ఏబీసీడీల సూప్‌ హిందీ మీడియం

hindhi medium movie review - Sakshi

‘‘ఇస్‌ దేశ్‌ మే అంగ్రేజ్‌ జుబాన్‌ నహీ.. క్లాస్‌ హై (ఇంగ్లిష్‌ అనేది ఈ దేశంలో భాష మాత్రమే కాదు.. ఉన్నతవర్గాన్ని సూచించే మాధ్యమం)... ‘‘హిందీ మీడియం’’ సినిమాలోని డైలాగ్‌ ఇది! నిజ జీవితంలోని ప్రాక్టికాలిటీ కూడా! కులం, మతం, డబ్బే కాదు ఇంగ్లిష్‌ భాష కూడా సమాజాన్ని ఎలా వర్గీకరించిందో చెప్పే చిత్రం. హిందీ చోట దేశంలోని ఆయా భాషలను చేర్చుకుంటే అన్ని మెట్రోల  పరిస్థితే హిందీ మీడియం. మన భాషను మనం గౌరవించుకుంటే ఆ మాధ్యమంలో నడుస్తున్న ప్రభుత్వ సంస్థలు ముఖ్యంగా స్కూళ్లు బాగుంటాయని  హెచ్చరించే సినిమా!

 అసలు కథ... :
రాజ్‌భత్రా (ఇర్ఫాన్‌ ఖాన్‌), మీతా (సబా ఖమర్‌) భార్యాభర్తలు. ఢిల్లీలోని చాందినీ చౌక్‌లో రాజ్‌ ఒక ష్యాషన్‌ స్టూడియో (బట్టల దుకాణం)నడుపుతుంటాడు. అతని  మాట చాతుర్యం, మెళకువలతో వ్యాపారం చక్కగా సాగుతుంటుంది. తనని తాను లోకల్‌ టైకూన్‌గా అభివర్ణించుకుంటుంటాడు. పెద్దల ద్వారా సంక్రమించిన ఇల్లూ ఉంటుంది. వీళ్లకు ఒక పాప. పేరు పియ. ప్రేమానురాగాల కుటుంబం. చాలామంది లాగే ఈ ఇల్లాలికీ ఇంగ్లిష్‌ అంటే మహా మోజు. ఒక్కగానొక్క బిడ్డను ఢిల్లీలోని హైఫై ఇంగ్లిష్‌ మీడియం స్కూల్లో చేర్పించాలనే ఆరాటం. అక్కడి నుంచే  కథ మొదలు. పేరున్న ప్రైవేట్‌ స్కూల్లో సీట్‌ రావాలంటే ముందు తాముంటున్న చాందినీ చౌక్‌ నుంచి మకాం మారాలని చెప్తుంది భర్తతో. తాతలనాటి ఇల్లు.. వదిలేదెలా?’’ అంటాడు భర్త. ‘‘బిడ్డ భవిష్యత్‌ కోసం’’  సెంట్‌మెంట్‌ బాణం వదులుతుంది భార్య. వెంటనే సౌత్‌ ఢిల్లీలోని వసంత్‌ విహార్‌కు మారుతుంది వాళ్ల నివాసం.

పరోటా పోయి పాస్తా:
రాజ్‌ తన భార్యను ‘‘మీతూ’’ అని పిల్చుకుంటుంటాడు ముద్దుగా. పాష్‌ లొకాలిటీలోకి వచ్చాక కూడా ఇంకా ఆ పాచి పేరెందుకు ‘‘హనీ’’ అని పిలవండి అంటుంది గారాలు పోతూ. మాటామంతి, కట్టూబొట్టు,తిండీతీరూ  అంతా ఆ స్థాయిలోనే ఉండాలి అంటూ ఆర్డర్‌ వేస్తుంది భార్య. అయోమయంగా తలాడిస్తాడు రాజ్‌. పరోటా స్థానంలో పాస్తా వస్తుంది... భాంగ్రాకి బదులు వెస్ట్రన్‌ డాన్స్‌ స్టెప్స్‌ పడ్తుంటాయి. సల్వార్‌ కమీజ్‌ పోయి మోడర్న్‌ అవుట్‌ఫిట్స్‌ కనపడుతుంటాయి. నమస్తేని మరిచిపోయి ‘‘హలో.. హాయ్‌.. హౌ ఆర్‌ యూ’’ ప్రాక్టిస్‌ మొదలవుతుంది. ఆ కాంప్లెక్స్‌లో ఇరుగుపొరుగు వాళ్లకు తామూ సోషల్లీ హైక్లాస్‌ విత్‌ హై ఇంగ్లిష్‌ హాబిట్స్‌ అని చూపించుకునే ప్రయత్నం చేస్తుంటుంది మీతా. పేరెంట్స్‌కి  మ్యానర్స్‌ ఉంటేనే వాళ్ల పిల్లలను తమ బిడ్డతో ఫ్రెండ్‌షిప్‌ చేయనిస్తారు.. ఆడుకోనిస్తారు అన్నమాట ఆ సొసైటీలో.

