స్టోరీని కీలక సందర్భాల్లో డ్రైవ్ చేయడానికీ, టర్న్ చేయడానికీ పాటలే మెయిన్ టూల్స్. అలాగని అన్ని పాటలూ కీలకం కాకపోవచ్చు. కొన్ని సినిమా పాటల
స్టోరీని కీలక సందర్భాల్లో డ్రైవ్ చేయడానికీ, టర్న్ చేయడానికీ పాటలే మెయిన్ టూల్స్. అలాగని అన్ని పాటలూ కీలకం కాకపోవచ్చు. కొన్ని సినిమా పాటల పుట్టుక వెనుక మాత్రం ఆ సినిమాను మించిన ఆసక్తికరమైన కథనం ఉంటుంది. ఎవరికోసమో పాట రెడీ చేస్తే, ఇంకెవరికో ఆ పాటను వాడుకునే ప్రాప్తం దక్కుతుంది. ఒక సినిమా కోసం ట్యూన్ చేసి వేరే సినిమాలో పెట్టిన సాంగ్స్ కీరవాణి కెరీర్‌లో అర్ధశతకం మించే ఉంటాయి. వాటిల్లో సూపర్ డూపర్ హిట్టయిన నాలుగు పాటల తెర వెనుక కబుర్లు...
► మోహన్‌బాబు, శ్రీకాంత్, గ్రేసీసింగ్ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ‘తప్పు చేసి పప్పుకూడు’ (2001). ఈ చిత్రానికి దర్శకుడు ఎ. కోదండ రామిరెడ్డి, నిర్మాత మోహన్‌బాబు. హైదరాబాద్‌లోని లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఆఫీసులో మ్యూజిక్ సిట్టింగ్స్. లంచ్ తర్వాత స్వీట్స్ తినడం కీరవాణికి ఇష్టం. ఆ రోజు స్వీట్స్ లేవు. దాంతో ఆయనే పుల్లారెడ్డి స్వీట్ షాపుకెళ్లి కొన్ని రకాల స్వీట్స్ కొనుక్కున్నారు. ఆ షాపులో ఉండగా కీరవాణికో ఐడియా వచ్చింది. ‘నీ అధరామృతం పుల్లారెడ్డి... అరకేజీ అప్పుగ ఇస్తే కడతా వడ్డీ మీద వడ్డీ’ అనే ప్రాసతో కొన్ని లైన్లు అనుకున్నారు. మోహన్‌బాబుకి ఈ పాట రెడీ చేసి వినిపిస్తే ఆయన ‘‘మనకు సెట్ కాదు’’ అని చెప్పేశారు. దాంతో ఆ పాటను కీరవాణి అలాగే ఉంచేశారు. 2004లో రాజమౌళి ‘సింహాద్రి’ చేస్తున్నప్పుడు ఈ ట్యూన్ బయటకు తీశారు కీరవాణి. అదే... జనాన్ని ఊపేసిన ‘నువ్వు విజిలేస్తే ఆంధ్రా సోడాబుడ్డీ...’
►‘అల్లరి ప్రేమికుడు’(1994) కోసం ఓ పాట చేసి కె. రాఘవేంద్రరావుకి వినిపించారు కీరవాణి. ఏ కళనున్నారో కానీ, ఆయన ఇష్టపడలేదు. తర్వాత ఆ పాటనే నాగ్ ‘క్రిమినల్’ (1995) సినిమా కోసం దర్శకుడు మహేష్‌భట్ ఎంపిక చేసుకున్నారు. అదే... ఎవర్‌గ్రీన్ హిట్ ‘తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో...’.
►ఎ. కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో సినిమా కోసం కీరవాణి ఓ పాట చేశారు. ఎందుకనో ఆ పాట సినిమాలో ఉపయోగించడం కుదర్లేదు. దాంతో ఆ పాటను కె. రాఘవేంద్రరావుకు వినిపించారు. ఆయనకు బాగా నచ్చేసి ‘సుందరకాండ’ (1992) సినిమాలో వాడుకున్నారు. అదే మాస్ మెచ్చిన... ‘అరె మావ... ఇల్లలికి పండగ చేసుకుందామా...’
► రవితేజ హీరోగా కెమేరామ్యాన్ ఎస్. గోపాలరెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నా ఆటోగ్రాఫ్... స్వీట్ మెమరీస్’ (2004). ఇందులో రవితేజ ఓ మలయాళ యువతితో ప్రేమలో పడే సందర్భం కోసం కీరవాణి ఓ పాట చేశారు. దర్శకుడికి నచ్చలేదు. దాంతో ‘దువ్విన తలనే దువ్వడం...’ పాట చేసి ఇచ్చారు. గోపాలరెడ్డి తిరస్కరించిన ఆ పాటను రాజమౌళి తీసుకున్నారు. ఆ పాటే ‘ఈగ’ (2012)లోని ‘అరె ఆరె ఆరె ఆరె.’