పాపారావుగారి వ్యాఖ్యలు బాధాకరం : శివాజీ రాజా

Sivaji raja about kakatiya Heritage trust Paparao Comments - Sakshi

కళాబంధు టి. సుబ్బిరామిరెడ్డి ఇటీవల మోహన్‌ బాబుకు విశ్వ నట సార్వభౌమ బిరుదును ప్రధానం చేస్తూ సన్మానించిన సంగతి తెలిసిందే. కాకతీయ కళావైభవోత్సవాలు పేరుతో జరిగిన కార్యక్రమంలో ఈ సన్మానం చేయటాన్ని కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్‌ కు చెందిన పాపారావు తప్పుపట్టారు. ఈ విషయంపై ఆర్టిస్టు, మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌ అధ్యక్షులు శివాజీ రాజా స్పందించారు. ‘సినిమా, సమాజం ఎప్పుడూ వేరు వేరు కాదు. ప్రజల‌తో మమేకమైన కళ సినిమా.. సినిమా కళాకారులు తొలినాళ్ల నుండి ప్రజల‌ పట్ల స్పందిస్తూ సహాయమందించడం తెలియని విషయం కాదు.

అలాంటి గొప్ప సినిమా రంగానికి సంబంధించిన సినీ నిర్మాత డా॥టి. సుబ్బిరామిరెడ్డిగారు సినిమా నటీనటుల‌ని సన్మానించే భాగంలో తొలుతగా డా॥మోహన్‌బాబు గారిని సన్మానించారు. ఇంకా ఎన్నో చోట్ల ఎన్నో వైవిధ్యమైన కార్యక్రమాలు జరగాల్సి ఉన్నాయి. ఈ సమయంలో శ్రీ పాపారావుగారు ‘సినిమా నటీనటుల‌ను సన్మానించకూడదు’ అని వ్యాఖ్యానిస్తూ హెచ్చరించడం బాధాకరం.

ఒకవైపు మన ప్రియతమ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖర్‌రావుగారు తెలుగు భాషకి మరింత గౌరవాన్ని తెచ్చే విధంగా ‘ప్రపంచ తెలుగు మహా సభలు’ జరిపి తనదైన ఔన్నత్యాన్ని చాటి భాషకు ఎల్లలు లేవు. కళకు సరిహద్దులు, భాషా బేధం లేదు అన్న రీతిలో తెలుగు సినీ నటీనటుల‌ను ఆహ్వనించి ఎంతో గొప్పగా ఘనంగా సన్మానించారు. శ్రీ కె.టి.ఆర్‌ గారు కూడా ప్రతీ నటిని, నటున్ని పేరు పేరున పల‌కరిస్తూ తనదైన అభిమానాన్ని చాటుకున్నారు. మంత్రి శ్రీ తల‌సాని శ్రీనివాసయాదవ్‌గారు కూడా సినీ పరిశ్రమ పట్ల, నటీనటుల‌ పట్ల తనదైన స్నేహభావాన్ని ప్రకటిస్తూ.. ఏ సహాయానికైనా వెనుకాడకుండా ఆదరిస్తున్నారు. మొన్నటికి మొన్న తెలుగు సినిమా నటుడు శ్రీ గుండు హన్మంతరావు అనారోగ్య పరిస్థితులు తెలుసుకుని వెంటనే సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుండి 5ల‌క్షల‌ రూపాయలు అందించారు కె.టి.ఆర్‌ గారు.

సినిమా నటీనటుల‌ పట్ల తనదైన గౌరవాన్ని చాటుకున్న శ్రీ కె.సి.ఆర్‌ గారి ప‌రిపాల‌నకి కృతజ్ఞతలు. ఇలాంటి సమయంలో శ్రీ పాపారావుగారు ‘సినిమా నటీనటుల‌ను సన్మానించకూడదు’ అని హెచ్చరించడం ఎంత వరకు సబబు అన్నది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం.. ఇలాంటి వ్యాఖ్యల‌ను ప్రభుత్వం కూడా సమర్థించదని అనుకుంటున్నాం’. అంటూ పాపారావు వ్యాఖ్యలను ఖండిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top