
బాహుబలి అసలు కథ ఇదీ!
అసలు బాహుబలి ఎవరు.. ఎక్కడి వాడు? మాహిష్మతీ రాజ్యాన్ని కాసేపు పక్కన పెడితే.. జైనమహారాజు బాహుబలి ఒకరున్నారు. ఈయన సొంత ఊరు బహుధాన్యపురం. అదే నేటి నిజామాబాద్ జిల్లాలోని బోధన్.
బాహుబలి సినిమా కలెక్షన్లలో దూసుకెళ్తోంది. విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. అంతర్జాతీయంగా కూడా చాలామంది ఈ సినిమా గురించి సానుకూల అభిప్రాయాలను వెల్లడించారు. ఇంతకీ అసలు బాహుబలి ఎవరు.. ఎక్కడి వాడు? మాహిష్మతీ రాజ్యాన్ని కాసేపు పక్కన పెడితే.. జైనమహారాజు బాహుబలి ఒకరున్నారు. ఈయన సొంత ఊరు బహుధాన్యపురం. అదే నేటి నిజామాబాద్ జిల్లాలోని బోధన్. బోధన్ రాజధానిగా దక్షిణాపథాన్ని పాలించిన పరాక్రమశూరుడు బాహుబలి. ఈ బహుబాలే తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన రాజని చారిత్రక ఆధారాలు వెల్లడిస్తున్నాయి. బాహుబలి శిల్పాలు, జైనమత ఆధారాలు నిజామాబాద్ మ్యూజియంలో ఇప్పటికీ ఉన్నాయి.
బాహుబలి బోధన్ అటవీ ప్రాంతంలో తపస్సు చేసినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తున్నది. 525 ధనుస్సుల ఎత్తైన బాహుబలి విగ్రహం బోధన్ ప్రాంతంలో ఉండేదని, అది కాలగర్భంలో కలిసిపోయిందని, ప్రస్తుతం శ్రావణబెళగొళ విగ్రహానికి అదే స్ఫూర్తి అని చరిత్రకారులు చెబుతున్నారు. చరిత్ర ప్రకారం.. బోధన్ రాజధానిగా ఉన్న దక్షిణాపథాన్ని బాహుబలి పాలించుకోవటానికి ఆయన తండ్రి వృషభనాథుడు అనుమతి ఇస్తాడు. ఉత్తర భారతంలో అనేక రాజ్యాలు జయించిన బాహుబలి సవతి సోదరుడు భరతుడి కన్ను బాహుబలి రాజ్యంపై పడుతుంది. బాహుబలి లొంగకపోవటంలో భరతుడు యుద్ధం ప్రకటిస్తాడు..
యుద్ధంలో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం తప్పదని భావించిన ఇరు రాజ్యాల మంత్రులు ఒక అంగీకారానికి వస్తారు. సైన్యాల మధ్య యుద్ధాలు కాకుండా, ఇద్దరు రాజులు నిరాయుధంగా యుద్ధం చేయాలని, ఆ యుద్ధంలో ఎవరు విజేతగా నిలిస్తే వారికి రాజ్యాన్ని అప్పగించాలని నిర్ణయిస్తారు. ఈ ఒప్పందం మేరకు భరతుడు, బాహుబలి మధ్య ముందుగా దృశ్య యుద్ధం, జల యుద్ధం జరుగుతాయి. ఈ రెండింటిలోనూ భుజబల సంపన్నుడైన బాహుబలి విజేతగా నిలుస్తాడు. అనంతరం జరిగిన మల్ల యుద్ధంలోనూ ఒక దశలో భరతుడిపై బాహుబలి పైచేయి సాధిస్తాడు.. భరతుడిని తన బాహువుల మధ్య బంధిస్తాడు.
అయితే.. యుద్ధం చేస్తున్నప్పుడు బాహుబలిలో పరివర్తన వస్తుంది. తన తండ్రి త్యజించిన ఈ తుచ్ఛమైన రాజ్యం కోసం అన్నను వధించటం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్న ఆయనలో ఉదయిస్తుంది. అదే సమయంలో భరతుడు కూడా ఆలోచనలో పడతాడు. బాహుబలి పిడిగుద్దులతో తన చావు తప్పదని చివరికి భరతుడు కూడా ఆందోళన చెందుతుండగా... అప్పటికే పశ్చాత్తాప పడుతున్న బాహుబలి యుద్ధం నుంచి వైదొలగాడనేది జైన చరిత్ర.