బ్రిట్నీ స్పియర్స్ బతికేవుంది

బ్రిట్నీ స్పియర్స్ బతికేవుంది


బాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌ ఆత్మహత్య చేసుకుందన్న హడావుడి సద్దుమణక ముందే మరో సెలబ్రిటీ చనిపోయిందన్న ప్రచారం కలకలం రేపింది. ప్రముఖ పాప్‌ గాయని బ్రిట్నీ స్పియర్స్ ప్రమాదంలో మరణించిందన్న ప్రచారంతో అభిమానులు షాక్‌ తిన్నారు. అయితే అదంతా నిజం కాదని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. ప్రఖ్యాత మ్యూజిక్‌ కంపెనీ సోనీ అధికార ట్విటర్‌ పేజీలో ఈ వార్త రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.



‘బ్రిట్నీ స్పియర్స్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం. ఆమెకు నివాళులు’ అంటూ సోనీ మ్యూజిక్‌ గ్లోబల్‌ ట్విటర్ పేజీలో పోస్టు పెట్టారు. అయితే బ్రిట్నీ స్పియర్స్ చనిపోలేదని, ఆమె క్షేమంగా ఉన్నారని సీఎన్ఎన్‌ వార్తా సంస్థ తెలిపింది. సోనీ మ్యూజిక్‌ గ్లోబల్‌ ట్విటర్ ఖాతా హ్యాకింగ్‌ కు గురైనట్టు అనుమానిస్తున్నారు. అయితే దీనిపై స్పందించేందుకు సోనీ సంస్థ ప్రతినిధి నిరాకరించారు.



సెలబ్రిటీల ఖాతాలను హ్యాక్‌ చేసి వార్తల్లో నిలవడం ఇటీవల కాలంలో సాధారణ విషయంగా మారింది. హ్యాకింగ్‌ గురైన వారిలో టెక్నాలజీ దిగ్గజాలు ఉండడం గమనార్హం. గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్, ఫేస్ బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌ బర్గ్‌, అమెజాన్‌ సీటీవో వెర్నర్‌ వోజెల్స్‌ తదితర ప్రముఖులు కూడా హ్యాకర్స్ సవాళ్లను ఎదుర్కొన్నారు. ఐశ్వర్యరాయ్‌ ఆత్మహత్య చేసుకుందని ఇటీవల సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. ఇదంతా అసత్య ప్రచారమని తర్వాత తేలింది.




 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top