విజయ్‌కి ఐటీ శాఖ సమన్లు

IT Department Notice to Hero Vijay Tamil nadu - Sakshi

షూటింగ్‌ కారణంగా హాజరుకాని విజయ్‌

ఐటీ దాడులను ఖండించిన సినీ, రాజకీయ ప్రముఖులు

తమిళనాడు ,పెరంబూరు : హీరో విజయ్‌కి ఆదాయపన్ను శాఖ సోమవారం సమన్లు జారీ చేసింది. ఐటీ కార్యాలయానికి వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అయితే సినిమా షూటింగ్‌లో బిజిగా ఉన్న నేపథ్యంలో ఆయన ఇందుకు హాజరు కాలేకపోయారు. ఇటీవల ఐటీ అధికారులు సుమారు 30 గంటల పాటు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. అందులో ఆదాయానికి సంబంధించిన లెక్కలన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయని, అదనంగా ఏమీ లభించలేదనే ప్రచారం జరగడంతో విజయ్‌తో పాటు, ఆయన సినీ వర్గాలు, ముఖ్యంగా ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే తాజగా ఐటీ అధికారులు కార్యాలయానికి వచ్చి వివరణ ఇవ్వాలంటూ సమన్లు జారీ చేయడంతో మరోసారి చర్చ మొదలైంది.

గత ఏడాది అట్లీ దర్శకత్వంలో ఏజీఎస్‌ సంస్థ నిర్మించిన బిగిల్‌ చిత్రంలో విజయ్‌ నటించారు.  బాక్సాఫీస్‌ వద్ద ఈ చిత్రం అధిక లాభాలు తెచ్చి పెట్టిందని ప్రచారం జరిగింది. సుమారు రూ.150 కోట్ల బడ్జెట్‌లో రూపొందిన ఈ చిత్రం రూ.300 కోట్ల వరకూ లాభాలను తెచ్చి పెట్టిందని ప్రచారం జరిగింది. వీటిపై బిగిల్‌ చిత్ర వర్గాలు ఐటీశాఖకు చూపించకపోవడంతో ఆ శాఖ అధికారులు ఇటీవల విజయ్, ఏజీఎస్‌ అధినేత అఘోరం, ఫైనాన్సియర్‌ అన్బు చెలియన్ల ఇళ్లల్లో సోదాలు నిర్వహించింది. మొత్తం 77 కోట్ల నగదు, పలు ఖరీదైన వజ్రాలు, బంగారంతో పాటు పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు ప్రచారం జరిగింది. అయితే విజయ్‌ ఇంటిలో ఏమీ దొరకలేదనే ప్రచారం జరిగింది. కాగా సోమవారం అనూహ్యంగా వీరందరికీ చెన్నైలోని ఆదాయశాఖ కార్యాలయానికి వచ్చి వివరణ ఇవ్వాలంటూ ఐటీ అధికారులు సమన్లు జారీ చేశారు. ముందు మూడు రోజుల్లోగా హాజరుకావాలని ప్రచారం జరిగింది. ఆ తరువాత సోమవారమే హాజరుకావాలని సమన్లలో పేర్కొనట్లు తెలిసింది.

హాజరు కాని విజయ్‌
ఈ నేపథ్యంలో విజయ్‌ సోమవారం కూడా తాను నటిస్తున్న మాస్టర్‌ చిత్ర షూటింగ్‌లో పాల్గొన్నారు. షూటింగ్‌ కారణంగా తాను ఆదాయశాఖ కార్యాలయానికి హాజరు కాలేకపోతున్నట్లు తెలిపినట్లు సమాచారం. మంగళవారం విచారణకు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అదే విధంగా ఏజీఎస్‌ సంస్థ అధినేత అఘోరం, ఫైనాన్సియర్‌ అన్బు చెలియన్‌ కూడా సోమవారం విచారణకు హాజరు కాలేదు. దీంతో ఐటీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారోనన్న  ఆసక్తి సర్వత్రా నెలకొంది.