అడ్మిషన్‌ ప్రహసనం:
అదంతా ఒకెత్తయితే అమ్మాయి కోసం మంచి స్కూల్‌ను వెదకడం, అందులో అడ్మిషన్‌ కోసం పాటుపడడం ఒకెత్తు. ఒక్కో స్కూల్‌ ఫైవ్‌స్టార్‌ హోటల్‌ను తలపిస్తుంటుంది. ఆశ్చర్యపోతుంటాడు రాజ్‌. తప్పదు అని తరుముతుంటుంది భార్య. అడ్మిషన్‌ ఫారాల కోసం క్యూలో నిలబడ్డం.. మంచి ఇంగ్లిష్‌ కోసం కోచింగ్‌ సెంటర్లకు  వెళ్లడం.. అనే పరీక్షలను ఎదుర్కొ్కంటారు ఆ దంపతులు. అయినా  తమ గారాల పట్టికి టాప్‌ స్కూల్లో సీట్‌  దొరకదు. నిరాశ చెందుతున్న సమయంలో సోకాల్డ్‌ ఓ మంచి స్కూల్లో గరీబ్‌కోటాలో సీట్లు ఉంటాయని తెలుస్తుంది. కొంతమంది ధనవంతులు ఆ గరీబ్‌కోటాలో తమ బిడ్డను చేర్పించడం కోసం పేదవాళ్లుగా నటించి  గరీబు పిల్లల సీట్‌ను కాజేస్తున్నారని యాజమాన్యం కఠినంగా వ్యవహరిస్తుందీ విషయంలో. గరీబ్‌ బస్తీలకు వెళ్లి ఎంక్వయిరీ చేసి మరీ గీరబ్‌ కోటా సీట్‌ను కేటాయిస్తుందనే సమాచారం అందుతుంది రాజ్‌ కపుల్‌కి. తక్షణమే  వసంత్‌ విహార్‌ నుంచి స్లమ్‌కి వచ్చేస్తారు.

జీవితం అర్థమవుతుంది..:
దోమలు, ఎలుకలతో కుస్తీ పట్టలేక.. దోస్తీ కూడా చేయలేక నిద్రలేని రాత్రులను గడుపుతుంటుంది ఆ కుటుంబం. ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునేదాకా.. కనీస అవసరాలైన నీళ్లు, కరెంట్, బాత్రూమ్‌ వంటి వాటికి ఆ జనం ఎన్ని కష్టాలు పడుతున్నారో కళ్లారా చూస్తారు. డబ్బులు ఉండీ ఖర్చుపెట్టలేని కర్మను కలిగించిన గరీబ్‌ కోటాను మనసులో తిట్టుకుంటూ.. వెంటనే సీట్‌ అనే వరాన్నిచ్చే అదే కోటాను ప్రార్థించుకుంటూ గడుపుతుంటారు. అంతలోకే ఎంక్వయిరీకి వస్తారు స్కూల్‌ సిబ్బంది.

