శ్రీదేవి పుట్టిన రోజు ; అభిమానులకు తెలియని ఆసక్తికర అంశాలు

Sridevi Birthday 10 Interesting Things About Her - Sakshi

‘బూచడమ్మ.. బూచాడు బుల్లి పెట్టలో ఉన్నాడు’.. అంటూ ఆ చిన్నారి అందంగా, అమాయకంగా అభినయిస్తుంటే అబ్బా మనింట్లో కూడా ఇంత అందమైన బుజ్జి పాపాయి ఉంటే ఎంత బాగుండో అనుకున్నాం. అంతలోనే ‘ఆరేసుకుబోయి పారేసుకుంటే’ అంటూ ఎన్టీఆర్‌తో ఆడి పాడితే అరే ఇంత అందం ఇన్నాళ్లు ఎక్కడ దాక్కుందా అని ఆశ్చర్యపోయాం. ఆనాటి ఆ బడిపంతులులోని ఆ బుజ్జాయే ఈ బుజ్జమ్మ అనగానే ఇంతలోనే ఎంత ఎదిగింది అంటూ విస్తు పోయాం. ఇక ఆ నాడు మొదలైన ఆ అతిలోక సుందరి ప్రస్థానం కొన్ని దశబ్దాల పాటు తిరుగులేకుండా అలా కొనసాగింది.

దాదాపు 30 ఏళ్ల పాటు తన అందం, అభినయంతో పరిశ్రమను ఏలిన ఆ చాందినీ ఈ ఏడాది ఫిబ్రవరిలో నిజంగానే ఆ తారల్లో చేరారు. ఈ రోజు శ్రీదేవి జన్మదినం. బతికుంటే ఇది ఆమెకు 55వ పుట్టిన రోజు. కానీ నేడు ఆమె మన మధ్యలో లేరు. ఈ తొలి జయంతి సందర్భంగా ఆ వసంత కోకిలకు సంబంధించి అభిమానులకు తెలియని పలు ఆసక్తికర అంశాలు...

1. బాలీవుడ్‌లో లేడి సూపర్‌ స్టార్‌గా ఎదిగిన శ్రీదేవిని హలీవుడ్‌ అవకాశాలు వరించాయి. ప్రముఖ హలీవుడ్‌ దర్శకుడు స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ తన ‘జురాసిక్‌ పార్క్‌’ చిత్రంలో నటించాల్సిందిగా శ్రీదేవిని కోరారు. కానీ బాలీవుడ్‌కు దూరమవ్వడం ఇష్టం లేక ఆమె ఈ అవకాశాన్ని కాదన్నారు.

2. చాల్‌బాజ్‌ చిత్రంలోని ‘నా జానే కహా సే ఆయే హై’ పాట చిత్రీకరణ సమయంలో శ్రీదేవి హై ఫీవర్‌తో పడిపోయారంటా.

3 . శ్రీదేవి హింది పరిశ్రమలోకి వచ్చిన తొలినాళ్లలో ఆమెకు హిందీ రాదు.

4 . శ్రీదేవి బాలీవుడ్‌లో నం.1 పొజిషనలో ఉన్నప్పుడు ఆమెకు చాలా మంది కోటీశ్వరులైన భారత సంతతికి చెందిన బ్రిటీష్‌ ఇండియన్స్‌, అమెరికన్స్‌ నుంచి పెళ్లి ప్రతిపాదనలు వచ్చాయి.

5. ‘ఇంగ్లీష్‌ - వింగ్లీష్‌’ చిత్రంలో ఆంగ్లం రానీ సగటు భారతీయ ఇల్లాలుగా మెప్పించిన శ్రీదేవికి పలు భాషలు వచ్చు. తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్‌ ఆమె అనర్గళంగా మాట్లడగలరు.

6. తన కుటుంబాన్ని పోషించడానికి చాలా చిన్నతనంలోనే పరిశ్రమలోకి వచ్చిరు శ్రీదేవి. తల్లి, సవతి తండ్రి, చెల్లి, సవతి సోదరులకు ఆమె సంపాదనే ఆధారం.

7. శ్రీదేవి తన కుమార్తెలకు పెట్టిన పేర్ల వెనక కూడా చిన్న ఆసక్తికర సంఘటన ఉంది. జాన్వీ, ఖుషీ(పెద్ద కూతురు, చిన్న కూతుర్ల పేర్లు) అనే పేర్లు ఆమె భర్త బోనీ కపూర్‌ నిర్మించిన ‘జుడాయి’ (1997), ‘హమారా దిల్‌ ఆప్కే పాస్‌ హై’(2000) చిత్రాలోని హీరోయిన్ల పేర్ల కావడం విశేషం.

8. 1985 నుంచి 1992 వరకూ బాలీవుడ్‌ అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోయిన్‌ శ్రీదేవి.

9. శ్రీదేవి హిందీలో డబ్బింగ్‌ చెప్పుకున్న తొలి చిత్రం ‘చాందిని’. ఈ సినిమాకు గాను శ్రీదేవి తన పాత్రకు తానే డబ్బింగ్‌ చెప్పుకున్నారు.

10. 1993లో వచ్చిన షారుక్‌ ఖాన్‌ చిత్రం ‘బాజీగర్‌’లో తొలుత శ్రీదేవినే తీసుకోవాలనుకున్నారు. అది కూడా డబుల్‌ యాక్షన్‌. కానీ ఆ చిత్రంలో షారుక్‌ ఖాన్‌ ఒక శ్రీదేవి పాత్రను చంపాల్సి వస్తుంది. ప్రేక్షకులు ఆ విషయాన్ని ఒప్పుకోరు. అందుకే దర్శకుడు ఆ సాహసం చేయలేకపోయాడు. తర్వాత ఆ చిత్రంలో కాజల్‌, శిల్పా శెట్టిలను తీసుకున్న సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top