విజయ్‌ అడ్డు పడతారనే భయంతోనే
కాగా విజయ్‌ ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు, ఆయన నటిస్తున్న మాస్టర్‌ చిత్ర షూటింగ్‌ను బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడంపై సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇప్పటికే  రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ నేతలు, సీపీఎం నేతలు, నామ్‌ తమిళర్‌ పార్టీ నేత సీమాన్, పలువురు సినీ ప్రముఖులు ఈ దాడులను ఖండించారు. తాజాగా  దర్శకుడు, నటుడు అమీర్‌ సైతం ఐటీ దాడులను ఖండించారు. ఆదివారం చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ తమిళనాడులో బీజేపీ ఎదుగుదలకు విజయ్‌ అడ్డం అవుతారనే భావనతోనే ఇలాంటి సంఘటనలకు పాల్పడుతున్న భావన కలుగుతోందన్నారు. వారి ఆటంకాలు విజయ్‌ ఎదుగుదలను అడ్డుకోగలవేమో గానీ, ఆయన్ని వెనుకడుగు వేయనీయవన్నారు. విజయ్‌ చిత్ర షూటింగ్‌లో ఆందోళనలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. విజయ్‌ రాజకీయాల్లో రావడాన్ని ఒక తమిళుడిగా తాను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు, విజయ్‌ తలచుకుంటే తన అభిమానులను షూటింగ్‌ ప్రాంతానికి రప్పించి ఆందోళన కారులను తరిమి కొట్టించి ఉండవచ్చునని అయితే ఆయన పరిపక్వతను ప్రదర్శించారని అన్నారు. బీజేపీ రజనీకాంత్‌తో రాజకీయం చేస్తుండటంతో విజయ్‌ ఎదుర్కొంటారనే భయంతోనే ఆయన ఇంటిపై ఈ ఐటీ దాడులని అమీర్‌ పేర్కొన్నారు.

ఐటీ దాడుల వ్యవహారంపై పార్లమెంట్‌లో చర్చ
పెరంబూరు : నటుడు విజయ్‌ ఇళ్లపై ఆదాయపన్ను శాఖ అధికారులు నిర్వహించిన సోదాలు ఇప్పుడు తమిళనాడును దాటి పార్లమెంట్‌ వరకూ వెళ్లింది. విజయ్‌ నటిస్తున్న మాస్టర్‌ చిత్రం షూటింగ్‌ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి ఆయన్ను ఐటీ అధికారులు సుమారు 5 గంటల పాటు విచారణ జరిపిన సంఘటన, ఆ తరువాత ఆయనకు చెందిన ఇళ్లల్లో రెండు రోజుల పాటు జరిపిన సోదాలు కలకలానికి దారి తీసిన విషయం తెలిసిందే. విజయ్‌ ఇళ్లలో ఐటీ సోదాలను పలువురు రాజకీయ పార్టీ నాయకులు ఖండించారు. కాగా ఈ వ్యవహారం ఇప్పుడు పార్లమెంట్‌ వరకూ వెళ్లింది. డీఎంకే పార్లమెంట్‌ సభ్యుడు దయానిధి మారన్‌ నటుడు విజయ్‌కు మద్దతుగా లోక్‌సభలో ప్రశ్నను రైజ్‌ చేశారు. రజనీకాంత్‌కు ఇటీవల కోటి రూపాయలకు పన్ను రాయితీని ఇవ్వడాన్ని ప్రశ్నిస్తూ, నటుడు విజయ్‌పై ఐటీ సోదాలు నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు. రజనీకాంత్‌కు ఒక న్యాయం, విజయ్‌కు మరో న్యాయమా? అంటూ ప్రశ్నించారు. కాగా దయానిధి మారన్‌ నటుడు రజనీకాంత్‌తో ఆయన 168వ చిత్రాన్ని నిర్మిస్తున్న కళానిధిమారన్‌ సోదరుడన్నది గమనార్హం. కాగా సోమవారం నటుడు విజయ్‌ మాస్టర్‌ చిత్ర షూటింగ్‌లో తనకు అండగా నిలిచిన అభిమానులతో సెల్పీ ఫోటో దిగి ధ్యాంక్యూ నైవేలి అంటూ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. దీంతో ఆయన అబిమానులు ఖుషీ అవుతున్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top