కట్టా, నటుడు ‘ఆనంద్’ రాజాలను అడిగాను కూడా! కానీ, ఎందుకనో కుదరలేదు. ఆ తరువాత ‘వారెవా’ (2011) టైమ్‌లో గౌతమ్ నా గురించి సార్‌కు చెబితే, ఆయన రమ్మని పిలిచారు. అప్పుడు మొదటిసారి వచ్చాను.
బ్రహ్మానందం- ఆ తరువాత మనం పిలిచినా రావట్లేదనుకోండి! (అందరూ ఫక్కున నవ్వారు)
కిశోర్ - ఫస్ట్ టైమ్ సార్ ఇంటికి వచ్చినప్పుడు నేను ఒకటే కోరాను - ‘సార్! మీ అవార్డులతో మేడ మీద ఒక మ్యూజియమ్‌లాగా ఉంటుందట! అది చూస్తాను’ అని. ఆయన పైకి తీసుకెళ్ళి చూపించారు. అక్కడ ఫోటో తీసి, ఫేస్‌బుక్‌లో పెడితే, రికార్డు స్థాయిలో లైక్స్ వచ్చాయంటే నమ్మండి.
సాక్షి - బ్రహ్మానందం గారూ! మీకింతకీ ‘వెన్నెల’ కిశోర్‌లో ఏం నచ్చుతుందో చెప్పనే లేదు!
బ్రహ్మానందం - వాళ్ళ నాన్న గారు టీచర్. టీచర్ల పిల్లలంటే, సహజంగానే ఒక డిసిప్లిన్‌లో ఉంటారు. పైగా, ఉన్నత విద్య చదువుకొని, అమెరికా వెళ్ళి ఉద్యోగం చేసి, సినిమా మీద ప్రేమతో అది వదులుకొని వచ్చినవాడు. జీవితం చూసినవాడు, చదువుకొన్నవాడు కాబట్టి, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలిసిన సంస్కారవంతుడు.అతనికి తిండి, సినిమాలే తప్ప వేరే గోల లేదు. స్మోకర్, డ్రింకర్ కానే కాదు. పబ్స్‌కు కూడా వెళ్లడు. పబ్లిసిటీ కోసం ఏవేవో చేసే వ్యక్తి కాదు. ఇలాంటి లక్షణాలేవో మనకూ, అవతలివాళ్ళకూ కామన్‌గా ఉన్నప్పుడే కనెక్ట్ అవుతాం. పైగా, ఈ మధ్య అతనికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ కూడా పెరిగింది. జిమ్‌లో కూడా జాయిన్ అయ్యాడు.
కిశోర్ - (మధ్యలోనే అందుకుంటూ...) అది కూడా సార్వల్లే! ‘దూకుడు’ టైమ్‌లో రామానాయుడు స్టూడియోలో షూటింగ్ జరుగుతున్నప్పుడు కింద నుంచి పైకి కొద్దిగా నడుచుకుంటూ వెళితే, బాగా ఆయాసపడ్డాను. అది చూసి, సార్ ప్రతిరోజూ వర్కౌట్ చేయాలని చెప్పారు. అంతే! జిమ్‌లో చేరా! నేను వెళుతున్నదీ లేనిదీ ఇప్పటికీ కనుక్కుంటూ ఉంటారు. ఇక అందరి లాగా నాకూ, సార్‌కీ మధ్య సినిమాల గురించి చర్చే ఉండదు. అవి తప్ప, ఇతర విషయాలే మాట్లాడుకుంటాం. నేను నా వ్యక్తిగత విషయాలను కూడా ఆయనతో పంచుకుంటాను.
సాక్షి - కిశోర్ గారూ! ఇంతకీ బ్రహ్మానందం గారు మీ నటనను మెచ్చుకున్న సందర్భాలేమైనా?
కిశోర్ - నిజానికి, సార్ బయట సినిమాలు చూసేదే తక్కువ. కానీ, ఆయన నన్ను ప్రత్యేకించి మెచ్చుకున్న రెండు సందర్భాలున్నాయి. ‘వారెవా’ (2011) సినిమాలో ఒక సీన్‌లో నేను బాత్‌రూమ్‌లో నుంచి బయటకు వచ్చినప్పుడు ఎక్స్‌ప్రెషన్‌లో ఒక చిన్న వేరియేషన్ ఇస్తాను. అన్నపూర్ణా స్టూడియోలో ఆ సినిమా డబ్బింగ్‌కు వచ్చిన బ్రహ్మానందం గారు అనుకోకుండా, ఆ క్లిప్ చూశారట. అంతే... ఆ సూక్ష్మమైన అంశాన్ని గుర్తించి, నాకు ఫోన్ చేసి మరీ అభినందించారు. ఇక, ఆనందానికి హద్దుల్లేవంటే నమ్మండి! ఇక రెండో సందర్భం ఏమిటంటే - ఒకసారి ఎయిరిండియాలో ట్రావెల్ చేస్తుంటే, ‘ఆగడు’ వేస్తున్నారట! అందులోని క్వశ్చనింగ్ సీన్ చూసి, నాకు ఫోన్ చేసి, మెచ్చుకున్నారు. అవి నేను ఎప్పటికీ మర్చిపోలేని బెస్ట్ కాంప్లిమెంట్స్.
బ్రహ్మానందం - ఇటీవలే ‘భలే భలే మగాడివోయ్’ సినిమాలో నటనకు గాను మన కిశోర్‌కు ‘ఐఫా’ అవార్డు కూడా వచ్చింది. అన్నిటికీ అవార్డులు రాకపోవచ్చు కానీ, అతను చేసిన అలాంటి మంచి సినిమాలు, పాత్రలు చాలానే ఉన్నాయి, ఉంటాయి.
