
సల్మాన్ కు థాంక్స్ :షారూఖ్ ఖాన్
ఎక్కడైనా శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రవులు ఉండరనే నానుడి తాజాగా మన బాలీవుడ్ అగ్రహీరోల విషయంలో మరోసారి రుజువైంది.
ముంబై:ఎక్కడైనా శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రవులు ఉండరనే నానుడి తాజాగా మన బాలీవుడ్ అగ్రహీరోల విషయంలో మరోసారి రుజువైంది. గతంలో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ , కండల వీరుడు సల్మాన్ ఖాన్ ల మధ్య చోటు చేసుకున్నవివాదానికి తెరదించే క్రమంలో పడ్డారు ఆ హీరోలు. ఈ మధ్యనే 'కింగ్ ఆఫ్ ద బాలీవుడ్' ఎవరని విలేకర్లు అడిగిన ప్రశ్నకు షారుఖ్ ఖాన్ అని సమాధానమిచ్చిన సల్మాన్ తన విధేయతను చాటుకున్నాడు. అందుకు షారుఖ్ ఖాన్ కూడా సల్మాన్ కు ధన్యవాదాలు తెలియజేశాడు.
తాజాగా సల్మాన్ వ్యాఖ్యలపై షారుఖ్ స్పందిస్తూ.. 'మేము ఇద్దరం గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకుంటాం. ఒకరి పట్ల ఒకరికి ద్వేషాలు ఏమీ లేవు.మేము ఏమి సాధించినా హార్డ్ వర్క్ తోనే చేసి చూపించాం. దాంతోనే మాకు పేరు ప్రతిష్టలు వచ్చాయి' అని షారుఖ్ తెలిపాడు. తాము ఎప్పుట్నుంచో సినిమా ఇండస్ట్రీలో ఉంటూ అభిమానుల్ని అలరిస్తున్నామన్న సంగతిని బాద్ షా గుర్తు చేశాడు. అయినప్పటికీ ఇద్దరం ఎప్పుడూ ఒకర్నొకరు కించపరుచుకునే విధంగా ప్రవర్తించ లేదని తెలిపాడు. మా ఇద్దరికీ నంబర్ గేమ్ పై అంతగా నమ్మకం లేదని తెలిపాడు. తాము ఎప్పుడూ మా తదుపరి సినిమాను ఎంత బాగా చేయాలని మాత్రమే ఆలోచిస్తామని షారుఖ్ తెలిపాడు.అంతకుముందు కూడా తనకు, సల్మాన్ఖాన్కు మధ్య స్నేహం, ప్రేమ మెండుగా ఉన్నాయని షారూఖ్ స్పషం చేసిన సంగతి తెలిసిందే.
బాలీవుడ్లో ఖాన్ దాదాలు ఇద్దరి మధ్య శత్రుత్వం, మళ్లీ వాళ్లు కలిసిపోవడం లాంటివి చాలాకాలంగా జరుగుతూనే ఉన్నాయి. 2008లో కత్రినా కైఫ్ పుట్టినరోజు పార్టీలో గొడవ జరిగేవరకు సల్మాన్, షారుక్ మధ్య సంబంధాలు బాగానే ఉండేవి. ఆ తర్వాతి నుంచి చాలాకాలం పాటు ఇద్దరూ ఒకరిని ఒకరు కలవడం మానేశారు. అయితే.. గత సంవత్సరంతో పాటు ఈ సంవత్సరం కూడా కాంగ్రెస్ నాయకుడు బాబా సిద్దిఖీ ఇఫ్తార్ విందులో మాత్రం ఇద్దరూ కౌగలించుకున్నారు.