రాజ్‌ అండ్‌ ఫ్యామిలీని చూస్తే సిబ్బందికి అనుమానం వస్తుంది వాళ్లు పేదవాళ్లు కాదేమోనని. ఆ ఇంటి పక్కనే    శ్యామ్‌ ప్రకాష్‌ (దీపక్‌ దోబ్రియాల్‌) అనే కూలీ కుటుంబమూ ఉంటుంది. ‘‘వాళ్లు నిజంగానే గరీబులు’’ అని స్కూల్‌ వాళ్లను నమ్మిస్తాడు శ్యామ్‌. సీట్‌ వచ్చాక  స్కూల్‌ ఫీ కోసం రాజ్‌ ఏటీఎమ్‌లో డబ్బులు డ్రా చేస్తుంటే  చూసి ‘‘అయ్యో డబ్బుల్లేక దొంగతనం చేస్తున్నావా.. తప్పు’’ అని అతనిని ఆపి, ఓ కార్‌ కిందకు వెళ్లి గాయాలు చేసుకుంటాడు. ఆ గాయం కింద కారు ఓనర్‌ దగ్గర పాతికవేలు డిమాండ్‌ చేసి మరీ రాజ్‌కి ఇస్తాడు శ్యామ్‌ ప్రకాష్‌. అయితే ఆ స్కూల్లో తన కొడుక్కోసమూ దరఖాస్తు చేస్తాడు శ్యామ్‌ గరీబ్‌ కోటాలో.

చివరకు అతని కొడుకు స్థానంలోనే తన రాజ్‌  కూతురికి సీట్‌ ఖాయం అవుతుంది.ఇది రాజ్, అతని భార్యకు మాత్రమే  తెలుసు. తెలియని శ్యామ్‌ తమను మంచివాళ్లుగా నమ్ముతూ సహాయంగా ఉండడం రాజ్‌కు గిల్ట్‌గా అనిపిస్తుంటుంది. కార్‌ యాక్సిడెంట్‌ ఇన్సిడెంట్‌తో చాలా బాధపడ్తాడు. మోసం చేస్తున్నానే భావన అతనిని నిలవనివ్వదు. సీట్‌ ఖాయం కావడంతో మళ్లీ తమ ఇంటికి వెళ్లిపోతారు. ఇంకోవైపు శ్యామ్‌ ప్రకాష్‌ తన కొడుకును గవర్నమెంట్‌ స్కూల్లో చేర్పిస్తాడు. 

శ్యామ్‌ ప్రకాష్‌ కొడుకు చదువుతున్న ఆ స్కూల్‌ ఏదో తెల్సుకొని దానికి ఆర్థిక సహాయం చేస్తాడు రాజ్‌. ఆ స్కూల్‌ బాగవుతుంది. పేద పిల్లలకు విద్యాభిక్ష పెట్టిన ఆ వ్యక్తిని కలుసుకోవాలని అడ్రస్‌ కనుక్కొని అతని ఇంటికి వెళ్తాడు శ్యామ్‌. చూస్తే రాజ్‌. అవాక్కవుతాడు శ్యామ్‌. అప్పుడు తెలుస్తుంది తన కొడుకు సీట్‌ లాక్కుంది అతనే అని. మోసం చేశావని తిడ్తాడు శ్యామ్‌. కోపంగా వెళ్లిపోతాడు. ఆఖరికి ఓ డ్రమటిక్‌ సన్నివేశంతో తన కూతురినీ అదే గవర్నమెంట్‌ స్కూల్లో చేర్పిస్తాడు రాజ్‌. అప్పుడు హాయిగా ఊపిరి పీల్చుకుంటుంది ఆ జంట. ఆద్యంతం హాస్యంతో మన విద్యావ్యవస్థ, ప్రైవేట్‌ స్కూళ్ల మీద విసిరిన వ్యంగ్యాస్త్రం ఈ చిత్రం.

ముగింపు:
భాష.. భావప్రకటనా సాధనం. మాతృభాష.. ఆ స్వేచ్ఛను ప్రసాదిస్తుంది. నచ్చినట్టు బతికే అవకాశాన్ని కల్పిస్తుంది. కుల,మత, కలిమి,లేముల వర్గ సమాజాన్ని సమసమాజంగా మారుస్తుంది. ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి పరభాషా పరిజ్ఞానం అవసరమే. మనుషులను కలిపి ఉంచడానికి మాతృభాష మరీ అవసరం అని చూపించే సినిమా! ఏబీసీడీల సూప్‌ కన్నా అఆఇఈల గంజే అమృతం అని చెప్తుంది హిందీ మీడియం. సాకేత్‌ చౌదరి దర్శకత్వం వహించిన ఈ మూవీ అమేజాన్‌ ప్రైమ్‌లో దొరుకుతుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top