సాక్షి - కిశోర్ గారూ! మీరు సార్‌తో కలసి నటించిన సినిమాలు, పంచుకున్న అనుభవాలు చెప్పండి!
కిశోర్ - సార్‌తో కలసి ‘దూసుకెళ్తా’, ఇటీవల ‘అఖిల్’ లాంటి సినిమాల్లో కలసి పనిచేసే అదృష్టం కలిగింది. వ్యక్తిగతంగా ‘అఖిల్’ షూటింగ్ నాకు మరపురానిది. బ్యాంకాక్ నుంచి దాదాపు గంటన్నర విమానప్రయాణ దూరంలో ‘క్య్రాబీ’ అనే దీవి ఉంది. నిర్మానుష్యమైన అక్కడ 15 రోజుల పాటు బ్రహ్మానందం గారి లాంటి గొప్ప వ్యక్తి సాంగత్యంలో గడిపే అపురూపమైన అదృష్టం నాకు దక్కింది. ఇంతకన్నా ఇంకేం కావాలి!
సాక్షి - బ్రహ్మానందం గారిలో మిమ్మల్ని బాగా ఇన్‌స్పైర్ చేసే విషయం?
కిశోర్ - ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్ సంగతుల్ని ఆయన బ్యాలెన్స్ చేసే తీరు నన్ను బాగా ఇన్‌స్పైర్ చేస్తుంటుంది. బయట ఎన్ని చీకాకులుండి, షూటింగ్‌కు వచ్చినా సరే, ఒక్కసారి కెమేరా ముందుకెళ్ళగానే వెంటనే పూర్తిగా మారిపోయి, ఆ పాత్రకు కావాల్సింది ఇస్తారు. వ్యక్తిగత అంశాల ప్రభావమేదీ ఆ పాత్ర మీద పడనివ్వరు.
బ్రహ్మానందం - నటుడన్నవాడు ఎవడైనా ఆ జాగ్రత్త పాటించాలి.
కిశోర్ - పైగా, బ్రహ్మానందం గారు నటిస్తున్నప్పుడు ఒక ఎక్స్‌ప్రెషన్‌కీ, మరో ఎక్స్‌ప్రెషన్‌కీ మధ్య గ్యాప్‌లో ఆయన ఇచ్చే చిన్నపాటి వేరియేషన్ కూడా అద్భుతం. అలా చేయడం సామాన్యం కాదు. అందుకే, ఆయన వీడియోలు పాజ్ చేసి, ఆ సూక్ష్మమైన విషయాన్ని కూడా నేను గమనిస్తా. అందరికీ చూపించి, చెబుతుంటా!
సాక్షి - ఇంతకీ, బ్రహ్మానందం గారి సినిమాల్లో మీకు బాగా నచ్చిందేమిటి?
కిశోర్ - నాకు ‘చిత్రం భళారే విచిత్రం’ చాలా ఇష్టం. ఎప్పుడూ ఆ సినిమా వేసుకొని చూసి, చూసీ నా దగ్గరున్న వీడియో కూడా పాడైపోయిందంటే నమ్మండి!
బ్రహ్మానందం - (లేని సీరియస్‌నెస్ తెచ్చిపెట్టుకొంటూ...) ఏంటీ! ఇది నా ఇంటర్వ్యూ అన్నారు? ఆయనదా? సరే ఆయన్ని ఇంటర్వ్యూ చేసి, వేసేయండి! (ఫక్కున అందరూ నవ్వులు...)
సాక్షి - మీ మధ్య జరిగిన తమాషా సంఘటన ఏదైనా చెబితే, ‘శుభం’ పలికేద్దాం!
కిశోర్ - సినిమా పేరు చెప్పను కానీ... ఒకసారి షూటింగ్‌లో ఉన్నాం. మధ్యలో రెండు గంటలు మాకు బ్రేక్ ఉంది. దాంతో, బ్రహ్మానందం గారు భోజనం చేసి వద్దామని ఇంటికి తీసుకొచ్చారు. శ్రీమతి బ్రహ్మానందం గారి ఇంటి వంటలు, ముఖ్యంగా గోంగూర మటన్ ఎంత బాగున్నాయంటే, నేను ఎంత తిన్నానో నాకే తెలీదు. తిన్నాక ఆ భుక్తాయాసంతో ‘ఒక అరగంట పడుకుంటాను సార్’ అని అడిగి, పడుకున్నాను.
బ్రహ్మానందం - (అందుకుంటూ...) అవును. పాపం అరగంటే పడుకొన్నాడు. కానీ, ఎన్ని గంటలకు నిద్ర లేచాడో తనకే తెలీదు! (నవ్వులు...)
కిశోర్ - (నవ్వుతూ...) పడుకొంటే, మూడు నాలుగు గంటలు నిద్ర లేవనేలేదు. కానీ, ఆయన ఏమీ అనలేదు. బ్రహ్మానందం గారి ఆతిథ్యం, మంచితనం అలాంటిది! ఒక్కమాటలో నటనలోనే కాదు, సంస్కారంలోనూ ఆయన మా లాంటి యువతరం నటులకే కాదు... సమాజానికి కూడా ఆయన రోల్‌మోడల్. మంచి మనిషి. ఆయన మరెన్నో పుట్టినరోజులు చేసుకోవాలి. ఇంకా ఎన్నో సినిమాల్లో నటించి, మన లాంటి ప్రేక్షకులందరినీ కడుపుబ్బ నవ్వించాలి. బ్రహ్మానందం గారూ! మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం నాకెప్పటికీ తీపి గుర్తు సార్! మీకు అడ్వాన్స్ హ్యాపీ బర్త్‌డే గ్రీటింగ్స్!!
- డాక్టర్ రెంటాల జయదేవ